ఏపీకి 25 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు

25 Cryogenic Oxygen Tankers Per AP - Sakshi

 వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సాక్షి, అమరావతి: కోవిడ్‌తో చికిత్స పొందుతున్న బాధితులకు సకాలంలో ఆక్సిజన్‌ అందించేందుకు 25 క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఒక్కో ట్యాంకర్‌ సామర్థ్యం 20 టన్నులు ఉంటుందని, వీటి ద్వారా మొత్తం 500 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా లేదా స్టోరేజీ కెపాసిటీ సమకూరుతుందని చెప్పారు. ఇందుకోసం సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే అనుమతి ఇచ్చారని తెలిపారు.

కోవిడ్‌ కేర్‌ సెంటర్ల వద్ద వినియోగించేందుకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు కొనుగోలు చేస్తున్నామన్నారు. గురువారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్‌ చికిత్స అందిస్తున్న ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌(నెట్‌వర్క్‌) ఆస్పత్రులు, తాత్కాలికంగా 3 నెలలకు ఆరోగ్యశ్రీ కింద అనుమతి పొందిన ఆస్పత్రులన్నీ 50 శాతం పడకలను తప్పనిసరిగా కోవిడ్‌ బాధితులకు ఇవ్వాలని సింఘాల్‌ పేర్కొన్నారు.

50 శాతం పడకలు ఆరోగ్యశ్రీకి..
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ప్రస్తుతం 349 ఉండగా వీటిలో 25,058 పడకలున్నాయి. తాత్కాలిక ఎంప్యానెల్‌మెంట్‌ పరిధిలో 47 ఆస్పత్రులు ఉండగా ఇందులో 1,949 పడకలున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిలో సగం పడకలు ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాల్సిందే. వారికి సంబంధించిన ఖర్చును ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఆస్పత్రులకు చెల్లిస్తాం. పడకలు పూర్తిగా కేటగిరీల వారీగా విభజిస్తున్నాం. ఈ వివరాలన్నీ 104 కాల్‌సెంటర్‌ వద్ద, జిల్లా కలెక్టర్ల వద్ద ఉంటాయి. దీని ప్రకారం పడకల కేటాయింపు సులభమవుతుంది. వివరాలన్నీ  వీలైనంత త్వరగా సేకరించాలని కలెక్టర్లను కోరాం. ఆరోగ్యశ్రీ బాధితులకు ఇచ్చే పడకలు నిండిన తరువాత ఖాళీగా ఉంటే పేషెంటును కాదనకుండా ఇవ్వాలి. ప్రస్తుతం 108 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్స జరుగుతోంది. ఇందులో 16,962 పడకలున్నాయి. ఇప్పటివరకూ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో 16,871 మంది చేరగా 8,647 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందారు. 

ఆక్సిజన్‌కు ఇబ్బంది లేకుండా
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో సరఫరా సమస్యలు తలెత్తకుండా ఆక్సిజన్‌ పీఏఎస్‌లు ఏర్పాటవుతాయి.  3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేశాం. ఇప్పటికే టెండర్‌లు పిలిచాం. మరోవైపు థర్డ్‌వేవ్‌ గురించి మాట్లాడుతున్నారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా సమస్యలు లేకుండా ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. 

104కు ఒక్కరోజే 17,649 కాల్స్‌
గురువారం ఒక్కరోజే 104 కాల్‌సెంటర్‌కు 17,649 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ఇప్పటివరకూ 3,365 మంది డాక్టర్లు రిజిస్టర్‌ చేసుకోగా వీరిలో 608 మంది స్పెషలిస్టులున్నారు. 

ఆస్పత్రి దగ్గరే కోవిడ్‌ కేర్‌ సెంటర్‌
ఆస్పత్రుల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో జర్మన్‌ హ్యాంగర్‌ టెక్నాలజీతో వీలును బట్టి 100 నుంచి 200 పడకలతో కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ కూడా ఆక్సిజన్‌ బెడ్‌లు ఉంటాయి. కోవిడ్‌ కేర్‌లా ఉపయోగపడుతుంది, ఆస్పత్రిలాగా కూడా ఉంటుంది. వీలైనంత త్వరలో వీటిని ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖను కోరాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గురువారం రూ.100 కోట్లు ఇచ్చింది. వ్యాక్సిన్‌ కోసం మరో రూ.45 కోట్లు విడుదల చేసింది.

చదవండి: ఎన్‌440కె ఏపీలో వచ్చిన వేరియంట్‌ కాదు..
సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు: పావు గంటలో.. పని కానిచ్చేశారు! 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top