డ్యూయల్‌ మేజర్లతోనే పీజీ! | Confusion in degree education due to coalition government decision | Sakshi
Sakshi News home page

డ్యూయల్‌ మేజర్లతోనే పీజీ!

Jun 10 2025 4:49 AM | Updated on Jun 10 2025 4:49 AM

Confusion in degree education due to coalition government decision

కూటమి ప్రభుత్వ నిర్ణయంతో డిగ్రీ విద్యలో గందరగోళం

గతంలో సింగిల్‌ మేజర్, మైనర్‌ సబ్జెక్టు విధానంపై బురదజల్సిన కూటమి నేతలు

ఇప్పుడు రెండు మేజర్‌ సబ్జెక్టులు తొలి సెమిస్టర్‌ నుంచే అమలు

రెండో ఏడాది నుంచి మైనర్‌ సబ్జెక్ట్‌ తప్పనిసరి

కానీ, మైనర్‌ సబ్జెక్టులో పీజీ చేసే అవకాశం కోల్పోతున్న విద్యార్థులు

గతంలో సింగిల్‌ మేజర్, మైనర్‌ సబ్జెక్టులతో పీజీకి అవకాశం

కంప్యూటర్స్‌ మేజర్‌ సబ్జెక్టుగా తీసుకునే వారు మైనర్‌ క్వాంటం 

కంప్యూటింగ్‌ చదవాల్సిందే కానీ ఈ సబ్జెక్టుల బోధనకు వనరులు కరువు

ఇంటర్న్‌షిప్‌ కాలవ్యవధి కుదింపు.. బట్టీ చదువులకే ప్రాధాన్యం

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం డిగ్రీ విద్యలో గందరగోళం సృష్టిస్తోంది. గతంలో సింగిల్‌ మేజర్, మైనర్‌ విధానంపై బురదజల్లడమే కాకుండా తాము అధికారంలోకి వస్తే పాత పద్ధతి(మూడు కోర్‌ సబ్జెక్టులు)ని ప్రవేశపెడతామని చెప్పి.. ఇప్పుడు డ్యూయల్‌ మేజర్‌లతో విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది. 

తొలి సెమిస్టర్‌ నుంచే రెండు మేజర్‌ సబ్జెక్టులను అమలు చేయడమే కాకుండా రెండో ఏడాది నుంచి మైనర్‌ సబ్జెక్టును తప్పనిసరి చేసింది. కానీ మైనర్‌ సబ్జెక్టుకు క్రెడిట్లు తక్కువ కేటాయించడం ద్వారా అందులో పీజీకి అవకాశం లేకుండా చేసింది. అలాగే ఎలాంటి బోధన వనరులు లేకపోయినా.. క్వాంటం కంప్యూటింగ్‌ సబ్జెక్టును తప్పనిసరి చేసి విద్యార్థులను హడలెత్తిస్తోంది. ఇంటర్న్‌షిప్‌ సమయంలో కోత విధించి.. పుస్తకాల బట్టీకి ప్రాధాన్యమిచ్చింది.

బోధన సాధ్యమేనా?
బీకాం కోర్సులకు సంబంధించి కొత్త విధానంలో సబ్జెక్టుల కాంబినేషన్‌పై గందరగోళం నెలకొంది. బీకాంలో కంప్యూటర్‌ సైన్స్‌/అప్లికేషన్ల అనుబంధ మేజర్‌ సబ్జెక్టులుగా చదివే వారు తప్పనిసరిగా క్వాంటం టెక్నాలజీని మైనర్‌ సబ్జెక్టుగా అభ్యసించాలని నిబంధన పెట్టడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. క్వాంటం టెక్నాలజీ సబ్జెక్టును బోధించే వనరులు రాష్ట్రంలో జల్లెడ పెట్టి వెతికినా దొరకని పరిస్థితి ఉందని.. ప్రభుత్వం సొంత ప్రచారం కోసం విద్యార్థులను బలి చేస్తోందని విద్యావేత్తలు మండిపడుతున్నారు. 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విద్యార్థులకు అత్యాధునిక విద్యను అందించేందుకు ఎడెక్స్, మైక్రోసాఫ్ట్‌ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థల ద్వారా ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ చదువుకునే అవకాశం కల్పించిందని వారు గుర్తు చేస్తున్నారు. కానీ, కూటమి ప్రభుత్వంలో కాలేజీలో పాఠాలు చెప్పడానికే వనరుల కొరత ఉన్నప్పుడు ఈ టెక్నాలజీ కోర్సులను ఎలా బోధిస్తారని ప్రశ్నిస్తున్నారు. కాగా, మేజర్‌ 1, మేజర్‌ 2, మైనర్‌ సబ్జెక్టులకు కాంబినేషన్‌ సబ్జెక్టుల జాబితాను ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడంపై డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.  

