తుపాను దాటికి చెరువు గట్లు ధ్వంసం
ప్రమాదంలో పక్షుల కేంద్రం చెరువు
భారీ వర్షాలకు విహార కేంద్రం మూసివేత
అటవీశాఖ నిర్లక్ష్యంతో గట్ల పటిష్ట పనుల ఆలస్యం
కైకలూరు: పక్షి ప్రేమికుల స్వర్గథామంగా రాష్ట్రంలో పేరు గడించిన ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల విహార కేంద్రంపై మోంథా తుపాను విరుచుకుపడింది. ఆహ్లాదాన్ని ఆవిరి చేసింది. అతిథ్యం కోసం విదేశాల నుంచి వస్తున్నా వలస పక్షులను భయపెట్టింది. తుపాను దాటికి గూళ్ళలో పక్షి కూనలు అల్లాడిపోయాయి. దీంతో పక్షుల కేంద్రాన్ని ఆరు రోజులుగా మూసివేశారు.
శీతాకాలం వలస పక్షులకు అనువైన కాలం. ఇటువంటి తరుణంలో తుపాను ప్రభావం పక్షులపై పడుతోంది. ప్రతి ఏటా కార్తీకమాసంలో పక్షుల వీక్షణకు పర్యాటకులు ఎక్కువగా వస్తారు. వేసవి కాలంలో నీరు లేకపోవడం, వర్షాకాలంలో గట్లు కొట్టుకపోవడం పరిపాటిగా మారుతుంది.
ఆటపాక పక్షుల విహార కేంద్రం చెరువు 275 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అరుదైన విదేశీ పెలికాన్ పక్షులు అధిక సంఖ్యలో ఇక్కడకు రావడంతో పెలికాన్ ప్యారడైజ్‌గా దీనికి నామకరణ చేశారు. కొల్లేరులో దాదాపు 186 రకాల పక్షి జాతులు సంచరిస్తాయి. ఆటపాక పక్షుల కేంద్రంలో 156 కృత్రిమ ఇనుప స్టాండ్లను అటవీశాఖ ఏర్పాటు చేసింది.
వీటిపై పెలికాన్ పక్షులు సంతానోత్పత్తి గావిస్తున్నాయి. ప్రస్తుతం 3,500 పెలికాన్ పక్షులు నివసిస్తున్నాయి. సాధారణ సమయంలో ఆటపాక విహార చెరువు 3 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది. దీనిని మరింత లోతు చేయాలని ప్రతిపాదనలు పెడుతున్నా అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం, నిధుల కొరతతో కార్యరూపం దాల్చడం లేదు.
మోంథా మోత మోగించింది
మోంథా తుపాను కొల్లేరు ప్రక్షుల కేంద్రంపై ప్రభావం చూపింది. ఆటపాక పక్షుల కేంద్రం సమీపంలో పోల్‌రాజ్ డ్రెయిన్(నాగరాజు కాల్వ) ఉంది. ఇది బుడమేరు, తమ్మిలేరు వంటి ఏరుల నుంచి వచ్చే నీటిని కొల్లేరుకు చేరుస్తుంది.
ప్రతి ఏటా డ్రెయిన్ నుంచి ఏర్పరిచిన తూములతో నీటిని పక్షుల కేంద్రానికి నింపుతారు. పక్షుల కేంద్రం, పోల్‌రాజ్ డ్రెయిన్ గట్టు ఒకటే కావడంతో గట్లు మునిగి నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం నీటి వరవడికి పక్షుల కేంద్రం గట్లు పూర్తిగా కోతగా గురయ్యాయి. కేంద్రంలో ఈసీ సెంటర్ ఆవరణలో నీరు చేరింది. నీటి ప్రవాహం తగ్గకపోతే పక్షుల కేంద్రం చెరువు మరింత ప్రమాదంలో పడుతుంది.
పట్టించుకోని ప్రభుత్వం
పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తామని గొప్పలు చెబుతున్నా ప్రభుత్వం కొల్లేరు పర్యాటక అభివృద్ధికి పైసా విదల్చడం లేదు. ఇటీవల ప్రకటించిన పర్యాటకాభివృద్ధి ప్రణాళికలో కొల్లేరు అంశమే లేదు. ప్రధానంగా ఆటపాక పక్షుల కేంద్రం అభివృద్ధి పట్టించుకోవడం లేదు.
నెల్లూరు జిల్లాలో ప్లేమింగో ఫెస్టివల్ పేరుతో ప్రతి ఏటా పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వపరంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఒక్క పర్యాయం పెలికాన్ ఫెస్టివల్ చేసినా ఇప్పటి వరకు దాని ఊసే లేదు. ఆటపాక పక్షుల కేంద్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు.


