పోలీసు అధికారులు పాత్రధారులే
సాయి కృష్ణ కనుమరుగు వెనుక పక్కా కుట్ర
తొలుత ఎత్తుకొచ్చిన ఇద్దరు మహిళా అధికారుల టాస్క్ఫోర్స్
చిత్ర హింసలు పెట్టినా నేరం ఒప్పించలేక సీఐకి అప్పగింత
థర్డ్ డిగ్రీ తట్టుకోలేక చనిపోయిన యువకుడు
ఆ తర్వాత పోలీస్ బాస్, బిగ్ బాస్ భరోసాతో మృతదేహం మాయం
ఇప్పుడిప్పుడే వీడుతున్న అసలు గుట్టు
మసిపూసి మారేడు కాయ చేసేందుకు పోలీసు పెద్దల పన్నాగం
సాక్షి, అమరావతి: సంచలనం కలిగిస్తున్న గాదె సాయి కృష్ణ లాకప్ డెత్‌కు గురయ్యారనే వ్యవహారం వెనుక సూత్రధారి విజయవాడ పోలీస్ బాసేనన్నది స్పష్టమవుతోంది. బిగ్ బాస్ ఆదేశాలతోనే పోలీస్ బాస్ చెలరేగిపోయారన్నది తాజాగా వెలుగులోకి వస్తోంది. బిగ్ బాస్, విజయవాడ బాస్ సూత్రధారులుగా పాల్పడిన ఈ దారుణంలో పలువురు పోలీసు అధికారులు పాత్రధారులుగా వ్యవహరించారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ వీరవిధేయ ఐపీఎస్‌లుగా చెలరేగిపోతున్న ఆ ఇద్దరు అధికారులే కర్త, కర్మ, క్రియగా మొత్తం వ్యవహారం సాగిందన్నది బట్టబయలవుతోంది.
సీఐ నాగరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా సరే.. అసలు కథ నడిపించింది పోలీస్ బాస్‌లేనన్నది నిగ్గు తేలుతోంది. ఈ దారుణంతో కూటమి ప్రభుత్వ దురాగతాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. దాంతో మూడు రోజుల తర్వాత తీరుబడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సమావేశమై వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడకు తెరతీశారు.
విచారణ పేరుతో కాలయాపన చేసి, విషయాన్ని మరుగున పరచాలన్నది ప్రభుత్వ ఎత్తుగడగా ఉంది. ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం సాయికృష్ణ లాకప్ డెత్ పూర్తి వివరాలతో నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. సాయి కృష్ణ లాకప్ డెత్‌కు గురయ్యారనే ఆయన కుటుంబ సభ్యుల ఆందోళన వెనుక విశ్వసనీయ సమాచారం మేరకు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
పోలీస్ బాస్ ఆదేశాలతోనే పోలీసు అధికారుల బరితెగింపు
ఓ కేసులో సాయికృష్ణను నేరం అంగీకరించేలా చేయాలని పోలీస్ బాస్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మీరేం చేస్తారో చేయండి.. అతను నేరాన్ని ఒప్పుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ కేసుపై బిగ్‌బాస్ తరచూ అడుగుతున్నారని కూడా వ్యాఖ్యానించారు. దాంతో ఇద్దరు మహిళా పోలీసు అధికారులతో కూడిన టాస్క్ఫోర్స్ అధికారుల బృందం సాయి కృష్ణను అదుపులోకి తీసుకుంది.
అతడిని కొన్ని రోజులపాటు పోలీసు శైలిలో చిత్రహింసలకు గురి చేసిన అనంతరం సీఐకి అప్పగించారు. అప్పటికే కొన్ని రోజులపాటు చిత్రహింసలకు గురైన ఆయనపై సీఐ ఆధ్వర్యంలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. పోలీసుల టార్చర్ తట్టుకోలేక సాయికృష్ణ సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయనకు హడావుడిగా చికిత్స చేయించేందుకు పోలీసులు యత్నించినట్టు సమాచారం. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటి పోయింది. ఇక చేసేదేమీ లేదన్నది స్పష్టమైంది.
కథ నడిపించిన పోలీస్ బాస్
విషయన్ని పోలీస్ బాస్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాలతోనే సాయికృష్ణను కనిపించకుండా చేశారు. గుట్టుచప్పుడు కాకుండా పక్కాగా మాయం చేశారు. ఏకంగా జిల్లా దాటించి అజ్ఞాత ప్రదేశంలో తతంగాన్ని పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై బిగ్‌బాస్‌కు కూడా ముందస్తుగా పూర్తి సమాచారం ఉంది. మొత్తం పోలీసు వ్యవస్థ అంతా ఒక్కటై గుట్టు చప్పుడు కాకుండా సాయి కృష్ణను ‘మాయం’ చేశారు. అసలు సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకోనే లేదని నమ్మించేందుకు బరితెగించారు.
