2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం కొబ్బరికాయ కొట్టిన చంద్రబాబు
ఏ అనుమతీ లేకుండానే భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన
బోలెడు చిక్కుముళ్లతో క్షేత్ర స్థాయిలో ముందుకు సాగని ప్రాజెక్టు
వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే కోర్టు కేసుల పరిష్కారం
రూ.900 కోట్లతో చకచకా భూసేకరణ పూర్తి
బాధితులకు రెట్టింపు పరిహారం.. సకల సౌకర్యాలతో పునరావాసం
అన్ని అనుమతులతో 2023 మే 3న భూమి పూజ
జీఎంఆర్ ఆధ్వర్యంలో వేగంగా నిర్మాణం
ప్రభుత్వం దిగిపోయేనాటికి దాదాపు పనులు పూర్తి
మిగతా అరకొర పనులు పూర్తి చేసేందుకు ఏడాదిన్నర సమయం
ఈ వాస్తవాల మధ్య ఇదంతా తన ఘనతగా బాబు ప్రచారం
ట్రయల్ రన్‌లో భాగంగా నేడు మొదటి విమానం ల్యాండింగ్
సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్‌ను నేనే కట్టాను.. సెల్ ఫోన్‌ను నేనే కనిపెట్టాను.. సత్య నాదెళ్ల, పీవీ సింధులు నా వల్లే ఎదిగారు.. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చాను.. అని గొప్పలు చెప్పుకునేదెవరని అడిగితే.. ‘చంద్రబాబే’ అని ఎవరైనా ఇట్టే సమాధానమిస్తారు. రూపాయి పని చేయకపోయినా మొత్తం తానే చేసినట్లు, గంపెడు మట్టి పోయకున్నా ప్రాజెక్టు తన వల్లనే పూర్తయినట్లు, ఇసుమంత కూడా తన ప్రమేయం లేని ప్రాజెక్టులన్నీ తన చలవేనని చెప్పుకోవడంలో ఎప్పుడూ ముందుండే సీఎం చంద్రబాబు.. ఇప్పుడు తాజాగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తన ఖాతాలోనే వేసుకుంటున్నారు.
వాస్తవానికి ఈ విమానశ్రయానికి ఏ మాత్రం అనుమతులు, భూసేకరణ వంటి ప్రాథమిక ప్రక్రియలు చేపట్టకుండానే 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఇదే చంద్రబాబు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన కోర్టు కేసులను కొలిక్కి తెచ్చారు. భూసేకరణ పూర్తి చేసి, భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించారు. పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించి విమానాశ్రయానికి సంబంధించి దాదాపుగా పనులు పూర్తి చేశారు. మిగిలిన ఆ పనుల పూర్తికి చంద్రబాబు ఏడాదిన్నర సమయం తీసుకుని.. ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం అంతా తన ఘనతగా చెప్పుకుంటున్నారు. తద్వారా మరో క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని జనం చర్చించుకుంటున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే పూర్తి స్థాయిలో భూ సేకరణ
⇒ 2014–19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేసి వదిలేసింది. తర్వాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్‌విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు క్షేత్ర స్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు.
⇒ భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు పరిహారం చెల్లించారు. డి.పట్టా భూములకు జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు. దీంతో రైతులు చాలా మంది పిటిషన్లు ఉపసంహరించుకున్నారు. మిగతా వాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించింది.
⇒ విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 422.69 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 1,413 మంది రైతులకు చెందిన 1,383.39 ఎకరాల జిరాయితీ భూమి, 572 మంది లబ్ధిదారుల స్వాధీనంలో ఉన్న డీ పట్టా (అసైన్డ్) భూమి సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది.
⇒ ఇందులో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 2,203 ఎకరాలను కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడ వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ ప్రక్రియను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది. చెన్నై–హౌరా జాతీయ రహదారిపై నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా అనుసంధాన రోడ్డు, ట్రంపెట్ ఆకారంలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ రెండో దశలో పూర్తయ్యింది.
చంద్రబాబువి టెంకాయ రాజకీయాలు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 15 వేల ఎకరాలు అవసరమంటూ ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనతో రైతులు ఆందోళనకు దిగడంతో 5 వేల ఎకరాలకు దిగొచ్చారు. భూ సేకరణ నిబంధనలేవీ పాటించకుండా నోటిఫికేషన్ విడుదల చేశారు. పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షలేనని ప్రకటించారు. నిర్వాసితులకు ఏం చేయబోతున్నామన్నది ప్రకటించలేదు. దీంతో నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ రైతులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లు పరిష్కారం కాకముందే ఎన్నికలు సమీపించడంతో ఓట్ల కోసం 2019 ఫిబ్రవరి 14న టెంకాయ కొట్టి శంకుస్థాపన చేయడం గమనార్హం.
క్రెడిట్ చోరీకి పోటాపోటీ
వైఎస్ జగన్ కృషినంతటినీ పక్కన పెట్టి.. సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌లు భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో క్రెడిట్ చోరీలో పోటీ పడుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఢిల్లీ టూర్‌కు వచ్చినప్పుడల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. లోకేశ్ ఓ దశలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ను నిలదీశారంటూ కూడా ఓ వర్గం మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ఘనత తమదేనని ఈ ముగ్గురూ ఎవరంతకు వారు తమ కోటరీల ద్వారా ప్రచారానికి తెర లేపడంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు ఘనత వైఎస్ జగన్‌ది అయినప్పటికీ.. ఆయనకు పేరు రాకుండా ఉండేందుకు వీరు పాట్లు పడుతుండటంపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రెడిట్ అంతా వైఎస్ జగన్‌దే
ఉత్తరాంధ్ర అభివృద్ధికి దిక్సూచి కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి 2023 మే 3న నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేశారు. అన్ని అనుమతులతో పనుల ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విమానాశ్రయం నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ అధిగవిుంచింది. రూ.900 కోట్లతో 2,751 ఎకరాల భూమి సేకరణ పక్కాగా పూర్తి చేసింది. కేసులు వేసిన రైతుల డిమాండ్లను పరిష్కరించింది. రెట్టింపు పరిహారం ఇచ్చింది. ఇళ్లు కోల్పోయిన 376 నిర్వాసిత కుటుంబాలకు దాదాపు రూ.80 కోట్లతో టౌన్‌షిప్‌ను తలదన్నే సౌకర్యాలతో కాలనీలు నిర్మించింది.
ఒక్కో కుటుంబానికి పునరావాస పరిహారంగా 5 సెంట్ల స్థలం, రూ.8.70 లక్షల చొప్పున మంజూరు చేసింది. సంబంధిత రైతులకు సుమారు రూ.18 కోట్ల వరకూ పరిహారాన్ని చెల్లించింది. జీఎంఆర్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకుంది. 2025 నాటికి ఏటా 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో తొలి దశ పూర్తి చేయాలనే లక్ష్యంగా అడుగులు పడ్డాయి.
భారీ విమానాలు దిగడానికి వీలుగా 3.8 కిలోమీటర్ల పొడవున రన్‌వే పటిష్టంగా నిర్మించేలా చర్యలు తీసుకుంది. విమానాశ్రయం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. భోగాపురం–విశాఖపట్నం మధ్య ఆరు లేన్ల రహదారి నిర్మించేందుకు అడుగులు పడింది కూడా వైఎస్ జగన్ హయాంలోనే. ఇప్పుడు పనులు చివరి దశకు చేరుకోవడంతో జనవరి 4న విమానం ల్యాండింగ్ ట్రయల్ రన్‌కు డీజీసీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


