లోకేశ్‌ కపట ప్రేమ! | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ కపట ప్రేమ!

Published Wed, Apr 10 2024 4:28 AM

Chinnababu is working on correcting the mistake - Sakshi

నాడు భారీ యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు

ఉపాధి కరవై రోడ్డున పడ్డ ఇసుక కార్మికులు

తప్పు సరిదిద్దుకొనే పనిలో చిన్నబాబు

ఇదంతా ఎన్నికల జిమ్మిక్కులేనంటున్న బాధితులు 

తాడేపల్లిరూరల్‌: ఇసుక కార్మికులపై టీడీపీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్‌ కపట ప్రేమ చూపుతున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్ర భుత్వ హయాంలో ఇసుక కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని, భారీ యంత్రాలతో ఇసుక దోచుకుంటున్నారని ఎన్నికల వేళ పసలేని ఆరోపణలు చేశారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుకను అమ్ముకున్న సంఘటనలు, అడ్డుకున్న అధికారులపై జరిగిన దాడులు మరిచి, మేము అధికారంలోకి వస్తే ఇసుక, భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని కల్పిస్తామంటూ హామీ లు గుప్పిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. లోకేశ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో 2014 నుంచి 2019 వరకు పరిణామాలను పరిశీలిస్తే...

2014కు ముందు...
ఉండవల్లి ప్రకాశం బ్యారేజ్‌ పైభాగంలో సైతం ఇసుక కార్మికులు నీటిలోకి దిగి పారలతో ఇసుక లోడింగ్‌ చేసేవారు. ప్రకాశం బ్యారేజ్‌ దిగువ ప్రాంతంలోని పాతూరు, గుండిమెడ, చిర్రావూరు, గొడవర్రు, రామచంద్రాపురం, పెదకొండూరు, వీర్లపాలెం  దళిత కుటుంబాలు ఇసుక ట్రాక్టర్లకు, లారీలకు లోడింగ్‌ చేసి,  పొట్ట నింపుకునేవారు. 2014 తర్వాత అక్రమంగా హైదరాబాద్‌కు ఇసుక టీడీపీ అధికారం చేపట్టగానే ఆ పార్టీ సామాజిక వర్గానికి చెందిన నేతలు రేపల్లె నుంచి అచ్చంపేట వరకు మకాం వేశారు. దొరికిన కాడికి ఇసుక దోచుకుంటూ జేబులు నింపుకొన్నారు.

కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఉన్న ఇసుక కార్మికులను ఒక్కొక్కరిని తొలగించారు. అనుమతులు లేని భారీ పడవలను దించి, వాటికి ఇసుక తోడే యంత్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు ఒక్కొక్క ఇసుక క్వారీ నుంచి 30 వేల టన్నుల ఇసుకను హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు భారీ వాహనాల్లో తరలించేవారు. ఇది గమనించిన స్థానిక నాయకులు మా ప్రాంతంలో కూడా ఇసుక తవ్వకాలు చేసుకోవచ్చని తలచారు. అంతే... భారీ యంత్రాలతో దోపిడీకి పాల్పడ్డారు. 

అప్పటి గుంటూరు ఎమ్మెల్యే సోదరుడిది కీలక పాత్ర
ఈ దోపిడీలో అప్పటి గుంటూరుకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు, నారా లోకేశ్‌ మిత్రుడు కీలక పాత్ర పోషించారు. చినబాబుకు సైతం భారీగా సొమ్ములు పంపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పాతూరు, గుండిమెడ ఇసుక రీచ్‌లో కార్మికులను పోలీసులతో బెదిరించి మరీ బయటకు పంపివేశారు. చిర్రావూరులో కొంతకాలం అక్కడి కార్మికులకు పని కల్పించారు. తర్వాత భారీ వాహనాల్లో ఇసుకను బయటకు తరలించాలంటే కార్మికుల వల్ల కాదని తాత్కాలికంగా మూడు రోజులపాటు క్వారీని నిలుపుదల చేశారు. అనంతరం 200 యంత్రాలు తీసుకువచ్చి ఇసుక లోడింగ్‌ నిర్వహించారు. దీంతో కార్మికులకు ఉపాధి కరవైంది. 

అధికారులను బెదిరించి...
ఇసుక రీచ్‌ల్లో అధికారులు యంత్రాలకు అనుమతులు ఇవ్వనప్పటికీ వారిని భయభ్రాంతులకు గురిచేసి భారీగా తవ్వకాలు చేపట్టారు. అనుమతులకు మించి తవ్వకాలు వల్ల ఆ గుంతల్లో పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. వీటిని మూసివేయాలని పాతూరు, చిర్రావూరు తదితర ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చేశారు. పోలీసులచేత బెదిరించి, ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరిపారని నేటికీ కార్మికులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement