కరోనాపై పరిశోధనలకు ముందుకు రండి

Come Forward To Research On Corona Virus - Sakshi

స్టార్టప్‌ కంపెనీలకు ఆహ్వానం 

ఏపీ మెడ్‌టెక్‌ జోన్, బ్రిటీష్‌ హైకమిషన్‌ కార్యాచరణ  

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారిపై పోరుకు అవసరమైన వెంటిలేటర్లు, ఇతర అత్యవసర వైద్య పరికరాల ఉత్పత్తి దిశగా ఆంధ్రప్రదేశ్‌ మరో ముందడుగు వేసింది. విశాఖపట్నం జిల్లాలోని మెడ్‌టెక్‌ జోన్‌లో 5.6 మిలియన్ల అమెరికన్‌ డాలర్ల విలువైన అత్యవసర వైద్య ఉపకరణాల తయారీకి బ్రిటీష్‌ ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ చేపట్టింది. ఆసక్తి ఉన్న మెడికల్‌ స్టార్టప్‌ కంపెనీలు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ బ్రిటీష్‌ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. 

► బ్రిటీష్‌ హైకమిషన్, ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌.. అర్హత ఉన్న కంపెనీలను ఎంపిక చేస్తాయి.  
► ఎంపికైన కంపెనీలు వైద్య పరికరాల ఉత్పత్తులను ప్రారంభించేందుకు మెడ్‌టెక్‌ జోన్‌లోని మెడీవ్యాలీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తారు. ఆర్థిక, సాంకేతిక, మౌలిక వసతుల సహకారం అందిస్తారు. 

నవకల్పనలకు దోహదం
కరోనా వైరస్‌ను అంతం చేయడానికి అంతర్జాతీయ సమాజం కలిసి పని చేయాలన్న లక్ష్యంతోనే ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌తో బ్రిటీష్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్‌ వైద్య రంగంలో నవకల్పనల ఉత్పత్తికి దోహదపడుతుంది. 
    – ఆండ్రూ ఫ్లెమింగ్,  బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్, ఏపీ, తెలంగాణ 

కరోనాపై విజయమే లక్ష్యం
కరోనా మహమ్మారిపై విజయం సాధించేందుకు అవసరమైన వైద్య పరికరాల ఉత్పత్తి ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ లక్ష్యం. అంతర్జాతీయస్థాయిలో  వైద్య పరిశోధనలకు ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ కేంద్ర బిందువుగా ఉంటుంది.  
    – జితేందర్‌ శర్మ, ఎండీ–సీఈవో, ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top