రెండు ప్రాణాలు బలిగొన్న వివాహేతర సంబంధం
మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని గొంతు కోసి చంపేసిన ప్రియుడు
ఆపై తానూ ఆత్యహత్య చేసుకున్న వైనం
రెండు కుటుంబాల్లో విషాదం
కర్ణాటక సరిహద్దు చేలూరులో దారుణం
మృతులిద్దరూ అన్నమయ్య జిల్లాకు చెందిన వారే
పెద్దతిప్పసముద్రం: అనుమానం పెనుభూతమైంది. ప్రియురాలు మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆమె ఇంట్లోనే గొంతు కోసి చంపేశాడు. ఆపై ప్రాణ భయంతో తానూ ఇంటికి వెళ్లి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటక రాష్ట్రం సరిహద్దు చేలూరులో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మృతులిద్దరూ అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలానికి చెందినవారే.
వివరాలు ఇలా..
మండలంలోని కందుకూరుకు చెందిన మస్తాన్ కర్ణాటక రాష్ట్రం చేలూరుకు చెందిన సల్మా (40)ను వివాహం చేసుకుని చేలూరులోని గెరిగిరెడ్డిపాళ్యలో స్థిర పడ్డాడు. ఇదే పంచాయతీలోని నిలువురాతిపల్లికి చెందిన బావాజాన్ (42) కర్ణాటక రాష్ట్రం చింతామణిలోని తస్లీమ్‌ను వివాహం చేసుకుని చేలూరులోని రంగుండ్లులో కాపురం పెట్టారు. మూడేళ్ల కిందట బావాజాన్ భార్యా, పిల్లలను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో బావాజాన్ గెరిగిరెడ్డిపాళ్యంలో ఉన్న సల్మాతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఇటీవల సల్మాపై అనుమానం పెంచుకున్న బావాజాన్ ఎలాగైనా ఆమెను అంతమొందించాలని భావించాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సల్మా ఇంటికి వెళ్లిన బావాజాన్ మాయమాటలతో ఆమెను మంచంపైనే అతి కిరాతకంగా గొంతు కోసి చంపేశాడు. విషయం వెలుగులోకి వస్తే తనను బతకనీయరని భావించిన బావాజాన్ ప్రాణభయంతో ఇంటికి వెళ్లి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ వార్తతో చేలూరు గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రకాష్, సీఐ ఎం.శ్రీనివాస్ ఘటనా స్థలాలకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాగేపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.


