
కొత్త అప్పులకు కూటమి సర్కారు రెడీ
బడ్జెట్ బయట ఏపీఐఐసీ, విద్యుత్ డిస్కమ్స్ ద్వారా రూ.12,973.94 కోట్ల రుణాలు తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం
ఏపీఐఐసీ ద్వారా రూ.7,500 కోట్ల అప్పు చేయాలని నిర్ణయం
ఏపీఐఐసీ భూముల తనఖాకూ సిద్ధం.. ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్ ద్వారా రూ.5,473.94 కోట్లు తీసుకునేందుకు ఆమోదం
ఏపీపీడీసీఎల్ దివాళా తీయడంతో బ్యాంకుల హెచ్చరికలు
రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ నిర్ణయం.. వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: బడ్జెట్ బయట ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం అలా ఆమోదం తెలిపిందో లేదో.. అందుకు సంబంధించి గురువారం వెనువెంటనే వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయిపోయాయి. బడ్జెట్ బయట ఏపీఐఐసీ, డిస్కమ్స్ ద్వారా ఏకంగా రూ.12,973. 94 కోట్ల అప్పునకు ఇంధన శాఖ, పరిశ్రమల శాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి. ఇందులో ఏపీఐఐసీ ద్వారా రూ.7,500 కోట్ల అప్పును వచ్చే 12 నెల ల్లోగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇందుకోసం ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం వేదికగా కోటి రూపాయలు అదీకృత షేర్ కేపిటల్, రూ. లక్ష పెయిడ్–అప్ షేర్ కేపిటలతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ)ను ఏర్పాటు చేశారు. ఎస్‌పీవీ బోర్డు అవసరాల ఆధా రంగా ఎప్పటికప్పుడు అధీకృత పెయిడ్–అప్ కేపి టల్, షేర్ కేపిటల్‌ను పెంచవచ్చునని తెలిపారు.
ప్రస్తుతం ఏపీఐఐసీ దగ్గర ఉన్న భూములను ఎస్‌పీవీకి బదిలీ చేస్తారు. ఆ బదిలీ చేసిన భూములను బ్యాంకులు, ఆర్థిక సంస్దలకు తనఖా పెట్టి 9–12 నెలల కాలవ్యధిలోనే రూ.7,500 కోట్లు రుణాన్ని సమీకరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీఐఐసీ దగ్గర 13,000 ఎకరాలకుపైగా భూములున్నాయని, కొత్తగా మరో 30 వేల ఎకరాలను సేకరించడంతోపాటు ఆ భూములను పరిశ్రమల అవసరాలకు అభివృద్ధి చేసేందుకు రూ.7,500 కోట్లు అప్పు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
విద్యుత్ డిస్కమ్స్ ద్వారా ఇలా..
ఇదిలా ఉంటే ప్రస్తుతం స్మార్ట్ మీటరింగ్‌తోపాటు రేవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమును అమలు కొనసాగింపునకు ఏపీఎస్‌పీడీసీఎల్ ద్వారా రూ.3544.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్ ద్వారా రూ.1029.37 కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరో పక్క ఇప్పటికే ఏపీపీడీసీఎల్ ఎస్‌బీఐ, యుబిఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లించేందుకు ఆ సంస్థ ఖాతాల్లో నిధుల్లేక దివాళా తీసింది.

ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ, యూబీఐ బ్యాంకులు ఆర్‌బీఐకి, సిబిల్, క్రిసిల్ సంస్థలకు రిపోర్ట్ చేస్తామని హెచ్చరించాయి. ఏపీపీడీసీఎల్ ఆరి్థక పరిస్థితి దిగజారడంతో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆ బ్యాంకులు దగ్గర ఏపీపీడీసీఎల్ తీసుకున్న రూ.900 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.