గతంలో విద్యార్థులకు అనుకూలంగా..
ఒక సబ్జెక్టులో విద్యార్థి సంపూర్ణ నైపుణ్యాలు సాధించాలనే లక్ష్యంతో యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా గత ప్రభుత్వం సింగిల్‌ మేజర్‌ విధానాన్ని తీసుకువచ్చింది. రెండో సెమిస్టర్‌ నుంచి 100కి పైగా సబ్జెక్టుల్లో నచ్చిన సబ్జెక్టును మైనర్‌ కింద చదువుకునేలా క్రెడిట్లు రూపొందించింది. 

అంటే మేజర్, మైనర్‌లో ఏదో ఒక సబ్జెక్టుతో పీజీలో ప్రవేశాలకు అర్హత పొందొచ్చు. దీంతో పాటు ఐచ్ఛికంగా మరో మైనర్‌ సబ్జెక్టును విద్యార్థి చదివితే దానికి కూడా క్రెడిట్లు ఇచ్చి అందులో సైతం పీజీ చేసేందుకు వీలు కల్పించింది. ఇక్కడ మేజర్‌కు 60, మైనర్‌కు 24 క్రెడిట్లు కేటాయించింది. నాలుగేళ్ల డిగ్రీ విధానంలో ఏడు సబ్జెక్టులు మాత్రమే ఉండేవి. అందులో ఒక సబ్జెక్టును కేవలం చివరి సంవత్సరంలో మాత్రమే చదవాల్సి ఉండేది.

మైనర్‌ సబ్జెక్టులో పీజీకి అవకాశం లేదు..
కూటమి ప్రభుత్వం సింగిల్‌ మేజర్‌ విధానం స్థానంలో డ్యూయల్‌ మేజర్‌ ప్రకటించింది. ఇందులో తొలి సెమిస్టర్‌ నుంచే విద్యార్థి ప్రధానంగా రెండు సబ్జెక్టులు(మేజర్‌1, 2) తీసుకోవాలి. మూడో సెమిస్టర్‌ నుంచి మైనర్‌ సబ్జెక్టును తప్పనిసరిగా చదవాలి. ఇక్కడ మేజర్‌ 1కు 48, మేజర్‌ 2కు 32, మైనర్‌కు 16 క్రెడిట్లు కేటాయించింది. 

యూజీసీ నిబంధనల ప్రకారం ఒక సబ్జెక్టులో కనీసం 24 క్రెడిట్లు ఉంటేనే.. అందులో పీజీ చేయొచ్చు. ఈ లెక్కన కేవలం 2 మేజర్లలో ఏదో ఒక దానిలో మాత్రమే పీజీ చదివేందుకు అర్హత ఉంటుంది. పైగా డ్యూయల్‌ మేజర్‌ నాలుగేళ్ల డిగ్రీలో 8 సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది.

ఇంటర్న్‌షిప్, క్రెడిట్లలో కోత..
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విద్యార్థులకు తరగతి బోధనతో పాటు ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించేందుకు 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను ప్రవేశపెట్టింది. తొలి ఏడాది అనంతరం 180 గంటల కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్టు, రెండో ఏడాది తర్వాత 180 గంటల ఇంటర్న్‌షిప్, చివరి ఏడాది(విద్యార్థి వీలును బట్టి) ఏదో ఒక సెమిస్టర్‌లో పూర్తిగా లాంగ్‌టర్మ్‌ ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పించింది. 

కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం విద్యార్థులను పూర్తిగా బట్టీ చదువులకే పరిమితం చేస్తోంది. కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టును 120 గంటలకు, స్వల్పకాలిక ఇంటర్న్‌షిప్‌ను 120 గంటలకు, లాంగ్‌టర్మ్‌ ఇంటర్న్‌షిప్‌ను 10 వారాలకు(240 గంటలకు) కుదించింది. పైగా క్రెడిట్లను 20 నుంచి 16కు తగ్గించింది.  

Advertisement
 
Advertisement
Advertisement