అర్ధరాత్రి.. పబ్‌.. మఫ్టీలో మహిళా డీసీపీ | DCP Riti Raj spy operation at Kings and Queens Pub In Kukatpally | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి.. పబ్‌.. మఫ్టీలో మహిళా డీసీపీ

Jun 8 2026 4:33 AM | Updated on Jun 8 2026 4:33 AM

DCP Riti Raj spy operation at Kings and Queens Pub In Kukatpally

సాధారణ దుస్తుల్లో పబ్‌లోకి వెళ్తున్న డీసీపీ రితిరాజ్‌ (బ్లాక్‌ డ్రెస్‌)

డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన రితిరాజ్‌ 

కింగ్స్‌ అండ్‌ క్వీన్స్‌ పబ్‌లోకి ఐటీ ఉద్యోగిలా అర్ధరాత్రి వెళ్లిన వైనం 

అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన, అసాంఘిక కార్యకలాపాల చిత్రీకరణ 

ఆపై స్థానిక పోలీసులకు సమాచారం దాడి చేసిన పోలీసు బృందం 

9 మంది సిబ్బందిపై కేసు, అదుపులోకి.. యజమాని వివరాల కోసం ఆరా

సాక్షి, హైదరాబాద్‌/కేపీహెచ్‌బీ కాలనీ: నగరంలో అదో పేరుమోసిన పబ్‌.. నిబంధనలకు పాతరేసి నిత్యం అర్ధరాత్రి దాటినా నడుపుతుండటమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలతో చెలరేగుతూ భారీగా డబ్బు దండుకుంటోంది. దీనిపై సమాచారం అందుకున్న కూకట్‌పల్లి మహిళా డీసీపీ రుతురాజ్‌ ఈ పబ్బులో గబ్బు పనులకు తెరదించేందుకు డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలోని మంజీరా మాల్‌లో ఉన్న కింగ్స్‌ అండ్‌ క్వీన్స్‌ (క్లబ్‌ మస్తీ) పబ్‌లోకి ఓ సగటు మహిళా టెకీలాగా స్వయంగా వెళ్లారు.

సెక్యూరిటీ సిబ్బందిని దూరంగా ఉంచి ఒంటరిగానే పబ్‌లోకి ప్రవేశించారు. ఆపై అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల తతంగాన్ని రికార్డు చేసి ఆధారాలు సంపాదించారు. అనంతరం అదనపు డీసీపీ షమీర్, కేపీహెచ్‌బీ ఠాణా అదనపు ఇన్‌స్పెక్టర్‌ కె.రవిలతోపాటు సిబ్బందికి సమాచారం ఇచ్చి పబ్‌పై దాడి చేశారు. ఈ తనిఖీల్లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని నిగ్గుతేలడంతో నలుగురు మహిళా సిబ్బంది, ఐదుగురు పురుష సిబ్బందిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.

అలాగే పబ్‌తోపాటు నిందితులపై బీఎన్‌ఎస్‌లోని 223, 292, 318(4) రీడ్‌ విత్‌ 3 (5) సెక్షన్లతోపాటు ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇమ్మోరల్‌ ట్రాఫికింగ్‌ యాక్ట్‌లోని 5, 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆదివారం వెల్లడించారు. 

కస్టమర్లకు మహిళా సిబ్బందితో ప్రలోభాలు.. 
పబ్‌ నిర్వాహకులు అక్కడ పనిచేస్తున్న యువతుల ద్వారా పురుష కస్టమర్లను వ్యభిచారం కోసం ప్రలోభపెట్టేలా చేస్తున్నారని.. వ్యభిచార కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని డెకాయ్‌ ఆపరేషన్‌లో వెలుగుచూసిందని ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వివరించారు. యువతులను ఎర వేయడం ద్వారా అక్రమ లాభం పొందేందుకు నిర్వాహకులు కస్టమర్లు తాగిన మద్యం, తిన్న ఆహార పదార్థాలకు అధికంగా బిల్లులు వసూలు చేస్తున్నట్లు తేలిందన్నారు.

అలాగే పబ్‌లోకి మైనర్ల ప్రవేశాన్ని నిరోధించేందుకు అవసరమైన చర్యలేవీ యాజమాన్యం తీసుకోకుండా యథేచ్ఛగా దందా సాగిస్తోందని చెప్పారు. అనుమతించిన సమయానికి మించి పబ్‌ను నిర్వహించడంతోపాటు ప్రభుత్వ అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా మద్యం, ఆహారం అందిస్తున్నారని గుర్తించామన్నారు. వాటన్నింటికీ మించి పోలీసు శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) లేకుండానే పబ్‌ నడుస్తోందని పేర్కాన్నారు.  

స్థానిక పోలీసుల తీరుపై డీసీపీ ఆగ్రహం 
డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన డీసీపీ రితిరాజ్‌ ఆ పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు, నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా ఎందుకు నిరోధించలేకపోయారంటూ స్థానిక పోలీసులను ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement