పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న మృతురాలి కుటుంబ సభ్యులు
దళిత వృద్ధురాలిపై యువకుడి అత్యాచారయత్నం.. ఆపై దాడి
అవమాన భారం, మానసిక వేదనతో వృద్ధురాలి మృతి
పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన ఆమె బంధువులు
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
విచారణలో పోలీసులు సరిగ్గా స్పందించడం లేదనే విమర్శలు
ఈ నెల 15న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
సాక్షి, టాస్క్ ఫోర్స్: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి స్వగ్రామమైన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యనకండ్లలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు..గ్రామంలోని దళిత వర్గానికి చెందిన వృద్ధురాలు (65) ఈ నెల 15న పశువుల కోసం గడ్డిమోపు ఎత్తుకుని పొలం నుంచి ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన దాట్ల అమర్నాథ్ (24) వెనుకవైపు నుంచి వచ్చి ఆమె నెత్తిన ఉన్న గడ్డిమోపును కిందకు నెట్టేశాడు. ఆపై ఆమె నోరు మూసి అత్యాచార యత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో వృద్ధురాలి ఛాతీ, శరీరంపై గాయాలయ్యాయి. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అటుగా వెళుతున్న మద్దిలేటి గట్టిగా అరవడంతో అమర్నాథ్ వృద్ధురాలిపై దాడి చేసి పరారయ్యాడు.
ఈ ఘటనను ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పలేక వృద్ధురాలు తీవ్ర మనోవేదనకు గురైంది. అవమాన భారంతో వారం పాటు మానసిక బాధను అనుభవిస్తూ అన్న పానీయాలు మానేసింది. దీంతో అస్వస్థతకు గురై ఈ నెల 22న మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు బనగానపల్లె పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. అమర్నాథ్ గతంలో కూడా గ్రామంలో కొంత మంది మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలున్నాయి. ఈ క్రమంలో ఆ యువకుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేసినట్లు తెలుస్తోంది.
వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి సొంత ఊరు కావడంతో పోలీసులు కేసు విషయంలో పెద్దగా స్పందించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమర్నాథ్‌పై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.


