సీఎం బంధువు సంస్థ పద్మావతి నిర్వహణలో ఉన్న అనంతపురం జీజీహెచ్‌లో అధ్వానంగా పారిశుద్ధ్యం(ఫైల్)
చంద్రబాబు పాలనలో ప్రభుత్వాస్పత్రుల్లో అధ్వానంగా మారిన పారిశుద్ధ్యం
శానిటేషన్ నిర్వహణపై దాదాపు సగం మంది రోగుల అసంతృప్తి
కాంట్రాక్టు సంస్థల పనితీరుకు మాత్రం ప్రభుత్వం డిస్టింక్షన్ స్కోర్‌లు
తద్వారా భారీగా కమీషన్లు దండుకునేందుకు ప్రభుత్వ పెద్దల కుట్ర
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారైంది. పారిశుద్ధ్య నిర్వహణ దారుణంగా మారడంతో వార్డులు కంపుకొడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఐవీఆర్‌ఎస్ సర్వేలోనే డీఎంఈ ఆస్పత్రుల్లో పరిశుభ్రతపై 47.37 శాతం... అంటే దాదాపు సగం మంది రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పారిశుద్ధ్య పనులు నిర్వహించే కాంట్రాక్ట్ సంస్థలకు పనితీరుకు 100కు 96 స్కోర్‌లు ఇచ్చేస్తోంది. అధ్వానంగా సేవలు అందిస్తున్న కాంట్రాక్టు సంస్థలకు భారీ స్కోర్‌లు ఇచ్చి, కాంట్రాక్ట్ నిబంధనలు సైతం తుంగలో తొక్కి 100 శాతం బిల్లులు చెల్లించడం ద్వారా కమీషన్‌లు దండుకోవడానికి అధికార పార్టీ నేతలు, అధికారులు మాయ చేస్తున్నారు.
సీఎం బంధువు సంస్థ సేవల్లో ఘోరం..
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గతేడాది ప్రభుత్వాస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్ నిర్వహణకు టెండర్‌లు పిలిచారు. కోరినంత కమీషన్లు ఇవ్వడానికి ముందుకొచ్చిన, పక్క రాష్ట్రాల్లో టెర్మినేట్ అయిన సంస్థలకు సైతం ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టేశారు. డీఎంఈలో జోన్–3 (రాయలసీమ)లోని ఆస్పత్రుల పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్ట్‌ను సీఎం బంధువుకు చెందిన పద్మావతి సంస్థకు ఇచ్చారు. తొలుత శానిటేషన్, సెక్యూరిటీ నిర్వహణకు ఉమ్మడి టెండర్ పిలిచారు. అయితే, దానికి పద్మావతి సంస్థ దాఖలు చేసిన బిడ్‌కు అర్హత లేదని తేలింది. దీంతో ఏకంగా టెండర్‌నే రద్దు చేసి పారిశుద్ధ్యం, సెక్యూరిటీకి వేర్వేరుగా ప్రభుత్వం టెండర్‌లు ఆహ్వానించినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.
ఇప్పుడు పద్మావతి సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్పత్రుల్లో పరిశుభ్రతపై ఏకంగా 45 శాతం మంది వరకు రోగులు, వారి బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అయినా సీఎం బంధువు సంస్థ కావడంతో సేవలు ఎలా ఉన్నా సరే పనితీరుకు ఏకంగా 96 స్కోర్‌లు ఇచ్చేస్తున్నట్టు వెల్లడైంది. గత డిసెంబర్ నెలలో ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో అనంతపురం జీజీహెచ్‌లో పరిశుభ్రతపై 43.8 శాతం రోగులు అసంతృప్తి వ్యక్తంచేశారు. అయినా ఆ నెల పద్మావతి సంస్థ పనితీరుకు 96 స్కోర్ ఇచ్చారు.
