ఏపీ: కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు పునరావాసం 

Rehabilitation Of Children Orphaned Due To Corona - Sakshi

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కృతిక శుక్లా వెల్లడి 

సాక్షి, అమరావతి:  కరోనా కారణంగా తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలు అనాథలుగా మారిపోకుండా వారికి పునరావాసం కల్పించే చర్యలు చేపడుతున్నట్టు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కృతిక శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనాతో తల్లిదండ్రులను పోగొట్టుకున్న చాలా మంది పిల్లలు అనాథలుగా మారుతున్నారన్నారు. ఇలాంటి పిల్లలను చేరదీసి, వారికి జువైనల్‌ జస్టిస్‌ చట్టం ప్రకారం బాలల సంరక్షణ కేంద్రాల్లో రక్షణ కల్పించి పునరావాసం కోసం చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆమె తెలిపారు.

ఇందుకోసం 24 గంటలూ పని చేసే 181, 1098 (చైల్డ్‌ లైన్‌) టోల్‌ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. కోవిడ్‌ కారణంగా అనాథలైన పిల్లల గురించి ఎవరైనా సమాచారం అందించి రక్షణ, పునరావాస సేవలు పొందవచ్చన్నారు. అలాగే, తల్లిదండ్రులు ఇద్దరూ కరోనా వ్యాధి బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన సందర్భాల్లో పిల్లలను ఎవరూ పట్టించుకోని ఘటనలు కూడా ఉంటాయన్నారు. కరోనాపై భయంతో అపోహలతో అటువంటి పిల్లలను చుట్టు పక్కల వారు, బంధువులు ఆదరించే పరిస్థితి ఉండదన్నారు. అలాంటి బాలలకు కూడా తల్లిదండ్రులు కోలుకుని ఇంటికి వచ్చే వరకు సంరక్షణ కేంద్రాల్లో రక్షణ కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కృతిక శుక్లా తెలిపారు. ఆయా ప్రాంతాలకు చెందిన జిల్లా కలెక్టర్లు కూడా పిల్లలను సంరక్షించే చర్యలను పర్యవేక్షించి సేవలు అందించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని వివరించారు.

చదవండి: ఏపీకి 25 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు   
ఎన్‌440కె ఏపీలో వచ్చిన వేరియంట్‌ కాదు..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top