AP Assembly sessions 2022: ఏపీ అసెంబ్లీ సమావేశాలపై మండలి ఛైర్మన్‌, స్పీకర్‌ సమీక్ష

Council Chairman And Speaker Review Of AP Assembly Sessions - Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 15వ తేదీ నుంచి జరుగనున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభా సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని శాసన పరిషత్ అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు, శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్ని శాఖల కార్యదర్శులను, పోలీస్ అధికారులను కోరారు. గత సమావేశాల్లో ప్రస్తుతం సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలను సకాలంలో అందజేయాలని అన్ని శాఖల కార్యదర్శులను వారు కోరారు.
చదవండి: దమ్ముంటే అసెంబ్లీకి రా.. చంద్రబాబుకు పార్థసారథి సవాల్‌

సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం.. ఆంధ్రప్రదేశ్ శాసన సభ కమిటీ హాల్‌లో పలు శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో వారిరువురూ పాల్గొని సభ్యుల ప్రశ్నలకు సకాలంలో సరైన సమాధానాలను అందజేయడం, పోలీస్ బందో బస్తు ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్బంగా కొయ్యే మోషేను రాజు మాట్లాడుతూ శాసన మండలి సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సరైన సమాధానాలను అందజేస్తూ వారి గౌరవాన్ని కాపాడాల్సి బాధ్యత అధికారులపై ఉందన్నారు. అటువంటి సత్సంప్రదాయం కొనసాగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలని ఆయన కోరారు.

శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ ప్రజల యావత్ దృష్టి ఈ నెల 15 నుండి జరుగబోవు శాసన సభా సమావేశాలపై ఉంటుందని, వాటికి ఎంతో ప్రత్యేకత ఉందనే విషయాన్ని అధికారులు అందరూ గుర్తించాలన్నారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ సమావేశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద రాజు, చీఫ్ కోఆర్డినేటర్  శ్రీకాంత్ రెడ్డి, డీజీపీ కే. రాజేంద్రనాథ్‌ రెడ్డి, శాసనసభ సెక్రటరీ పి.బాలకృష్ణమాచార్యులు, శాసన మండలి ఓఎస్‌డీ కే.సత్యనారాయణరావు తదితరులతో పాటు పలు శాఖల  ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top