‘చెడ్డీ గ్యాంగ్‌’ భారీ చోరీ | - | Sakshi
Sakshi News home page

‘చెడ్డీ గ్యాంగ్‌’ భారీ చోరీ

Aug 14 2026 7:50 AM | Updated on Aug 14 2026 7:50 AM

‘చెడ్డీ గ్యాంగ్‌’ భారీ చోరీ

రిటైర్డ్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ ఇంట్లో

అర్థరాత్రి దోపిడీ

మదనపల్లెలో రూ.లక్షల్లో

సొత్తు అపహరణ

మదనపల్లె టౌన్‌: మదనపల్లె పీ అండ్‌ టీ కాలనీలో ‘చెడ్డీ గ్యాంగ్‌’గా అనుమానిస్తున్న ముసుగు దొంగల ముఠా భారీ చోరీకి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. ఐదుగురు సభ్యులున్న ఒక పక్కా ప్రొఫెషనల్‌ దొంగల ముఠా రిటైర్డ్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ రవీంద్ర ఇంటి పరిసరాలను ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించింది. కాలనీలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం పరిసరాలు, ప్రధాన వీధుల్లో ఒంటిపై తువ్వాళ్లు, పంచెలు కప్పుకుని, వీపులకు బ్యాగులు తగిలించుకుని సంచరిస్తూ రెక్కీ నిర్వహించినట్లు స్థానిక సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ముందస్తు ప్లాన్‌ ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత రంగంలోకి దిగిన ఈ ఐదుగురి ముఠాలో ఒకరు బయట కాపలాగా నిలబడగా, మిగిలిన నలుగురు దొంగలు కాంపౌండ్‌ గోడ ఎక్కి రవీంద్ర ఇంటి ఆవరణలోకి ప్రవేశించారు. సరిగ్గా రాత్రి 2.15 గంటల సమయంలో ఇంటి వెనుక వైపు ఉన్న కిటికీ ఇనుప గ్రిల్స్‌ను ఆధునిక కట్టర్లతో కట్‌ చేసి లోపలికి చొరబడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉండటం దొంగలకు బాగా కలిసొచ్చింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు రవీంద్రకు చెందిన ప్రధాన బీరువాను పగలగొట్టి అందులోని విలువైన సొత్తును కంటిరెప్పపాటులో సర్దేశారు. సుమారు 300 నుండి 400 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులతో పాటు రూ.25 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నారు. అత్యంత వేగంగా వ్యవహరించిన ఈ చడ్డీ గ్యాంగ్‌ ముఠా తమ పని పూర్తి చేసుకుని రాత్రి 2.40 గంటల ప్రాంతంలో సమీపంలోని బీడు పొలాల వైపు చీకట్లో వేగంగా పరుగెడుతూ పరారయ్యారు. భారీ చోరీ విషయం తెలియగానే అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి, అడిషనల్‌ ఎస్పీ వెంకటాద్రి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మదనపల్లె వన్‌టౌన్‌ సీఐ రాజారెడ్డి, సీసీఎస్‌ సీఐ మోహన్‌, ఎస్సై చంద్రశేఖర్‌లు సిబ్బందితో కలిసి దర్యాప్తు వేగవంతం చేశారు. క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. సుమారు రెండు వారాల క్రితం పీలేరు ప్రాంతంలో సంచరించిన ముఠాయే ఈ ఘోరానికి పాల్పడి ఉండొచ్చని ఎస్పీ గట్టి అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు స్పష్టం చేశారు. బాధితుడు రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు మదనపల్లె వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

సీసీ కెమెరాలో కనిపిస్తున్న

దొంగల ముఠా

బీరువాను పగులకొట్టిన దొంగలు,

చిందరవందరగా పడి ఉన్న దుస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement