CM Jagan Review Meeting: ఆరోగ్య శ్రీ  పరిధిలోకి మరిన్ని వైద్య చికిత్సలు

CM YS Jagan Review Meeting On Medical And Health Department - Sakshi

సాక్షి, అమరావతి: వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంతి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, ఆరోగ్యశ్రీ, దాని కింద కార్యక్రమాలు, వైద్య ఆరోగ్యశాఖలో నాడు – నేడు కింద చేపడుతున్న పనులు, కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్‌ కేర్‌ తదితర అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ తరహా ప్రసవం జరిగినా తల్లికి రూ.5వేలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

– ఆరోగ్య ఆసరా కింద తల్లికి రూ.5వేలు. 
– సహజ ప్రసవం జరిగినా, సిజేరియన్‌ జరిగినా రూ.5వేలు. 
– గతంలో సిజేరియన్‌ జరిగితే రూ.3వేలు కాగా, దీన్ని రూ.5వేలకు పెంచాలి.
– సహజ ప్రసవం అయినా, సిజేరియన్‌ అయినా తల్లీబిడ్డల సంరక్షణ ముఖ్యం కాబట్టి, ఒకే మొత్తాన్ని ఇవ్వాలి.
– సహజ ప్రసవాలను పెంచడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి.
– సహజ ప్రసవంపై అవగాహన, చైతన్యం నింపాల్సిన బాధ్యత వైద్యులదే. 

ఆరోగ్య శ్రీ  పరిధిలోకి మరిన్ని వైద్య చికిత్సలు..
సమీక్ష సందర్భంగా ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వివిధ కార్యక్రమాలకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చును అధికారులు వివరించారు. ఆరోగ్యశ్రీలో 2,446 ప్రొసీజర్లు కవర్‌ అవుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో దీనిపై నిరంతర అధ్యయనం చేయాలని, అవసరాల మేరకు మరింత మంచి చేయడానికి ప్రొసీజర్ల సంఖ్యను పెంచాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. కాగా, ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించామని అధికారులు తెలిపారు. వైద్యులు, వైద్య సంఘాలతో చర్చిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో వారం రోజుల్లో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌.. అధికారులను ఆదేశించారు.

నెలకు ఖర్చులు ఇవే..
– ఆరోగ్య శ్రీ కింద కనీసంగా రూ.270 కోట్లు. 
– 104,108 కోసం నెలకు కనీసంగా రూ.25 కోట్లు.
– ఆరోగ్య ఆసరా కింద నెలకు కనీసంగా రూ.35 కోట్లు. 
కేవలం ఆరోగ్యశ్రీ, దానికింద కార్యకలాపాల కోసం ఏడాదికి దాదాపు రూ.4వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక, గతేడాది ఆయుష్మాన్‌ భారత్‌ కింద రాష్ట్రానికి అందింది రూ. 223 కోట్లు అని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది రూ.360 కోట్లు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్టు అధికారులు చెప్పారు. 

మరింత పారదర్శకంగా ఆరోగ్య శ్రీ పథకం..
నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి డబ్బు, అక్కడ నుంచి ఆస్పత్రికి ఆటోడెబిట్‌లో చెల్లింపులు, ఎవ్వరికీ అసౌకర్యం కలగకుండా ఈ ప్రక్రియ కొనసాగాలి. ముందుగా పేషెంటు డిశ్చార్జి అయ్యే సమయంలో కన్సెంటు ఫారం స్వీకరణ, పేషెంటు, బ్యాంకు, ఆస్పత్రి మధ్య కన్సెంటుతో కూడిన ఫారం ఇవ్వాలి. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఈ విధానంలో చాలా వరకు పొరపాట్లను నివారించే అవకాశం ఉంటుందని సీఎం జగన్‌ తెలిపారు. 

కోవిడ్‌ పరిస్థితులపై సీఎం సమీక్ష..
 కోవిడ్‌ పరిస్థితులన్నీ పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని అధికారులు తెలుపగా.. అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 
 
రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై సీఎం సమీక్ష
– 18 సంవత్సరాల్లోపు వారికి కూడా రెండుడోసులు దాదాపుగా పూర్తి.
– 15 నుంచి 17 ఏళ్లలోపు వారికి 99.65శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి.
– 12 నుంచి 14 ఏళ్లలోపు వారికి 97.78శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి.

నిర్దేశించుకున్న సమయంలోగా పనులు..
విలేజ్‌ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, కొత్త ఆస్పత్రుల నిర్మాణం, వీటిలో అభివృద్ధి పనులు నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కాగా, విలేజ్‌ క్లినిక్స్, వార్డు క్లినిక్స్‌లో పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని, కొత్తవాటి నిర్మాణం కూడా పూర్తవుతోందని అధికారులు తెలిపారు. పీహెచ్‌సీల్లో  977 సెంటర్లలో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, కొత్తవాటి నిర్మాణం చురుగ్గా సాగుతోందని అధికారులు చెప్పారు.

కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణంపై సీఎం సమీక్ష
రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నంలలో  కొత్త మెడికల్‌ కాలేజీల్లో 2023 నుంచి మెడికల్‌ ప్రవేశాల కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. మెడికల్‌ కౌన్సిల్‌ మార్గదర్శకాల ప్రకారం చేయాల్సిన పనులు వేగంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఇక్కడ డిసెంబర్‌ నాటికి నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మిగిలిన చోట్ల కూడా నిర్మాణాలు వేగవంతం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఒకటి రెండు చోట్ల స్థలాలపై కోర్టు కేసులున్నాయని అధికారులు తెలుపడంతో.. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేయాలని సీఎం జగన్‌ సూచించారు. 

క్యాన్సర్‌ కేర్‌పై ప్రభుత్వం దృష్టి..
భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. 2020లో ఏపీలో 34వేల మంది క్యాన్సర్‌ కారణంగా మృతి చెందారు. ప్రాథమిక దశలో గుర్తించకపోవడం వల్ల చాలా మంది మరణిస్తున్నారని అధికారులు తెలిపారు. చివరిదశలో గుర్తించి, చికిత్సకోసం భారీగా ఖర్చు చేస్తున్నారని అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతుందని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయిలోనే క్యాన్సర్‌ గుర్తింపుపై దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అందుకోసం విలేజ్‌ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, పీహెచ్‌సీలను వీలైనంత త్వరగా పూర్తిచేసుకోవాలని సీఎం సూచించారు. డిసెంబర్‌ కల్లా వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇవి పూర్తి అయితే ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ విధానం సమర్థవంతంగా అమలు జరుగుతుంది, క్యాన్సర్‌ గుర్తింపు అన్నది సులభంగా జరుగుతుందని సీఎం జగన్‌ తెలిపారు. ఈలోగా సిబ్బందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌పై శిక్షణ ఇప్పించాలని సూచించారు. 

దీని వల్ల క్యాన్సర్‌ గుర్తింపు నుంచి చికిత్స వరకూ సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పడుతుందని సీఎం జగన్‌ తెలిపారు. ఈ సందర్బంగా టాటా మెమోరియల్‌ ద్వారా రాష్ట్రంలో వైద్య సిబ్బందికి, వైద్యులకు శిక్షణకు ఎంఓయూ కుదిరిందని అధికారులు వివరణ ఇచ్చారు. దీంతోపాటు స్విమ్స్‌ ఆస్పత్రిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసే 16 మెడికల్‌ కాలేజీలతో కలిపి 27 మెడికల్‌ కాలేజీల్లో కూడా క్యాన్సర్‌ నివారణకు రెండేసి చొప్పున లైనాక్‌ మెషిన్లు ఉండేలా బ్లూ ప్రింట్‌ ఇవ్వాలని సీఎం చెప్పారు. ఇందులో మూడు కాలేజీల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ, తిరుపతి, గుంటూరులో క్యాన్సర్‌ నివారణపై సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ పెట్టాలని ప్రతిపాదించారు. పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధంచేసి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి(కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్యశాఖ స్పెషల్‌ సెక్రటరీ జీఎస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి.వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి. మురళీధర్‌ రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్‌ వి. వినోద్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డికి సీఎం జగన్‌ ఆత్మీయ పలకరింపు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top