గ్రీన్‌ డ్రామాకు గ్రాండ్‌ కాన్వాయ్‌ సైకిల్‌ షో | CM Chandra Babu Cycle Rally In Vizag | Sakshi
Sakshi News home page

గ్రీన్‌ డ్రామాకు గ్రాండ్‌ కాన్వాయ్‌ సైకిల్‌ షో

Jun 6 2026 11:36 AM | Updated on Jun 6 2026 11:50 AM

CM Chandra Babu Cycle Rally In Vizag

ఈవీ సవారీ సరే... పర్యావరణ ప్రయోజనాలెక్కడ బాబూ? 

బాబు గారి సైకిల్‌ స్టంట్‌ షూటింగ్‌ కోసం కెమెరాలు, డ్రోన్లు 

కాన్వాయ్‌ వాహనాల పరేడ్, స్తంభించిన ట్రాఫిక్‌ 

ప్రచారం కోసం ప్రజలకూ, విద్యార్థులకూ తిప్పలు 

గ్రీన్‌ మెసేజ్‌ కంటే ఆర్భాటమే ఎక్కువైందన్న విమర్శలు

సాక్షి, విశాఖపట్నం : రెడీ.. స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌.. విశాఖ తీరంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పర్యావరణాన్ని కాపాడేయాలనే తపనతో మన చంద్రబాబు గారు ఎలక్ట్రిక్‌ సైకిల్‌ ఎక్కారు. ఆయన సైకిల్‌ తొక్కుతుంటే.. చుట్టూ పది కెమెరాలు, ఆకాశంలో డ్రోన్లు, వెనుక భజన బృందాల హంగామా. ఆహా.. ఓహో అంటూ పొగడ్తలు. అయితే ఈ ‘గ్రీన్‌ రైడ్‌’ వల్ల పర్యావరణానికి ఎంత మేలు జరిగిందో పక్కన పెడితే.. ఆ ప్రాంతాన్ని మాత్రం కాలుష్యం కమ్మేసింది. 

ఆదేశాలు ఎన్నో... నిధులేవి? 
బాబు గారికి మాటలు ఎక్కువ.. నిధులు తక్కువనే విషయం మరోసారి ఫ్రూవ్‌ అయింది. తొలి నుంచి విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ అంటూ ప్రజల్ని మభ్యపెడుతున్న ఆయన.. విశాఖ వచ్చిన ప్రతిసారీ దానిపై ఓ సమావేశం పెడుతూ అధికారులకు ఆదేశాలు జారీ చేసేస్తున్నారు. ఈసారి కూడా 9 జిల్లాల కలెక్టర్లను విశాఖకు రప్పించుకొని అదే తరహా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కైలాసగిరి నుంచి భోగాపురం వరకూ బే సిటీ ప్రాజెక్టు అభివృద్ధి చేయాలంటూ అధికారుల్ని ఆదేశించారు. గ్రే హౌండ్స్‌కి చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించాలన్నారు. వివిధ ప్రాజెక్టుల వద్ద పారిశ్రామిక ప్రాంతాల్ని ఆనుకొని ఏర్పాటు చేసే టౌన్‌
íÙప్‌ల అభివృద్ధిపైనా దృష్టిసారించాలని ఆదేశించారు. ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాలి. కానీ.. ఒక్కపైనా విదల్చడం లేదు. గత ఏడాది యోగా డే నిర్వహించినందుకే రూ.30 కోట్లు ఇంకా బాకీ ఉంచారు, ఇప్పుడు కొత్త ప్రాజెక్టులకు డబ్బులెక్కడివి బాబూ? అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

అవి ఉత్తుత్తి పెట్టుబడులా..? 
గతేడాది భాగస్వామ్య సదస్సులో బీచ్‌ రోడ్డులో రూ. వేల కోట్ల ప్రాజెక్టులు వచ్చేసాయంటూ ఊదరగొట్టారు. కట్‌ చేస్తే.. ఇప్పుడు మళ్లీ అదే బీచ్‌ రోడ్డులో వాటర్‌ స్పోర్ట్స్‌ కోసం ‘పెట్టుబడులను ఆహ్వానించండి’ అంటూ అధికారులకు ఆర్డర్స్‌ వేస్తున్నారు. అంటే.. ఆ రోజు చెప్పినవన్నీ ఉత్తుత్తి ముచ్చట్లేనా అనే అనుమానం ప్రజల్లో గట్టిగా వస్తోంది. మొత్తానికి, నేషనల్‌ సీఫుడ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ వర్క్‌షాప్‌ను కూడా బాబు గారు తన పబ్లిసిటీ స్టంట్‌కే చక్కగా వాడుకున్నారన్నమాట!