కాగా, తమ కొడుకు సాయికృష్ణను పోలీసులు అపహరించారని, కనిపించకుండాపోయాడని ఆయన తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో పోలీసుల కుట్ర కథ అడ్డం తిరిగింది. దీంతో బెంబేలెత్తిన ఓ మహిళా పోలీసు అధికారి ఈ విషయాన్ని పోలీస్ బాస్ దృష్టికి తీసుకువెళ్లారు. ‘ఏం పర్వా లేదు. అంతా నేను చూసుకుంటా..’ అని వ్యాఖ్యానించారని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. బిగ్ బాస్ కూడా ఈ విషయంలో ఏం ఆందోళన వద్దు.. అంతా మేం చూసుకుంటాం.. అని భరోసా ఇచి్చనట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల నుంచి ఆశీస్సులు ఉండటం వల్లే వారు ఇలా భరోసా ఇచి్చనట్లు తెలుస్తోంది.
నన్ను ఇరికిస్తే.. మొత్తం బయట పెడతా
సాయి కృష్ణ లాకప్ డెత్‌కు గురయ్యారనే అంశం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారడంతో విజయవాడ పోలీసు వర్గాలు హడలి పోతున్నాయి. ఈ వ్యవహారాన్ని సీఐ నాగరాజు వరకే పరిమితం చేసి, ముగించాలని పోలీస్ బాస్ ఎత్తుగడ వేశారు. అందుకే ఆయన్ను వీఆర్‌కు పంపించి విషయాన్ని కప్పిపుచ్చే ఎత్తుగడ వేశారు. కానీ సాయికృష్ణ కుటుంబ సభ్యులతోపాటు మానవ హక్కుల వేదిక సభ్యులు, ఇతర ప్రజా సంఘాలు పోలీసుల తీరుకు ఎదురు తిరిగాయి. సాయికృష్ణను చూపించాల్సిందేనని పట్టుబట్టాయి.
బాధ్యులైన అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇందుకు బాధ్యత వహించాలని తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయం, విజయవాడ పోలీసు కమిషనరేట్ కార్యాలయం కొత్త ఎత్తుగడకు తెరతీశాయి. సీఐ నాగరాజు వరకు కఠిన చర్యలు తీసుకుని.. విషయాన్ని కప్పిపుచ్చాలని భావిస్తున్నాయి.
ఇదే విషయాన్ని సీఐ నాగరాజు దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. పోలీసు శాఖ తీసుకునే కఠిన చర్యలను వ్యతిరేకించవద్దని, సహకరించాలని సూచించినట్టు సమాచారం. కొన్ని నెలల్లోనే మళ్లీ పోస్టింగు ఇస్తామని, ఏమీ కంగారు పడవద్దని ఆయనకు హామీ ఇచి్చనట్టు తెలుస్తోంది. కానీ ఈ వ్యవహారాన్ని కేవలం తన ఒక్కడి మెడకే చుడితే సమ్మతించేదే లేదని ఆయన చెబుతున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఈ వ్యవహారం వెనుక ఉన్న పోలీస్ బాస్‌తోపాటు అందరి పేర్లు బయట పెడతానని ఆయన చెబుతున్నారన్నది కూడా విశ్వసనీయ సమాచారం. పోలీస్ బాస్‌ల ఆదేశాలను పాటించిన తానొక్కడినే ఎందుకు బాధ్యుడిని కావాలని ఆయన ప్రశి్నస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సాయి కృష్ణ లాకప్ డెత్‌కు గురయ్యారనే అంశంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది పోలీసు వర్గాలతోపాటు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
కాపులంటే అంత చిన్నచూపా
అడవుల్లో, మారుమూల గ్రామాల్లో వినే లాకప్ డెత్‌లు ఇప్పుడు విజయవాడ నడిబొడ్డున చేయడం కూటమి ఘనకార్యం. లాకప్‌లో చనిపోయిన వ్యక్తి శవాన్ని పోలీసులు మాయం చేయడం నా అనుభవంలో మొదటిసారి. బాధిత కుటుంబం కోర్టుకు వెళితే తప్ప కేసు కదలేదు. ఇదేనా మార్పు? ఇదేనా మంచి పరిపాలన. కందుకూరులో కాపు యువకులపై కారు ఎక్కించిన ఘటనను 15 రోజులు దాచిపెట్టారు. పేద కులాలు, బీసీ, ఎస్సీ వర్గాలంటేనే చిన్నచూపా? ఈ దుర్మార్గాలను అదుపు చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే. – దాసరి రాము, కన్వీనర్, తెలగ, బలిజ, కాపు జేఏసీ
పవన్‌కళ్యాణ్ నోరు విప్పాలి
