
సాక్షి,నరసరావుపేట/దాచేపల్లి: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఉప్పుతల యల్లయ్య కుమారుడు హరికృష్ణని ఆయన ఇంట్లో ఉండగా పోలీసులు అక్రమంగా బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హరికృష్ణ, ఆయన తండ్రి ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ నేతల దౌర్జన్యాలను భరించలేక తెలంగాణకు వలస వెళ్లి డ్రైవర్‌లుగా పనిచేస్తున్నారు. గురువారం స్వగ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఎటువంటి నోటీసులు హరికృష్ణ, కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా దురుసుగా ఆయనను తీసుకెళ్లిపోయారు. పోలీసు వాహనంలో కాకుండా స్థానిక టీడీపీ నేతకు చెందిన ప్రైవేట్ కారులో దాచేపల్లి సీఐ పి.భాస్కర్ బలవంతంగా అదుపులోకి తీసుకుని దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. తమ కుమారుడు ఏ తప్పు చేస్తే తీసుకెళుతున్నారని, కారణం చెప్పాలని తల్లిదండ్రులు కోరితే పోలీసులు వారిని భయభ్రాంతులకు గురి చేశారు.
దాచేపల్లి పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో హరికృష్ణని అక్రమంగా నిర్భంధించి చిత్రహింసలకు గురి చేసి చితకబాదుతున్నారన్న విషయం తెలుసుకున్న హరికృష్ణ కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ భాస్కర్ తీరుకు నిరసనగా స్టేషన్ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. అక్రమంగా నిర్భందించిన తమ కుమారుడు హరికృష్ణని చూపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. హరికృష్ణ తల్లి పురుగుల మందు డబ్బా తీసుకొని మా బిడ్డను చూపకపోతే చనిపోతామని కన్నీరుమున్నీరయ్యారు.
సీఐ క్వార్టర్‌లో హరికృష్ణ ఉన్నట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు అతన్ని చూసేందుకు వెళ్లారు. సీఐ క్వార్టర్‌లో హరికృష్ణ నడవలేని స్థితిలో బోరున విలపిస్తూ తల్లిదండ్రులకు కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు సీఐ భాస్కర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి ఆందోళన చేశారు. వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి ఆశోక్‌కుమార్, స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు స్టేషన్ వద్దకు చేరుకుని పోలీసుల తీరుని ఆక్షేపించారు. మాట్లాడేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలపై పిడుగురాళ్ల సీఐ వెంకట్రావ్ దురుసుగా ప్రవర్తించారు.
హరికృష్ణను చావబాదిన సీఐ భాస్కర్‌ను పిలిపించాలని డిమాండ్ చేయగా, సీఐ అందుబాటులోకి రాలేదు. విదేశీ పర్యటనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి కి ఈ విషయం తెలియడంతో వెంటనే వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ టీం సభ్యులను దాచేపల్లి పోలీసుస్టేషన్‌కు పంపారు. ఫోన్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. సీఐ భాస్కర్ వ్యవహరిస్తున్న తీరు చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధమని కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. ఆయనను చట్టం ముందు నిలబెట్టి తగిన శిక్ష పడేలా చూస్తామని హెచ్చరించారు.
పోలీసులు చిత్రహింసలు పెట్టారు
దాచేపల్లి పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేసినట్లు జడ్జి ముందు ఉప్పుతోళ్ల హరికృష్ణ వాంగ్మూలం ఇచ్చారని ఆయన తరఫు న్యాయవాది కిరణ్ దాసు తెలిపారు. గురువారం రాత్రి హరికృష్ణను జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు. హరికృష్ణ మాట్లాడుతూ పోలీసులు తన కాళ్లు, చేతులపై కర్రలతో కొట్టారని, సీఐ భాస్కరరావు చిత్రహింసలకు గురిచేశారని న్యాయమూర్తి ముందు వాపోయాడు. దాన్ని రికార్డు చేసిన న్యాయమూర్తి వైద్య పరీక్షల నిమిత్తం హరికృష్ణను గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్ చేసి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.