ఆహార పంటల విస్తీర్ణం పెరగాలి

Current food production needs to double by 2050 - Sakshi

2030 నాటికి ఆకలి కేకల్లో 670 మిలియన్ల జనాభా 

2050 నాటికి ప్రస్తుతం ఉన్న ఆహార ఉత్పత్తి రెట్టింపు కావాలి

వర్షపు నీటిని ఒడిసిపట్టాలి

ఫార్మర్‌ లెడ్‌ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించాం

‘సాక్షి’తో ప్రపంచ బ్యాంక్‌ గ్రూప్‌ గ్లోబల్‌ మిషన్‌ లీడర్‌ అమల్‌ తాల్బి

సాక్షి, విశాఖపట్నం: నీటి కొరత పెరిగే కొద్దీ ప్రజల జీవన ప్రమాణాల్లో అనేక మార్పులు వస్తాయని ప్రపంచ బ్యాంక్‌ గ్రూప్‌ గ్లోబల్‌ మిషన్‌ లీడర్‌ అమల్‌ తాల్బి తెలిపారు. ముఖ్యంగా ఆహార కొరత వేధిస్తుందని చెప్పారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు తప్పవన్నారు. 2030 నాటికి 670 మిలియన్ల మంది ఆకలితో అలమటిస్తారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు అనుగణంగా ఆహార పంటల విస్తీర్ణాన్ని పెంచాల్సి ఉందన్నారు.

2050 నాటికి ప్రస్తుతం ఉన్న ఆహార ఉత్పత్తి రెట్టింపయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో 500 మిలియన్లకు పైగా ఉన్న వ్యవసాయ క్షేత్రాల నుంచి 80 శాతం వరకూ ఆహారం ఉత్పత్తవుతోందని తెలిపారు. పేదరికాన్ని జయించేందుకు ప్రపంచ బ్యాంక్‌ అత్యంత కీలక నిర్ణయాలను అమలు చేస్తోందన్నారు. విశాఖపట్నంలో 25వ అంతర్జాతీయ కాంగ్రెస్, ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ (ఐసీఐడీ) ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ 74వ అంతర్జాతీయ సమావేశాల్లో అమల్‌ తాల్బి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ‘సాక్షి’తో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

నీటి ఎద్దడి పెరుగుతోంది..
గత 50 ఏళ్లలో వర్షపాతం గణనీయంగా 233 శాతం పెరిగింది. అయితే.. భూమికి చేరుతున్న వర్షపు నీటిని ఒడిసిపట్టడంలో పూర్తిగా విఫలమ­వుతు­న్నాం. ఈ కారణంగానే నీటి ఎద్దడి పెరుగుతోంది. వాతావరణంలో తలెత్తుతున్న 10 మార్పుల్లో 8 నీటికి సంబంధించినవే ఉంటున్నాయి. దీన్నిబట్టి చూ­స్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.

సుస్థిర లక్ష్యాలు నిర్దేశించుకున్నాం.. 
వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంక్‌ మిషన్‌ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా నీటి ఉత్పాదకత– సంరక్షణ, ఆహార ఉత్పత్తిని పెంపొందించడం తదితర అంశాలపై ప్రపంచ బ్యాంక్‌ సుస్థిర లక్ష్యాల్ని నిర్దేశించుకుంది. ఫార్మర్‌ లెడ్‌ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో నీటిపారుదల రంగంలో స్థితిస్థాపకత, సాగునీటి నిర్వహణలో ఖచ్చితత్వం, నీటివనరుల అభివృద్ధి, మురుగు నీటి నిర్వహణ, వ్యవసాయంలో అత్యాధునిక పద్ధతులు, యాంత్రీకరణ తదితర అంశాలపై ఈ మిషన్‌ పనిచేస్తోంది.

తొలి విడతలో ఆఫ్రికా దేశాల్లో 450 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు ఖర్చు చేస్తున్నాం. ఈ మిషన్‌లో భాగంగా 77 మిలియన్ల మంది రైతులకు లబ్ధి చేకూ­రుస్తున్నాం. అక్కడ విధానాల్లో అనేక మార్పుల్ని తీసుకొచ్చాం. భవిష్యత్తులో మిగిలిన దేశాల్లోనూ ప్రపంచ బ్యాంక్‌ మిషన్‌ని అమలు చేస్తాం. తద్వారా నీటి ఎద్దడి, ఆహార సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top