తండ్రి సాధించకున్నా.. ఆ ఆశయాన్ని నెరవేర్చిన వైజాగ్‌ బిడ్డ

Visakhapatnam Repaka Eshwari Priya Salary package Success Story - Sakshi

మనం అనుకున్నవి నెరవేరకున్నా..  ఆ లక్ష్యం మరో రూపంలో నెరవేరే అవకాశాలు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి తండ్రీకూతుళ్ల కథే ఇది. తన తల్లి ప్రోత్సహంతో ఉన్నత స్థానానికి ఎదగాలనుకున్న వ్యక్తి.. కన్నకూతురి రూపంలో ఆ ఆశయాన్ని నెరవేర్చుకున్నాడు. భారీ ప్యాకేజీ కొలువుతో తండ్రి కలను తీర్చి.. ఆయన పేరును నలుదిశలా చాటిన ఆ మధ్యతరగతి బిడ్డ పేరు రేపాక ఈశ్వరి ప్రియ. పైగా ఏయూ చరిత్రలోనే పెద్ద ప్యాకేజీ అందుకున్న అమ్మాయి కూడా ఈమెనే కావడం గమనార్హం!. 

రేపాక శ్రీనివాసరావుది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. ఆయన ఎలక్ట్రానిక్‌ స్పేర్‌పార్ట్‌లు అమ్ముకునే చిరు వ్యాపారి. ఆయన భార్య రాధ.. గృహిణి. కొడుకు సందీప్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌. ఇక కూతురు ఈశ్వరి ప్రియ గురించి చెప్పుకోవాల్సింది చాలానే ఉంది. కానీ, అంతకంటే ముందు శ్రీనివాసరావు గురించి చెప్పాలి. చిన్నతనంలో ఆయనకు బాగా చదువుకోవాలని కోరిక. అదే ఆయన తల్లి కూడా కోరుకుంది.  కానీ, ఆమె శ్రీనివాసరావు చిన్నతనంలోనే చనిపోయారు. అదే సమయంలో ఆర్థిక పరిస్థితులు సహకరించక.. చదువు ముందుకు సాగలేదు. ఏళ్లు గడిచాయి.. ఆయన పెద్దయ్యాడు.. ఆయనకు ఓ కుటుంబం వచ్చింది. తాను చదువుకోలేకపోయానన్న బాధను.. తరచూ పిల్లల ముందు వ్యక్తపరిచేవారాయన. ఆ మాటలు కూతురు ఈశ్వరి ప్రియను బాగా ప్రభావితం చేశాయి. 

‘నేనెలాగూ చదువుకోలేకపోయా. మీరైనా బాగా చదువుకోవా’లనే మాటలను ఆమె బాగా ఎక్కించుకుంది.  ఇంటర్‌, ఆపై ఎంసెట్‌లో మంచి ర్యాంక్‌ సాధించింది. కానీ, తండ్రి కళ్లలో ఇంకా పూర్తి స్థాయిలో ఆనందం చూడలేదామె. మంచి ఉద్యోగంలో స్థిరపడినప్పుడే తన తండ్రి సంతోషంగా ఉంటాడని భావించిందామె. మంచి ర్యాంక్‌ రావడంతో ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌లో చేరింది. ఈ క్రమంలో సందీప్‌ సైతం సోదరికి ఎంతో ప్రోత్సాహం అందించాడు.

వెనువెంటనే..
థర్డ్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు.. మోర్గాన్‌ స్టాన్లీ సంస్థలో ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసింది. రెండు నెలల ఇంటర్న్‌షిప్‌లో.. ఆమెకు రూ.87 వేలు స్టైపెండ్‌ వచ్చింది. అప్పుడే.. ఆ కంపెనీ రూ.28.7 లక్షల ప్యాకేజీతో(ఇయర్‌ శాలరీ) ఆఫర్‌ చేసింది. ఆపై అమెజాన్‌ సంస్థ కోడింగ్‌ పరీక్షలోనూ ఎంపికై.. నెలకు రూ.1.4 లక్షల అందించడం మొదలుపెట్టింది. నెల పూర్తయ్యే లోపే.. అట్లాషియన్‌లో భారీ ప్యాకేజీతో కొలువు దక్కించుకుంది. ఏకంగా ఏడాదికి.. రూ.84.5 లక్షల ప్యాకేజీని ఆఫర్‌ చేసింది అట్లాషియన్‌ కంపెనీ. ఇది తాను అసలు ఊహించలేదని ఈశ్వరి చెబుతోంది. అంతేకాదు వర్క్‌ఫ్రమ్‌ హోం కావడంతో.. తమ బిడ్డ కళ్లెదురుగానే ఉంటూ పని చేసుకుంటుందంటూ ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

పెద్ద ప్యాకేజీ ఇంటర్వ్యూ అంటే.. ఆమె ఆందోళనకు గురైందట. అది తెలిసిన శ్రీనివాసరావు.. మరేం ఫర్వాలేదు.. ఇదొక్కటే జీవితం కాదు. అంతా మన మంచికే. నీ వంతు ప్రయత్నించు అని కూతురికి ప్రొత్సహం ఇచ్చి పంపించారు. ఆ మాటలే ఆమెలో ధైర్యాన్ని నింపాయి. ఇంటర్వ్యూ అయిన రోజే అపాయింట్‌మెంట్‌ లెటర్‌ మెయిల్‌ చేశారు.  కిందటి ఏడాది అక్టోబర్‌లో అట్లాషియన్‌ కంపెనీ కోడింగ్‌ కోసం పోటీ పెడితే.. దేశవ్యాప్తంగా 30 వేల మంది విద్యార్థులు పోటీ పడ్డారు. 300 మందిని ఫైనల్‌ పోటీలకు ఎంపిక చేసి వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. టెక్నికల్‌ సిస్టమ్‌ డిజైన్‌, హెచ్‌ఆర్‌ దశల్లో పరీక్షించి పది మందిని ఉద్యోగాలకు, చదువుతున్న మరో పది మందిని ఇంటర్న్‌షిప్‌లోకి తీసుకున్నారు. విశేషం ఏంటంటే.. ఈ ఉద్యోగానికి ఏపీ నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తి ఈశ్వరినే.  
   
ఉపాధి అవకాశాల కోసం సోషల్‌ మీడియాలో అనేక ఫ్లాట్‌ఫామ్‌లు ఉంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజినీరింగ్‌ ఉద్యోగావకాశాలు చాలానే ఉంటున్నాయి. కాకపోతే.. క్యాంపస్‌లో కాకుండా బయట రిక్రూట్‌మెంట్స్‌పై దృష్టిసారించాలి అని సలహా ఇస్తోంది ఈ విజేత. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top