Covid - 19, Curfew Continue In Ap For 2nd Day - Sakshi
Sakshi News home page

కరోనా కట్టడికి ఏపీలో పకడ్బందీగా కర్ఫ్యూ..

Published Fri, May 7 2021 10:55 AM

Curfew Continues In AP For Second Day - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం రెండోరోజు గురువారం కూడా కర్ఫ్యూ కొనసాగింది. కర్ఫ్యూ సడలించిన ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజలు తమ పనులు చక్కబెట్టుకోవడానికి అలవాటుపడ్డారు. ప్రధానంగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు బయట జనం రద్దీ పెరిగింది. కూరగాయలు, పాలు, కిరాణా షాపులు, సూపర్‌ మార్కెట్లు కిటకిటలాడాయి. పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం షాపుల వద్ద పెద్దసంఖ్యలో జనం క్యూ కట్టారు. కర్ఫ్యూ సడలింపు సమయాల్లో రద్దీ పెరగడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

సడలింపు ఉన్న వేళల్లోను సెక్షన్‌ 144 అమల్లో ఉండటంతో జనం గుమిగూడకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని పోలీసులు మైక్‌ల ద్వారా ప్రజలకు వివరిస్తున్నారు. అవసరమైన సరుకుల కోసం బయటకు వచ్చినవారు మధ్యాహ్నం 12 గంటలలోపే ఇళ్లకు చేరేందుకు వడివడిగా వెళుతుండటంతో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర ప్రధాన నగరాలతోపాటు పట్టణాల్లోను 11 నుంచి 12 గంటల సమయంలో రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారిపోయాయి. 12 గంటల అనంతరం రోడ్లు వెలవెలబోయాయి.

రాష్ట్ర సరిహద్దులతోపాటు రాష్ట్రంలోని జిల్లాల్లోను చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు సోదాలు నిర్వహించారు. అత్యవసరమైతేనే కర్ఫ్యూ సమయాల్లో వాహనాలకు అనుమతిస్తున్నారు. గరికపాడు చెక్‌పోస్టు వద్ద తెలంగాణ నుంచి, మన రాష్ట్రం నుంచి వాహనాల రాకపోకలను కృష్ణాజిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, నందిగామ డీఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. చెక్‌పోస్ట్‌లో పోలీస్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా పలు ప్రాంతాల్లో పర్యటించి కర్ఫ్యూ అమలును పరిశీలించారు.

చదవండి: ఏపీ: 400 మంది ప్రాణాలను కాపాడిన పోలీసులు 
ఏపీ: కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు పునరావాసం 

Advertisement

తప్పక చదవండి

Advertisement