ఏపీ క్యాడర్‌పై కక్ష.. నాన్‌ ఏపీ క్యాడర్‌పై ఆపేక్ష | Coalition government did not give postings to five IAS and nine IPS officers | Sakshi
Sakshi News home page

ఏపీ క్యాడర్‌పై కక్ష.. నాన్‌ ఏపీ క్యాడర్‌పై ఆపేక్ష

Feb 8 2025 5:30 AM | Updated on Feb 8 2025 5:32 AM

Coalition government did not give postings to five IAS and nine IPS officers

ఐదుగురు ఐఏఎస్, తొమ్మిది మంది ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇవ్వని కూటమి ప్రభుత్వం

మరింత మంది నాన్‌ ఏపీ క్యాడర్‌ అధికారులు కావాలని పట్టు

సాక్షి, అమరావతి: పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్లుగా తయారైంది చంద్రబాబు సర్కారు తీరు! ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన అఖిల భారత సర్వీసు అధికారులకు కక్ష పూరితంగా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్న కూటమి ప్రభుత్వం ఇతర రాష్ట్రాల క్యాడర్‌ అధికారులను మాత్రం ఏపీకి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే కోరుతుండటం విస్మయ పరుస్తోంది. టీడీపీ కూటమి సర్కారు రాగానే 9 మంది ఐపీఎస్‌లు, ఐదుగురు ఐఏఎస్‌లకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. 

కక్షపూరితంగా నలుగురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్‌ వేటు వేసింది. మరోవైపు రాష్ట్రంలో పాలన వ్యవస్థను సక్రమంగా నిర్వహించేందుకు తగినంత మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు లేరంటూ జిత్తులమారితనాన్ని ప్రదర్శిస్తోంది. రెడ్‌బుక్‌ కుట్రలపై మినహా పాలన వ్యవస్థపై ఏమాత్రం చిత్తశుద్ధి లేని చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా భ్రష్టు పట్టిపోతోంది. 

రాగానే కక్ష సాధింపు చర్యలు.. 
గతేడాది జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 15 మంది ఐఏఎస్‌లు, 24 మంది ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనపెట్టింది. ప్రభుత్వ విధానాలను అమలు చేసే అధికారులపై తన అక్కసు చూపడంతో రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. దాదాపు ఐదు నెలల తరువాత దశలవారీగా కొందరికి అప్రాధాన్య పోస్టుల్లో పోస్టింగులు ఇచ్చింది.

పలువురికి ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వకుండా ఇంకా వెయిటింగ్‌లోనే ఉంచడం చంద్రబాబు ప్రభుత్వ దుర్నీతికి నిదర్శనం. వీరిలో ఐదుగురు ఐఏఎస్‌లు, ఐదుగురు ఐపీఎస్‌ అధికారులున్నారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు శ్రీలక్ష్మి, మురళీధర్‌రెడ్డి, ముత్యాల రాజు, నీలకంఠరెడ్డి, మాధవీలతకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వలేదు. 

ఇక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పీవీ సునీల్‌కుమార్, కొల్లి రఘురామ్‌రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, జాషువాకు పోస్టింగులు ఇవ్వకపోవడం గమనార్హం. పదిమంది సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు అందుబాటులో ఉన్నా వారి సేవలను వినియోగించుకోకుండా ఇతర రాష్ట్రాల క్యాడర్‌ అధికారులను డిప్యుటేషన్‌పై పంపాలని కోరడం గమనార్హం. 

నలుగురు ఐపీఎస్‌ల సస్పెన్షన్‌ 
నలుగురు ఐపీఎస్‌ అధికారుల సస్పెన్షన్‌ చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్‌ కుట్రకు పరాకాష్ట. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ఎన్‌.సంజయ్, టి. కాంతిరాణా, విశాల్‌ గున్నీను ప్రభుత్వం కక్ష పూరితంగా సస్పెండ్‌ చేసింది. వలపు వల(హనీ ట్రాప్‌) విసిరి బడా బాబులను బ్లాక్‌ మెయిలింగ్‌ చేయడమే పనిగా పెట్టుకున్న  ముంబై మోడల్‌ కాదంబరి జత్వానీతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, టి.కాంతిరాణా, విశాల్‌గున్నీను సస్పెండ్‌ చేయడం బాబు సర్కారు కుట్రపూరిత రాజకీయాలకు నిదర్శనం. 

