భారీ వర్షాలపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

Cm Jagan Video Conference With Collectors On Heavy Rains - Sakshi

సాక్షి, అమరావతి: భారీ వర్షాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష చేపట్టారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ధవళేశ్వరం వద్ద కూడా వరద ప్రవాహం సుమారు 16 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. గత ఏడాది గోదావరిలో 26 లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం చూశాం. కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సీఎం ఆదేశించారు.

వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ పునరావాసం కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా సాగాలి. అధికారులు మానవీయ కోణంలో సహాయం అందించాలి. ఒక్క రూపాయి అదనంగా ఖర్చు చేసినా, బాధితులకు అండగా ఉండాలి. కలెక్టర్లు మాకు మంచి చేశారు అన్న మాటే వినిపించాలి. అధికారులు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే ఖాళీలు చేశారు. అవసరం అనుకుంటే.. పరిస్థితిని అంచనా వేసుకుని మిగిలిన ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. సహాయ శిబిరాల్లో మంచి సదుపాయాలు కల్పించాలి’’ అని సీఎం అన్నారు.

‘‘శిబిరాల్లో అధికారులు ఉంటే.. ఎలాంటి సదుపాయాలు కావాలనుకుంటారో అలాంటి సదుపాయాలన్నీ కూడా కల్పించాలి. సహాయ శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేల రూపాయలు ఇవ్వండి. వ్యక్తులైతే వారికి రూ.1000లు ఇవ్వండి. కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ దృక్పథంతో ఉండాలి. ఆయా ఇళ్ల నుంచి సహాయ శిబిరాలకు వచ్చిన వారిని వారిని తిరిగి పంపించేటప్పుడు వారికి రూ.10 వేల రూపాయలు ఇవ్వాలి. తిరిగి కచ్చా ఇంటిని నిర్మించుకోవడానికి వారికి ఉపయోగపడుతుంది. కచ్చా ఇంటి విషయంలో పాక్షికంగా దెబ్బతిందా? లేక పూర్తిగా దెబ్బతిందా? అన్న వర్గీకరణ వద్దు. వాళ్లు ఉండేదే కచ్చా ఇళ్లు అయినప్పుడు వర్గీకరణ అనవసరం’’ అని సీఎం స్పష్టం చేశారు.
చదవండి: మొసలికన్నీరు.. ఈనాడుకు ఆ దమ్ముందా?

అలాంటి వారికి రూ.10 వేల ఆర్థిక సహాయం ఇస్తే.. తిరిగి ఆ కచ్చా ఇంటిని మరమ్మతు చేసుకోవడానికి, తిరిగి కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాంటి వారి జీవితాలపై మరింత భారం పడేలా వ్యవహరించకూడదు. అందుకే మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్లను కోరుతున్నాను. ఇలాంటి సమయాల్లో వారికి బాసటగా నిలిచామనే మాట రావాలి. అలాగే ముంపునకు గురైన ఇళ్లు, అలాగే వరదనీరు ప్రవహించిన ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. ఉదారంగా నిత్యావసరాలను పంపిణీ చేయాలి. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు, కేజీ పామాయిల్‌, కేజీ కందిపప్పు ఇవ్వాలి’’ అని సీఎం పేర్కొన్నారు.

ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఏడాది కూడా ఇలాంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. కంట్రోలు రూమ్స్‌ ఏర్పాటు చేయడం, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలి. సచివాలయ స్థాయిలో కూడా కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయండి. సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోండి. ముంపు బాధిత గ్రామాల మీద, లంకల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సరిపడా నిల్వ ఉండేలా చూసుకోవాలి. లంక గ్రామాలలో జనరేట్లర్లు లాంటి వాటిని సిద్ధం చేసుకోండి’’ అని సీఎం సూచించారు.
చదవండి: ఇదో కార్పొరేట్ ఫ్రాడ్‌.. మార్గదర్శి మోసాలపై ఏపీ సీఐడీ కీలక ప్రెస్‌మీట్‌

తాగు నీటి కొరత లేకుండా, తాగునీటి సరఫరా వ్యవస్థలు నిలిచి పోకుండా తగిన చర్యలు తీసుకోండి. తాగునీటి ప్యాకెట్లను సిద్ధంచేసుకోండి. పారిశుద్ధ్య కార్యక్రమాలు ఆయా గ్రామాల్లో ముమ్మరంగా చేపట్టండి. అలాగే ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయండి. విలేజ్‌ క్లినిక్స్‌, పీహెచ్‌సీల్లో సరిపడా మందులను ఏర్పాటు చేసుకోండి. దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకోవాలి. వరదల కారణంగా పాముకాట్లు పెరుగుతాయి, వీటికి అవసరమైన మందులను అందుబాటులో చేసుకోండి. వరదనీరు తగ్గాక పంట నష్టం వివరాలను నమోదు చేసుకుని రైతులకు బాసటగా నిలిచేలా చర్యలు తీసుకోవాలి. అత్యంత పారదర్శకత పద్ధతిలో ఎన్యుమరేషన్ జరగాలి’’ అని సీఎం జగన్‌ ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top