
రిటైనింగ్ వాల్‌కి రెట్టింపు ఖర్చు
ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా కుడి గట్టు రిటైనింగ్ వాల్ పనులకు టెండర్
కి.మీ.కి ఏకంగా రూ.170.45 కోట్లు చొప్పున వ్యయం
1.71 కి.మీ. పొడవున నిర్మాణం.. విలువ రూ.245.18 కోట్లు
రూ.474.51 కోట్లతో 5.66 కి.మీ. ఎడమ గట్టు రిటైనింగ్ వాల్ నిర్మించిన వైఎస్సార్‌సీపీ సర్కార్.. కి.మీ. వ్యయం కేవలం రూ.83.83 కోట్లే
ముడుపుల కోసమే వ్యయం పెంచేశారంటున్న ఇంజనీరింగ్ నిపుణులు
సాక్షి, అమరావతి: కృష్ణా నది కుడి గట్టుకు ప్రకాశం బ్యారేజీ దిగువన తాడేపల్లికి సమీపంలో 0.900 కి.మీ. నుంచి 2.610 కి.మీ. వరకూ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు జలవనరుల శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రూ.245.18 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించింది. ఇక జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ లాంటి పన్నుల రూపంలో మరో రూ.46.30 కోట్లను అదనంగా రీయింబర్స్ చేస్తామని వెల్లడించింది. అంటే.. కాంట్రాక్టు విలువ రూ.291.48 కోట్లు. బిడ్‌ల దాఖలుకు తుది గడువు అక్టోబర్ 6తో ముగియనుంది. అదే రోజు సాంకేతిక బిడ్‌ను తెరవనున్నారు.
అక్టోబర్ 10న ఆర్థిక బిడ్ తెరిచి తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌ను ఎల్–1గా తేల్చి పనులు అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని ఎస్‌ఎల్‌టీసీకి కృష్ణా డెల్టా అధికారులు ప్రతిపాదన పంపనున్నారు. 1.71 కి.మీ. పొడవు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు రూ.291.48 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించడం.. కి.మీ.కు ఏకంగా రూ.170.45 కోట్లు చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయించడంపై ఇంజనీరింగ్ నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అస్మదీయ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి.. పెంచేసిన అంచనా వ్యయాన్ని కమీషన్ల రూపంలో రాబట్టుకోవాలన్న ప్రభుత్వ పెద్దల ఎత్తుగడ ఇందులో దాగి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
శాశ్వతంగా ముప్పు తప్పించిన గత ప్రభుత్వం..
ప్రకాశం బ్యారేజీ నుంచి కేవలం 3 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తే విజయవాడలో కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వరనగర్, కోటినగర్, పోలీస్ కాలనీ, గౌతమి నగర్, నెహ్రూ నగర్, చలసాని నగర్, గీతా నగర్, బాలాజీ నగర్, ద్వారకా నగర్, భూపేష్ గుప్తా నగర్, భ్రమరాంబపురం, తారకరామ నగర్ తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యేవారు.
ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఇబ్బంది లేకుండా విజయవాడకు శాశ్వతంగా ముంపు ముప్పును తప్పించేందుకు కృష్ణా నదికి ఎడమ గట్టున పద్మావతి ఘాట్ నుంచి యనమలకుదురు వరకు మూడు దశల్లో 5.66 కి.మీ. పొడవున రూ.474.51 కోట్ల వ్యయంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రిటైనింగ్ వాల్ నిర్మించింది. ఆ రిటైనింగ్ వాల్ ద్వారా విజయవాడకు కృష్ణా వరద ముప్పును శాశ్వతంగా తప్పించింది. అంటే.. కి.మీ. రిటైనింగ్ వాల్‌కు కేవలం రూ.83.83 కోట్లు మాత్రమే వ్యయం చేసినట్లు స్పష్టమవుతోంది.
2020–24 ధరలతో పోల్చితే స్టీలు, సిమెంటు, పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పు లేదు. పైగా ఇసుక ఉచితం. ఈ లెక్కన ఇప్పుడు రిటైనింగ్ వాల్ నిర్మాణ వ్యయం పెరగడానికి ఆస్కారమే లేదని ఇంజనీరింగ్ నిపుణులు తేల్చి చెబుతున్నారు. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం కృష్ణా కుడి గట్టుకు 1.71 కి.మీ. పొడవున రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం కి.మీ.కి ఏకంగా రూ.170.45 కోట్లు వెచ్చిస్తుండటంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కి.మీ.కు అంచనా వ్యయాన్ని రూ.86.62 కోట్లు పెంచేయడంపై నివ్వెరపోతున్నారు.