
సాక్షి, విజయవాడ: తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడులో ఆ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ఘోర అవమానం జరిగింది. కార్యకర్తలను ఆకర్షించేందుకు మొక్కుబడిగా ఎన్టీఆర్ జపం చేసే చంద్రబాబు నాయుడు.. మహానాడులో ఆయనకు భారతరత్న ఇచ్చే విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు!. ఆయన మనవడు చనిపోతే.. కనీసం వేదికపై సంతాపం కూడా వ్యక్తం చేయలేదు!!.
కడప వేదికగా జరిగిన మహానాడులోనూ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానం చంద్రబాబు చేయలేదు. దీంతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే చంద్రబాబు మాత్రం తనకు అనుకూలంగా ఎన్టీఆర్ ఏఐ వీడియోను తయారు చేశారు. ఇందులో ఎన్టీఆర్ మనసుకు, ఆయన ఉన్నప్పటి స్టేట్‌మెంట్లకు విరుద్ధంగా చంద్రబాబు పొడిగించుకున్నారు. భళా మనవడా.. అంటూ ఎన్టీఆర్ వారసుడు లోకేష్ అంటూ ఏఐ వీడియోలో చెప్పించుకుని ఆనంద పడ్డారు. ఇది కూడా తీవ్ర చర్చనీయాంశమై.. ట్రోలింగ్‌కూ దారి తీసింది.
రాజకీయావసరం పడినప్పుడల్లా చంద్రబాబు ఎన్టీఆర్ పేరును వాడుకుంటారనేది తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా తెలుసు. పలు సందర్భాల్లో కంటి తుడుపు చర్యగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని పైకి మాట్లాడినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో టీడీపీ భాగమైనప్పటికీ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించే విషయాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదనే మాట వినిపిస్తోంది.

ఇక, ఈ మహానాడుకు నందమూరి కుటుంబం పూర్తిగా దూరంగా ఉంది. నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా మహానాడుకు హాజరు కాకపోవడం గమనార్హం. ఎన్టీఆర్ తనయుడు, టీడీపీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ కూడా హాజరుకాలేదు(సినిమాలే ముఖ్యం అనుకున్నారేమో). అలాగే, నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్బంగా నందమూరి తారకరత్న మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నారా లోకేష్.. తారకరత్న ప్రస్తావన కూడా తీసుకురాలేదు. కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడం గమనార్హం.