అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం : వైఎస్ జ‌గ‌న్‌

Decentralised Development Is Our Priority Says AP CM YS Jagan - Sakshi

మూడు రాజధానులపై ముఖ్యమంత్రి జగన్‌

చంద్రబాబు, ఆయన మనుషులు భూములు కొన్న చోట రాజధాని కట్టాలా ?

అమరావతిలో జరిగింది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

మెగా నగరాలు ప్రజలకు పెనుభారం

గూఢచర్యం ఆరోపణ అర్థరహితం సాక్ష్యాలివ్వలేదు

హిందూస్థాన్‌ టైమ్స్‌ ఇంటర్యూలో తేల్చి చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌ 

సాక్షి, అమరావతి : యావత్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న విధానానికి తాము కట్టుబడి ఉన్నామని, ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమై ఉండాలనడం ఎంత మాత్రం సరికాదని అందుకే తాము మూడు రాజధానులను ప్రతిపాదించామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గుడ్లన్నీ ఒకే బుట్టలో ఉంటే తీవ్రంగా నష్ట పోతామని గతంలో చెన్నై, హైదరాబాద్‌ నగరాల విషయంలో అదే జరిగిందని ఆయన అన్నారు. అమరావతిలో జరిగింది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మాత్రమేనని, తాను తన మనుషులు భూములు కొన్న చోట అభివృద్ధి చేయాలని చంద్రబాబు చెబితే ఎలాగని జగన్‌ సూటిగా ప్రశ్నించారు. ‘హిందూస్థాన్‌ టైమ్స్‌’ ఆంగ్ల దినపత్రికకు తాజాగా ఇచ్చిన ఇంటర్యూలో జగన్‌ పలు అంశాలపై తన ఆలోచనలను స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలపై తమకు ఏ మాత్రం ఆసక్తి లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం బీజేపీకి అంశాల వారీ మద్దతు నిస్తున్నామని ఆయన తేట తెల్లం చేశారు. ఇంటర్యూ పూర్తి వివరాలు.. 

హిందూస్థాన్‌ టైమ్స్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కార్య నిర్వాహక, న్యాయ, శాసన విభాగాలకు మూడు రాజధానులు ఉండాలనే అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉంది. చర్చించుకోవడం సబ్‌ జ్యుడిస్‌ అవుతుంది. అయినప్పటికీ మీ ఈ ప్రయత్నం వెనుక పాలనాపరమైన ఉద్దేశ్యం ఏమిటి?

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ : మూడు రాజధానులు అనేది ఒక సామాన్యుడి ఆలోచన. రాజధాని విధుల విభజించాం.  విశాఖపట్నం నుంచి కార్యనిర్వాహక, అమరావతి నుంచి శాసన, కర్నూలు నుంచి న్యాయ వ్యవస్థ విధులు నిర్వహణ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ కూడా రాజధాని విధులు విభిన్న ప్రాంతాలకు కేటాయించవచ్చునని చెప్పింది. అన్ని విధులూ ఒకే చోట నుంచి ఎందుకు నిర్వహించాలి? చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో విధులన్నింటినీ కేంద్రీకరించడం వల్ల  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండు సార్లు తీవ్రంగా నష్ట పోయింది.