రామోజీ కుటుంబానికి చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాలను వెలికి తీశారనే కక్షతో ఎన్‌.సంజయ్‌పై అక్రమ కేసులు బనాయించి సస్పెండ్‌ చేశారు. ఒకవైపు అందుబాటులో ఉన్న సమర్థులైన ఐపీఎస్‌ అధికారులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ మరోవైపు ఇతర రాష్ట్రాల అధికారుల కోసం అర్రులు చాస్తుండటం కూటమి సర్కారు దుర్నీతికి నిదర్శనంగా నిలుస్తోంది.  

డిప్యుటేషన్‌ అధికారులే ముద్దు...
తమ అక్రమాలకు వత్తాసు పలికేందుకే ఇతర రాష్ట్రాల ఐఏఎస్‌ అధికారుల కోసం చంద్రబాబు ప్రభుత్వం పట్టుబడుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి అస్మదీ య అధికారులను డిప్యుటే షన్‌పై రప్పించి కీలక స్థానాలు కట్టబెడుతోంది. 2014–19 మధ్య టీడీపీ  హయాంలో డిప్యుటేషన్‌పై రాష్ట్రంలో కీలక పోస్టింగులు నిర్వహించిన యూ ్డపీ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి రాజమౌళి గతేడాది చంద్రబాబు సీఎం కాగానే రాష్ట్రంలో వాలిపోయారు. ఆయనకు ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పోస్టు కట్టబెట్టారు. 

అదే తరహాలో గతంలో టీడీపీ ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై వచ్చి ఏపీఎండీసీ ఎండీగా పని చేసిన ఐఆర్‌ఎస్‌ అధికారి వెంకయ్య చౌదరిని కూటమి సర్కారు అధికారంలోకి రాగానే మరోసారి రప్పించి ఏకంగా టీటీడీ అదనపు ఈవోగా అత్యంత కీలక పోస్టు కట్టబెట్టారు. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు మృతి చెందినా ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేదు. టీటీడీలో ప్రైవేట్‌ వ్యక్తులు అనధికారికంగా పాగా వేసి అక్రమాలకు తెగబడటం వెనుక కీలక పాత్ర వెంకయ్య చౌదరిదే.

అదే రీతిలో తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సుబ్బారాయుడుకు కూటమి ప్రభుత్వం రెడ్‌ కార్పెట్‌ పరిచింది. ఆయన్ను తిరుపతి జిల్లా ఎస్పీగా నియమించింది. తిరుపతిలో తొక్కిసలాటకు బా­ధ్యు­డైనప్పటికీ సస్పెండ్‌ చేయ­కుండా బదిలీతో సరి పెట్టింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధక టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగా చిత్తూరు జిల్లాలోనే పోస్టింగు ఇచ్చింది. ఇవన్నీ చంద్రబాబు కోటాగా పరిగణించడంతో ఇక తన కోటా కూడా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ భావించారు. 

అందుకే ఆయన డిమాండ్‌ మేరకు కేరళ క్యాడర్‌కు చెందిన మైలవరపు కృష్ణ తేజను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తెచ్చి పంచాయతీరాజ్‌ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. నలుగురు ఇతర రాష్ట్రాల అధికారులను డిప్యుటేషన్‌ మీద తెప్పించుకున్నా చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందడం లేదు. ఇతర రాష్ట్రాల క్యాడర్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు మరింత మంది కావాలంటూ కేంద్రానికి పదే పదే విజ్ఞప్తులు చేస్తోంది. 

టీడీపీ తీరుపట్ల రాష్ట్రానికి చెందిన ఏఐఎస్‌ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ విధానాలను అమలు చేయడమే విద్యుక్త ధర్మంగా భావించే ఏఐఎస్‌ అధికారులపై కక్షపూరితంగా వ్యవహరించడం ద్వారా దుష్ట సంప్రదాయానికి పాల్పడుతోందని పేర్కొంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement