ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ కారణంగా రైల్వే ట్రాక్ స్వల్పంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు సమాచారం.
వివరాల మేరకు.. నెల్లూరులోని కావలి రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఢిల్లీ నుంచి రేణిగుంటకు వస్తున్న గూడ్స్ రైలులోని రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ కారణంగా ట్రాక్ కొంత భాగం దెబ్బతిన్నట్టు రైల్వే అధికారులు గుర్తించారు. వెంటనే ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు అధికారులు, సిబ్బంది సన్నాహాలు చేస్తున్నారు. దీంతో, ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.