అన్ని గుడ్లూ ఒకే బుట్టలో ఉంటే నష్టపోతారని చరిత్ర చెబుతోంది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇంకా అదే వైఖరిని ఎందుకు కొనసాగించాలి? ఇది తార్కికమైన, హేతుబద్ధన ఆలోచన కానే కాదు. హైదరాబాద్‌లోని మాధాపూర్‌లో 1990 ప్రాంతంలో జరిగిన ‘ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌’ విధానమే మళ్లీ గత టీడీపీ పాలనలో అమరావతిలో జరిగింది. సచివాలయం, అసెంబ్లీ లేదా హైకోర్టు అనేవి అభివృద్ధి కాక పోతే ఎందుకంతగా వాటి గురించి పట్టించుకోవాలి. వాటి గురించి మాట్లాడుకోవద్దు. రాజధాని నిర్మాణానికి రూ.  లక్ష కోట్లు కావాలని గత ప్రభుత్వం చెప్పింది. రైతుల నుంచి సేకరించిన, సమీకరించిన (పూలింగ్‌) 33000 ఎకరాల భూమిలో మెగా భవన నిర్మాణాలకు ఏ మాత్రం అనువుగా లేని చోట ఒక నగరాన్ని నిర్మించడం కన్నా ఆయన (చంద్రబాబు) 500 ఎకరాల్లో మరొక చోట నిర్మాణానికి ప్రయత్నించి ఉండొచ్చు.  (చ‌ద‌వండి : మరో నాలుగు కులాలకు వైఎస్సార్‌ చేయూత)

ప్రశ్న : శివరామకృష్ణన్‌ నివేదిక ప్రకారం రాజధాని ఏర్పాటుకు కేవలం 500 ఎకరాలు సరిపోతే ఆయనకు(చంద్రబాబు) 33000 ఎకరాలు ఎందుకు కావాల్సి వచ్చింది?

జగన్‌ : అమరావతిలో జరిగిన భూ లావాదేవీలపై ఒక ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోంది. నాకు ముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మనుషుల బినామీ లావాదేవీలను వెలికి తీసే పనిలో ఉంది. ఆ ప్రాంతంలో స్వప్రయోజనాలను ఆశించి పబ్బం గడుపుకోవాలనే కొందరు వ్యక్తులు పేద రైతుల నుంచి భూములను కొనుగోలు చేశారు. ఆ తరువాతనే రాజధానిని అక్కడ పెడుతున్నట్లు ప్రకటన వెలువబడింది. భూకుంభకోణం చోటు చేసుకుంది. కారు చౌకధరలకు కొనుగోలు చేసిన వారు వేలాది కోట్ల రూపాయల లబ్ది పొందారు.

కేవలం ఒక వర్గానికి లాభం చేకూర్చడం కోసం గత ప్రభుత్వం చేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తప్ప మరొకటి కాదు. అభివృద్ధి అనేది ఒకే చోట కాకుండా దానిని వికేంద్రీకరించి రాష్ట్రమంతటికీ విస్తరింప జేస్తే అన్ని చోట్లా సమీప భవిష్యత్తులో గ్రోత్‌ సెంటర్లుగా విరాజిల్లుతాయి. ఉదాహరణకు కేరళ రాష్ట్రంలో ఎన్ని పెద్ద నగరాలున్నాయి? లేవే! అయినప్పటికీ ఆ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే అనేక ప్రామాణికాల్లో ముందంజలో ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి విస్తరింప జేస్తే విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు, తిరుపతి మరి కొన్ని నగరాలు అభివృద్ధి క్లస్టర్‌లు ఉంటాయి. పోర్టుల అభివృద్ధి కూడా జరుగుతోంది. వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న మధ్య కోస్తాలో అగ్రోలాజిస్టిక్‌ పార్కును కలిగి ఉండొచ్చు, అన్నీ కలిసి అభివృద్ధి దిశగా ముందుకు వెళతాయి. 

ప్రశ్న: చంద్రబాబును చులకన చేయడం కోసం అమరావతిని మీరు నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలకు ఏం సమాధానం చెబుతారు? టీడీపీ నేత కూడా మీ పరిపాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షంపై గూఢచర్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

జగన్‌ : అది పూర్తిగా అర్థరహితం. అమరావతి గురించే మేం ఎందుకు ఆలోచించాలి? యావత్‌ రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలనేది మా అభిమతం. అమరావతిని మేం వదలి వేయం. అక్కడి నుంచి శాసనసభ పని చేస్తుంది. దేశంలో ఏదైనా అంశంపై నిపుణులు ఇది తప్పుడు విధానం అని చెప్పినపుడు ఎందుకు పరిగణించరు? (గౌరవించరు?) మన దేశంలో ఏదైనా ఒక విధానంపై రెఫరెండం చేసే (ప్రజాభిప్రాయ సేకరణ) విధానం లేదు. అందువల్లనే నిపుణులు వ్యక్తం చేసే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడమే ఇక మిగిలి ఉన్న మార్గం. రెఫరెండమ్‌ కనుక అమలులో ఉంటే మేం ఆ విధానాన్ని కచ్చితంగా అనుసరించి ఉండేవాళ్లం. అభివృద్ధి వికేంద్రీకరణ అనే మా విధానానికి ప్రజలు మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారని మేం పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అభివృద్ధి వికేంద్రీకరణపై మేం కనుక రెఫరెండమ్‌ నిర్వహించి ఉంటే ఆ 29 గ్రామాల్లోని పది వేల మంది రైతులు మినహా యావత్‌ రాష్ట్ర ప్రజలు మా వెనుక మద్దతుగా నిలబడి ఉండే వారు. ఆ రైతులు కూడా ఎందుకు వ్యతిరేకిస్తారో కారణాలు విస్పష్టం.

రెఫరెండమ్‌కు అవకాశం లేదు కనుకనే కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదికను మేం గౌరవించాం. మేం కూడా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారి అభిప్రాయం తీసుకున్నాం. ఈ రెండు కమిటీలు నివేదికలు ఇచ్చాయి. బీసీజీ నివేదిక కూడా తీసుకున్నాం. వాటన్నింటి ఆధారంగా రాష్ట్ర రాజకీయ కార్య నిర్వాహక వర్గం అభివృద్ధి కేంద్రీకరణ కన్నా వికేంద్రీకరణ తరహా అయితే ఎంతో మెరుగ్గా ఉంటుందని ఒక ఆమోదంతో నిర్ణయం తీసుకుంది. మెగా సిటీలనేవి అవాంఛనీయం. వాటికి అన్ని రకాల వనరులు ఎక్కువగా అవసరమవుతాయి, అంతే కాదు ప్రజలకు పెనుభారంగా పరిణమిస్తాయి. అనువైన రీతిలో (ధరలకు) ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వం ప్రధాన పాత్రగా ఉండాలి. అందుకే మేం అభివృద్ధి వికేంద్రీకరణను సమర్థిస్తున్నాం.  అన్ని జిల్లాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల, వైద్య కళాశాలల ఏర్పాటుకు పూనుకుంటున్నాం. అంతే కాదు ప్రస్తుతమున్న 13 జిల్లాలను విభజించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నాం. (చ‌ద‌వండి : ప్రారంభమైన ‘కిసాన్‌ రైలు’ )

ఇక చంద్రబాబు చేస్తున్న గూఢచర్యం అనే ఆరోపణ పూర్తిగా అర్థ రహితమైంది. ఈ విషయంలో మీ వద్ద ఏమైనా సాక్షాధారాలుంటే ఇవ్వండి అని స్వయంగా డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు ప్రతిపక్షాన్ని అడిగారు. వారు ఎలాంటి సాక్ష్యాన్ని చూపలేక పోయారు. అదే మేం ప్రతిపక్షంలో ఉన్నపుడు మా పార్టీ సీనియర్‌ నేతల ఫోన్లను ‘ట్యాప్‌’ చేశారు. ఇందుకు సంబంధించి అధికారిక సాక్ష్యాధారాలను కూడా మేం  అప్పట్లో చూపించాం.


 
ప్రశ్న : మీ తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా చంద్రబాబుకు ప్రత్యర్థే. తాను, వైఎస్సార్‌ ఒకే సారి రాజకీయాల్లోకి వచ్చామని, ఒకే పార్టీలో స్నేహితులుగా ఉన్నామని చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రజారోగ్యానికి హానిని కలిగిస్తూ... ప్రాణాంతకంగా పరిణమించడమే కాక ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన సవాలు ఎదురవుతున్న సమయంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి రెండు ప్రత్యర్థి పార్టీల నేతలు ఏకమై పనిచేయాల్సిన అవసరం లేదంటారా?

జగన్‌ : అమరావతిలో తాము పెట్టిన పెట్టుబడులను ఎలా కాపాడుకోవాలనే ఏకైక ఆలోచనతో వారు (టీడీపీ) ఉండి పోయారు. వారికి ఇతరత్రా ఇక ఎలాంటి ఎజెండా లేదు. గత 15 నెలలుగా అయన (చంద్రబాబు) అమరావతి గురించి తప్ప ఇంక ఏ విషయంపైనా మాట్లాడ్డం లేదు. అసలు అమరావతి అనేది అంత చర్చనీయాంశం కానే కాదు. అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని మేం అనేక సార్లు చెప్పాం. మీరు , మీ మనుషులు భూములు కొనుగోలు చేశారనే ఒకే కారణంతో ఒకే చోట అభివృద్ధి చేయాలన్న ఆలోచనను మేం పరిగణించ లేం కదా?  ఇక ఏ సహకారం గురించి ఆయన (చంద్రబాబు) మాట్లాడుతున్నారు?  యావత్‌ రాష్ట్రం కరోనా మహమ్మారితో సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నపుడు, ఈ ఏడాది మార్చి తరువాత ఆయన ఏపీలో అడుగైనా పెట్టలేదే?

ప్రశ్న : మీరు గతంలో ఉండిన కాంగ్రెస్‌ పార్టీని పూర్తిగా ప్రక్షాళ చేయాలని వచ్చిన డిమాండ్లను మీరెలా చూస్తున్నారు? గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి లేకుండా అది మనగలుగుతుందని భావిస్తున్నారా?

జగన్‌ : చూడండి. మాది ఆంధ్రాలో బలమైన ఒక ప్రాంతీయ పార్టీ. జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో మాకు సంఖ్యాబలం లేదు. మాది లోక్‌సభలో నాలుగో అతి పెద్ద పార్టీ. విభజన వల్ల దారుణంగా ప్రతికూల పరిస్థితుల్లోకి పడిపోయిన (నష్ట పోయిన) ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసుకోవడం వరకే మా పాత్ర పరిమితమై ఉంటుంది. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే ప్రక్రియలో మేమున్నాం. అంతే కానీ జాతీయ స్థాయిలో మాకెలాంటి ఆసక్తి లేదు. 

ప్రశ్న : ఇంతకీ బీజేపీతో మీ సంబంధాల మాటేమిటి? మీరు ఆ పార్టీకి దగ్గరి మిత్రులు అనుకోవాలా? లేక అంశాల వారీ మద్దతు నిస్తున్న పార్టీ అనుకోవాలా? తరచూ మీ పార్టీ పార్లమెంటులో బీజేపీకి మద్దతు నిస్తూ ఉంది కదా? 

జగన్‌ : మా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ప్రధానం. అదే దారిలో వెళతాం. ఏం అంశంలోనూ మేం అదే విధంగా వ్యవహరిస్తాం. ఏపీకి ప్రత్యేక హోదా అనేది సాకారం అవుతుందని మేం విశ్వసిస్తున్నాం. ఇపుడు కాకపోయినా భవిష్యత్‌లో అది నిజమవుతుంది. ఆ విషయంపై మేం పూర్తి ఆశావహ దృక్పథంతో ఉన్నాం. బీజేపీకి మేం అంశాల వారీగా మద్దతు నిస్తున్నాం. మా పిసరంత మద్దతు కూడా అన్ని విధాలా రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే. ప్రధానంగా మేం విభజన తరువాత నష్ట పోయిన మా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే ప్రక్రియలో ఉన్నాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top