సీఎం జగన్‌ కలిసిన చెస్‌ క్రీడాకారిణి కోలగట్ల మీనాక్షి

Chess Player Kolagatla Meenakshi Meet CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి కలిశారు. చిన్నారిని ప్రత్యేకంగా అభినందించిన సీఎం జగన్, అంతర్జాతీయ స్ధాయిలో ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రఖ్యాతలు నిలబెట్టేలా చదరంగంలో మరింతగా రాణించాలని సీఎం ఆకాంక్షించారు. మీనాక్షికి అవసరమైన విధంగా పూర్తిస్ధాయిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు..

మీనాక్షికి విశాఖపట్నంలో వెయ్యి చదరపు గజాల ఇంటిస్ధలం, ఆమె చెస్‌లో కెరీర్‌ను కొనసాగించేందుకు కార్పస్‌ ఫండ్‌ నుంచి రూ.1 కోటి నిధిని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో రికార్డులు నెలకొల్పిన మీనాక్షి.. ఇటీవల ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ 2023 పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు.

వరల్డ్‌ నెంబర్‌ 1 అండర్‌ 12 గర్ల్స్‌ చెస్‌ 2023 (ఫిడే ర్యాంకింగ్స్‌), వరల్డ్‌ నెంబర్‌ 1 అండర్‌ 11 గర్ల్స్‌ చెస్‌ 2022, వరల్డ్‌ నెంబర్‌ 2 అండర్‌ 10 గర్ల్స్‌ చెస్‌ డిసెంబర్‌ 2021, ఉమెన్‌ ఫిడే మాస్టర్‌ 2022, ఉమెన్‌ క్యాండిడేట్‌ మాస్టర్‌ 2021 టైటిల్స్‌ గెలుచుకోవడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లలో పలు పతకాలు సాధించిన విషయాన్ని ముఖ్యమంత్రితో మీనాక్షి, తల్లిదండ్రులు పంచుకున్నారు. మీనాక్షి ప్రతిభను సీఎం ప్రశంసించారు. వివిధ క్రీడా రంగాల్లో ప్రతిభ కనపరిచి ఆంధ్రప్రదేశ్‌ పేరు ప్రఖ్యాతలు అంతర్జాతీయ వేదికలపై చాటుతున్న క్రీడాకారులకు తమ ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
చదవండి: ఆశా మాలవ్యకు సీఎం జగన్‌ అభినందనలు.. రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top