కాపు యువకుడు సాయికృష్ణ కేసును పక్కదారి పట్టించేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయి. సాయికృష్ణ మృతదేహాన్ని అప్పగించి అతడి కుటుంబానికి న్యాయం చేయాలి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ సైతం నోరు విప్పాలి. – అపోజీ, అధ్యక్షుడు, శ్రీకృష్ణదేవరాయల బలిజ సంక్షేమ సంఘం, చిత్తూరు
కాపులపై దాడులు, హత్యా రాజకీయాలు
కాపు సామాజిక వర్గం లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం దాడులు, హత్యా రాజకీయాలకు పాల్పడుతోంది. సాయికృష్ణ లాకప్ డెత్ దుర్మార్గం. కాపులపై టీడీపీ నేతలు, పోలీసులు దౌర్జన్యం చేస్తున్నా పవన్‌కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు. – అంబటి మురళీకృష్ణ, వైఎస్సార్‌సీపీ పొన్నూరు సమన్వయకర్త
నిజాలు బయటకు రావాలి
విజయవాడలో సాయికృష్ణ లాకప్‌డెత్ ఘటనలో నిజాలు బయటకు రావాలి. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. న్యాయం జరిగే వరకూ ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా మా పోరాటం కొనసాగుతుంది. – పన్నాస పూర్ణచంద్రరావు, ఆంధ్ర–తెలంగాణ రాధారంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు, కాళ్లపాలెం, కలిదిండి మండలం
గెలిపించిన వారినే చంపుతారా?
కాపులతో చేతులు కలిపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అధికారంలోకి వచ్చాక కాపుల్ని విస్మరించడం తగదు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తక్షణమే స్పందించి సాయికృష్ణ లాకప్‌డెత్‌కు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – మామిడి శ్రీకాంత్, వైఎస్సార్‌సీపీ తూర్పుకాపు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వానిదే బాధ్యత
కాపు కులానికి చెందిన గాదె సాయికృష్ణను వెంటనే అతని కుటుంబానికి అప్పగించాలి. రాష్ట్రంలో కాపులను ద్వితీయశ్రేణి పౌరులుగా ప్రభుత్వం చూస్తోంది. సాయికృష్ణకు ఏదైనా జరిగితే దానికి పోలీసులే పూర్తి బాధ్యత వహించాలి. – కొండాల గణేష్, తూర్పుకాపు సంక్షేమ సంఘం, జిల్లా అధ్యక్షుడు, శ్రీకాకుళం
పూర్తిస్థాయిలో విచారణ చేయాలి
కాపు యువకుడు సాయికృష్ణ అదృశ్యంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. బాధ్యుల్ని శిక్షించాలి. యువకుడు కనిపించకపోవడం దారుణమైన విషయం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. – కొక్కిరాల సంజీవకుమార్, జిల్లా అధ్యక్షుడు, కాపు సంఘం, ఒంగోలు
కాపులకు రక్షణ లేదు
కూటమి ప్రభుత్వంలో కాపులకు రక్షణ లేదు. సాయికృష్ణను లాకప్‌లోనే కొట్టి చంపటం దుర్మార్ఘం. ఇటీవల గుంటూరులోనూ ఓ వ్యక్తిని ఇలాగే చంపారు. పది రోజులు గడవకుండానే విజయవాడలో మరో ఘోరం జరగటం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం. – తాడిశెట్టి శ్రీనివాసరావు, కాపు సంఘ నాయకుడు, పామర్రు, కృష్ణాజిల్లా
రెడ్‌బుక్ రాజ్యాంగం వల్లే..
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కాపులపై పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయి. వీటికి కొనసాగింపుగా విజయవాడలో సాయికృష్ణ అదృశ్యమయ్యాడు. రెడ్‌బుక్ రాజ్యాంగం వల్ల జనసేన కార్యకర్తలు కూడా బాధితులుగా మారుతున్నారు. – సలాది సతీష్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, విలసవిల్లి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా


