
నన్ను మద్యం స్కాంలో ఇరికించాలని చూడడం అనైతికం
రెండు రోజులుగా నా సన్నిహితుడు వెంకటేశ్ కుటుంబాన్ని హింసిస్తున్నారు
ఏఎస్పీ కొల్లు శ్రీనివాస్ తీరు సిట్ సిబ్బందికే నచ్చడం లేదు
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
తిరుపతి రూరల్: తనను లిక్కర్ స్కాంలో ఇరికించాలని కుట్రలు చేయడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ‘నాకు చిన్నప్పటి నుంచి సన్నిహితుడైన, హైదరాబాద్‌లో నివసిస్తున్న వెంకటేశ్, ఆయన భార్య, ఏడాది వయసున్న కుమారుడిని సిట్ అధికారులు తీసుకువెళ్లి రెండు రోజులుగా హింసిస్తున్నారు. నాపై తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వాలని వారిపై ఒత్తిడి తేవడం అన్యాయం, అనైతికం. మీ టార్గెట్ నేనే అయితే వచ్చి అరెస్టు చేసుకోండి.
దయచేసి నాతో ఉన్నవాళ్లను ఇబ్బంది పెట్టకండి’ అని కోరారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని నివాసం వద్ద శుక్రవారం మీడియా సమావేశంలో చెవిరెడ్డి మాట్లాడారు. నైతిక విలువలున్న వెంకటేశ్‌ను సిట్ అధికారులు కార్యాలయంలో బంధించి భయపెడుతున్నారని మండిపడ్డారు. ఏఎస్పీ శ్రీనివాస్ విచక్షణ కోల్పోయి అనరాని మాటలతో మానసికంగా బాధించడం తగదన్నారు. తప్పుడు స్టేట్‌మెంట్‌లో సంతకం పెట్టకుంటే ఈ కేసులో కాకున్నా, తనవద్ద విచారణలో ఉన్న ఏదో ఒక కేసులో ఇరికించి శాశ్వతంగా జైలు జీవితం గడిపేలా చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
అయినా, వెంకటేశ్ అంగీకరించకపోవడంతో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఎంత డబ్బు కావాలన్నా తీసిస్తా, వర్కులు ఇప్పిస్తా, మంచి సంబంధాలు ఏర్పాటు చేయిస్తా. ఒక్క సంతకం పెట్టు చాలు అని ప్రలోభపెడుతున్నట్టు తెలిసిందని చెవిరెడ్డి వివరించారు. ‘ వెంకటేశ్ అంగీకరించకపోవడంతో ఏఎస్పీ శ్రీనివాస్ సిట్ కార్యాలయంలోని బల్లలను గుద్దుతూ గట్టిగా అరుస్తూ భయానక వాతావరణం సృష్టించారని సిబ్బందే చెబుతున్నారు.
అమాయకులను వేధిస్తూ ఎవరి కళ్లలో ఆనందం చూడడానికి కొల్లు శ్రీనివాస్ ఇదంతా చేస్తున్నారో తెలియడం లేదు. నన్ను అరెస్టు చేయాలన్న తపన, తాపత్రయం, అందుకోసం చేస్తున్న అరాచకం చూసిన సిట్ కార్యాలయ సిబ్బంది మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారన్న విషయాన్ని శ్రీనివాస్ గమనించాలి’ అని చెవిరెడ్డి సూచించారు. అమాయకులను హింసిస్తున్న కొల్లు శ్రీనివాస్‌ను ప్రకృతి మర్చిపోదని, సమాజం హర్షించదని గుర్తించాలని పేర్కొన్నారు.
