ఆశా మాలవ్యకు సీఎం జగన్‌ అభినందనలు.. రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం

CM Jagan Announced Cash Incentive Of 10 Lakhs To Asha Malaviya - Sakshi

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పర్వతారోహకురాలు ఆశా మాలవ్య సోమవారం కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. కొద్దిరోజులుగా సైక్లింగ్ చేస్తూ అనేక రాష్ట్రాలలో పర్యటిస్తున్న ఆశా లక్ష్యం నెరవేరాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని సీఎం ప్రకటించారు.

సైకిల్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25,000 కిలో మీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పిన ఆశా.. ఇప్పటివరకు ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలోమీటర్లు పూర్తయిందని సీఎంకి వివరించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌ జిల్లా నతారామ్‌ గ్రామానికి చెందిన ఆశా మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళేందుకు దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్‌యాత్ర చేస్తున్నారు.

సీఎంను కలిసిన అనంతరం ఆశా మాలవ్య మీడియాతో మాట్లాడుతూ, స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వైఎస్‌ జగన్‌లాంటి ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శమన్నారు. ‘‘ప్రస్తుతం నేను 25వేల కిలోమీటర్ల సంపూర్ణ భారత యాత్ర చేస్తున్నాను. నవంబర్‌ 1న భోపాల్‌లో నా సైకిల్ యాత్ర ప్రారంభించి నేడు విజయవాడ చేరుకున్నాను. మొత్తం 28రాష్ట్రాల్లో నా యాత్ర నిర్వహించాలనేది టార్గెట్ ఇప్పటికే 7రాష్ట్రాల్లో నా సైకిల్‌ యాత్ర పూర్తయింది’’ అని ఆమె పేర్కొన్నారు.

భారత దేశం మహిళలకు అంత సురక్షితమైన దేశం కాదని విదేశాల్లో తప్పుడు అభిప్రాయం ఉంది. మహిళలకు భారతదేశంలో పూర్తి భద్రత ఉందని నేను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిగారిని కలిశాను. సీఎంని కలవడం ఎంతో ఉద్వేగంగా, గర్వంగా ఉంది. దేశం అభివృద్ధితో పాటు మహిళల భద్రతలాంటి విషయాలపై ముఖ్యమంత్రి అభిప్రాయాలు ఎంతో గొప్పగా ఉన్నాయి’’ అని ఆశా మాలవ్య అన్నారు.
చదవండి: విశాఖ అమ్మాయి.. భారీ ప్యాకేజ్‌తో కొలువు

‘‘మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఏపీలో మహిళల భద్రత కోసం దిశా యాప్‌ ప్రవేశపెట్టారు. నేను దిశా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని దానిని చెక్ చేశాను. దిశా యాప్ ఎంతో గొప్పగా పనిచేస్తోంది. ఏపీలో మహిళలు మాత్రమే కాదు అందరూ సురక్షితంగా ఉన్నారు. నా ఆశయం కోసం ముఖ్యమంత్రి నాకు 10లక్షల రూపాయలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. నేను తిరుపతి వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించాను. అక్కడి నుంచి నాకు ప్రత్యేక రక్షణ అందించారు’’ అని ఆశా మాలవ్య చెప్పారు.

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top