ఇంత స్కోర్ దక్కించుకున్న సంస్థ అటెండెన్స్ పర్సంటేజ్ గమనిస్తే డిసెంబర్ నెలలో 58.71 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. రోగుల సంతృప్తి, కాంట్రాక్ట్ సంస్థ సిబ్బంది హాజరు 60 శాతం దాటకపోయినా... సీఎం బంధువు సంస్థ కావడంతో అధ్వాన పనితీరుకు కూడా 96 మార్కులు ఇచ్చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే నెలలో తిరుపతి రుయా, కడప మెంటల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌లో 40 శాతం చొప్పున, కడప జీజీహెచ్‌లో 42.31 శాతం మంది రోగులు పద్మావతి పనితీరును చీదరించుకోగా, ఆ సంస్థ పనితీరుకు ప్రభుత్వం మాత్రం ఏకంగా 90 నుంచి 96 స్కోర్‌లు ఇచ్చేసింది.
జోన్–2లోనూ అదే దుస్థితి..
ఏపీలో టెండర్‌లు కొనసాగుతున్న సమయంలోనే పక్క రాష్ట్రంలో టెర్మినేట్ అయిన ఆల్ సర్వీసెస్ సంస్థకు ప్రభుత్వం జోన్–2 ఆస్పత్రుల శానిటేషన్ కాంట్రాక్ట్‌ను కట్టబెట్టింది. ఇప్పుడు ఆ సంస్థ సేవలు అందిస్తున్న నెల్లూరు జీజీహెచ్‌లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని 36 శాతం మంది రోగులు అసంతృప్తి వ్యక్తంచేయగా, ప్రభుత్వం మాత్రం అద్భుతంగా పని చేస్తోందని 96 స్కోర్ ఇచ్చింది. విజయవాడ జీజీహెచ్‌లో 37 శాతం మంది రోగులు పారిశుద్ధ్య నిర్వహణ బాగాలేదని తెలియజేసినా 93 స్కోర్ ఇవ్వడం గమనార్హం.

నిబంధనలు తుంగలో తొక్కి
శానిటేషన్‌లో 20, సెక్యూరిటీలో 9 ప్రమాణాలకు 100 చొప్పున స్కోర్‌లు ఉంటాయి. వీటికి 95 మేర స్కోర్‌లు ఉండటంతోపాటు ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నేషన్ సిస్టం) అటెండెన్స్ 95 శాతం చొప్పున ఉంటేనే కాంట్రాక్ట్ సంస్థలకు 100 శాతం బిల్లులు ఇవ్వాలని నిబంధనలున్నాయి. వీరికి వంద శాతం బిల్లులు వస్తేనే తమకు ఎక్కువ కమీషన్ ఇస్తారని ముఖ్య నేతల ఒత్తిళ్లతో ఆస్పత్రుల్లో అధికారులు శానిటేషన్, సెక్యూరిటీపై పర్యవేక్షణ గాలికొదిలేసి, అధ్వానమైన పనితీరుకు కూడా ఏకంగా 96 శాతం మేర స్కోర్‌లు ఇచ్చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
మరోవైపు బిల్లుల చెల్లింపుల్లో టెండర్ నిబంధనలను సైతం ఉన్నతాధికారులు తుంగలో తొక్కేసినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ సంస్థలు ఆస్పత్రుల్లో పనులు మొదలు పెట్టిన రోజు నుంచే ఎఫ్‌ఆర్‌ఎస్ 95 శాతం సహా ఇతర నిబంధనలు అమలవ్వాలి. అయితే గతేడాది జూన్, జూలైలో కొత్త కాంట్రాక్ట్ సంస్థలు పనులు మొదలు పెట్టాయి. వీరికి బిల్లుల చెల్లింపుల్లో గతేడాది డిసెంబర్ వరకు ఉన్నతాధికారులు నిబంధనల్లో పలు సడలింపులు ఇచ్చారు. ఇది టెండర్ నిబంధనలకు పూర్తి విరుద్ధమని విమర్శలు వినిపిస్తున్నాయి.


