‘రమేష్‌ ఆస్పత్రి నిబంధనలు ఉల్లంఘించింది’

Investigative Committee Report On Swarna Palace Fire Incident - Sakshi

సాక్షి, విజయవాడ: స్వర్ణప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ కమిటి ప్రభుత్వానికి నివేదిక అందించింది. రమేష్‌ ఆస్పత్రి అన్ని రకాలుగా ప్రభుత్వ నియమాలను, నిబంధలను పూర్తిగా ఉల్లంఘించించిందని తేల్చింది. వైద్య విలువలను నీరుగార్చి.. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా చట్టాలను తుంగలో తొక్కి 10 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని స్పష్టం చేసింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జారీచేసిన అనుమతుల్లో నియమాలను ఉల్లంఘించి, కోవిడ్‌ అనుమానితులతో పాటుగా వైరస్‌ సోకని వారిని(నెగెటివ్‌ ఫలితం వచ్చినవారు) కూడా ఆస్పత్రిలో చేర్చుకున్నారని పేర్కొంది. ప్రభుత్వ అనుమతి రాకముందే.. హోటల్‌ స్వర్ణప్యాలెస్‌లో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించినట్లు తేల్చిచెప్పింది. సదరు హోటల్‌లో అగ్నిమాపక భద్రతా నియమాలు ఉన్నాయా? లేవా? అనేది చూసుకోకుండానే పేషెంట్లను తరలించిందని తెలిపింది. కాగా స్వర్ణప్యాలెస్‌ ఘటనపై కృష్ణా జేసీ, విజయవాడ సబ్‌కలెక్టర్, సీఎంహెచ్‌ఓ, రీజనల్‌ ఫైర్‌ ఆఫీసర్, ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌లతో కూడిన విచారణ కమిటీ లోతుగా దర్యాప్తు జరిపింది. (రమేశ్‌కు పారిపోవాల్సిన అవసరం ఏముంది?)

విచారణలో కమిటీ పేర్కొన్న కీలక అంశాలు

  • రమేష్‌ ఆస్పత్రి ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇస్తున్న నిబంధనలను పట్టించుకోలేదు.
  • కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలను ఉల్లంఘించింది. అన్ని విషయాలు తెలిసి కూడా.. ఉద్దేశ పూర్వకంగా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా, డబ్బు సంపాదించాలనే యావతోనే  నియమాలను, చట్టాలను పట్టించుకోలేదు.
  • కోవిడ్‌ సోకిన వారికి వైద్య చికిత్స కోసం నిర్దేశించిన ప్రోటోకాల్‌ను ఉల్లంఘించింది
  • కోవిడ్‌ చికిత్స ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ.. అవసరం ఉన్నా, లేకున్నా ఖరీదైన రెమ్‌డెసివర్‌ అన్ని కేటగిరీల పేషెంట్లకూ వాడారు.
  • ఎలాంటి అనుమతి లేకుండానే రమేశ్‌ ఆస్పత్రి ప్లాస్మా థెరఫీ నిర్వహించింది.
  • హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిమాపక భద్రతా నియమాలు ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలించకుండానే కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది.
  • అంతేకాకుండా ఎం–5, మెట్రోపాలిటిన్‌ హోటళ్లలో ఎలాంటి అనుమతులు లేకుండానే కోవిడ్‌ కేర్‌ సెంటర్లను రమేశ్‌ ఆస్పత్రి నిర్వహించింది.
  • స్వర్ణ ప్యాలెస్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోకుండానే, దీనికి ముందుగానే కోవిడ్‌ చికిత్స పేరుతో పేషెంట్లను అక్కడ ఉంచారు.
  • అగ్ని ప్రమాదాలను నివారించే పరికరాలు గాని, నిరభ్యంతర పత్రంగాని, అలాగే ప్రమాదాలు వచ్చినప్పుడు నివారించే వ్యవస్థలుగాని స్వర్ణప్యాలెస్‌లో లేవు. గత పన్నెండున్నర సంవత్సరాలుగా 19.4 మీటర్ల ఎత్తులో, అత్యంత రద్దీ ప్రదేశంలో ఈ హోటల్‌ కొనసాగుతోంది. ప్రభుత్వ నియమాలను, నిబంధనలు ఉల్లంఘిస్తూ నడుపుతున్నారు. బిల్డింగుకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ కూడా లేదు.
  • మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కట్టాల్సిన పన్నులు కూడా కట్టలేదు. రూ.33.69లక్షల పన్ను బకాయిలు కట్టలేదు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top