షో సరే.. విద్యార్థుల సంగతేంటి? 
ఈ సైకిల్‌ యాత్రకు మరింత హంగులు అద్దడానికి కొంతమంది విద్యార్థులను రంగంలోకి దించారు. బాబు గారు, ఆయన మంత్రులు హ్యాపీగా ఎలక్ట్రిక్‌ సైకిల్స్‌ ఎంజాయ్‌ చేస్తే.. విద్యార్థులకు మాత్రం తొక్కే కొద్దీ అలసట వచ్చే సాధారణ పెడల్‌ సైకిళ్లు ఇచ్చారు. నోవాటెల్‌ హోటల్‌ రాగానే బాబు గారి షూటింగ్‌ ప్యాకప్‌ అయిపోయింది. అంతే, అధికారులు తక్షణమే విద్యార్థుల నుంచి సైకిళ్లను లాగేసుకుని.. ‘మీ పనైపోయింది, ఇక ఇంటికిపోండి’ అంటూ మండుటెండలో రోడ్డు మీద వదిలేశారు. వేడి తాపానికి ఆ పిల్లలు అల్లాడుతుంటే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

సైకిల్‌ సవారీ.. భారీ కాన్వాయ్‌  
బాబు గారు పర్యావరణాన్ని కాపాడటానికి సైకిల్‌ మీద వెళ్తుంటే.. ఆ సైకిల్‌ వెనుక మంత్రులు, అధికారులు, రక్షణ సిబ్బందికి చెందిన పదుల సంఖ్యలో భారీ కాన్వాయ్‌ వాహనాలు పొగలు కక్కుతూ నెమ్మదిగా కదిలాయి. ఏయూ గ్రౌండ్స్‌ నుంచి సిరిపురం మీదుగా నోవాటెల్‌కు కేవలం 15 నిమిషాల సమయం పడుతుంది. కానీ.. కాస్త రూట్‌ మార్చి పోలమాంబ టెంపుల్‌ నుంచి జీసీసీ మీదుగా బీచ్‌రోడ్డులో రావడం వల్ల దాదాపు గంట సమయం పట్టింది. దీంతో గంట పాటు విశాఖ దారుల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. వాహనదారులు ఇంజిన్లు ఆఫ్‌ చేయకుండా అలాగే ఉంచేయడంతో.. బాబు గారి పుణ్యమా అని వాయు కాలుష్యం నెక్ట్స్‌లెవెల్‌కి చేరింది. ప్రజలు ఎండలో మలమలమాడుతుంటే, బాబు గారు మాత్రం సైకిల్‌ పబ్లిసిటీ షూటింగ్‌లో బిజీగా ఉండిపోయారు. కొన్ని చోట్ల ప్రజలు చంద్రబాబును చూడకుండా ఉండేందుకు రోడ్డుకు ’పరదాలు’ కూడా కట్టేయడం విశేషం.

సైకిల్‌పై నుంచి పడి విద్యార్థికి గాయాలు 
సైకిల్‌ సవారీలో అపశృతి చోటుచేసుకుంది. చంద్రబాబు, మంత్రులు, అధికారులు హ్యాపీగా ‘ఈవీ’ సైకిళ్లపై వెళ్లగా.. విద్యార్థులకు సాధారణ పెడల్‌ సైకిళ్లు ఇచ్చి వెనుక పరుగెత్తించారు. కరకచెట్టు పోలమాంబ దేవాలయం దాటిన తర్వాత డౌన్‌లో అజితేష్‌ అనే విద్యార్థి ఒక్కసారిగా తూలి కిందపడిపోగా స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే స్పందించి, ఆ విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తన వెనుక వస్తున్న విద్యార్థి కిందపడి గాయపడినా.. చంద్రబాబు కానీ, ఆయన వెంట ఉన్న మంత్రులు కానీ కనీసం ఆగి పరామర్శించకుండా, తమ ‘సైకిల్‌ షో’ పబ్లిసిటీయే ముఖ్యం అన్నట్టుగా ముందుకు సాగిపోవడం గమనార్హం.  

Advertisement
 
Advertisement
Advertisement