స్వర్ణప్యాలెస్‌ ఘటన: సీపీ కీలక వ్యాఖ్యలు

CP Srinivasulu Comments On Swarna Palace Fire Incident Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: స్వర్ణప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటనలో నిందితులు, అనుమానితులు విచారణకు సహకరించడం లేదని సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. రమేష్‌ ఆస్పత్రి, స్వర్ణప్యాలెస్‌ హోటల్‌ యాజమాన్యాల మధ్య ఏం ఒప్పందం జరిగిందో కూడా చెప్పలేకపోతున్నారన్నారు. విచారణలో భాగంగా.. రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం కరోనా చికిత్సకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తేలిందని పేర్కొన్నారు. ఎటువంటి జాగ్రత్తలు, నిబంధనలు పాటించకుండా కోవిడ్‌ సెంటర్‌ నిర్వహించారని తెలిపారు. ఈ ఘటనలో ఆస్పత్రి బోర్డు సభ్యులతో పాటు అనుమానితులుగా ఉన్న ప్రతీ ఒక్కరికి నోటీసులు ఇచ్చి విచారిస్తామన్నారు. ఇందుకు సంబంధించి విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసులో కీలక వ్యక్తుల సమాచారం ఇస్తే రూ. లక్ష బహుమతి ఇస్తామని సీపీ ప్రకటించారు.  (‘రమేష్‌ ఆస్పత్రి నిబంధనలు ఉల్లంఘించింది’)

కాగా స్వర్ణప్యాలెస్‌ ఘటనపై విచారణ కమిటి ప్రభుత్వానికి బుధవారం నివేదిక అందించింన విషయం తెలిసిందే. కృష్ణా జేసీ, విజయవాడ సబ్‌కలెక్టర్, సీఎంహెచ్‌ఓ, రీజనల్‌ ఫైర్‌ ఆఫీసర్, ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌లతో కూడిన విచారణ కమిటీ... రమేష్‌ ఆస్పత్రి అన్ని రకాలుగా ప్రభుత్వ నియమాలను, నిబంధలను పూర్తిగా ఉల్లంఘించించిందని తేల్చింది. వైద్య విలువలను నీరుగార్చి.. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా చట్టాలను తుంగలో తొక్కి 10 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని నివేదికలో స్పష్టం చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top