ఆదినారాయణరెడ్డి కుమారుడు డ్రగ్స్ కేసులో పట్టుబడటం సిగ్గుచేటు
కూటమి ప్రభుత్వ వైఫల్యమే డ్రగ్స్ విజృంభణకు కారణం
ఎమ్మెల్యే అరాచకాలు అన్నీఇన్నీ కావు
మాజీ మంత్రి విడదల రజిని ఫైర్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి కుమారుడే డ్రగ్స్ కేసులో పట్టుబడటం సిగ్గు చేటని, గంజాయి, డ్రగ్స్‌ను పెంచి పోషిస్తున్నది కూటమి నేతలేనన్న విషయం ఈ ఘటనతో తేటతెల్లమైందని వైఎస్సార్‌సీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిద్రలేచింది మొదలు ప్రవచనకర్తలా ఆదినారాయణరెడ్డి నీతులు చెబుతుంటారు. కానీ.. ఆయన కుమారుడు సుధీర్‌రెడ్డి ఇంట్లోనే డ్రగ్స్ తీసుకుంటూ తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇప్పుడేమంటావ్ ఆదినారాయణరెడ్డీ. ఇప్పటికైనా వాస్తవాలు ఒప్పుకుంటావా?గంజాయి, డ్రగ్స్‌ను పెంచి పోషిస్తున్నది మీ కూటమి నేతలేనని?
తండ్రీకొడుకులు పరువు తీశారు
‘ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సాగిస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. కడప జిల్లాలో ఎక్కడ రౌడీయిజం జరిగిగా అక్కడ ఆదినారాయణరెడ్డి ఉంటారు. గంజాయి, డ్రగ్స్‌ను అలవాటు చేసి రౌడీలను పెంచిపోషిస్తున్నారు. చివరకు ఎమ్మెల్యే కొడుకు అవే డ్రగ్స్‌కు అలవాటుపడి తెలంగాణ పోలీసులకు దొరికిపోయాడు. తండ్రీ కొడుకులు కలిసి ఇటు రాష్ట్రం పరువుతోపాటు వైఎస్సార్ కడప జిల్లా పరువును బజారుకు ఈడ్చారని కడప జిల్లా ప్రజలు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే డ్రగ్స్‌ను అరికడతామని గొప్పగా చెప్పిన పాలకులు చివరకు రాష్ట్రాన్ని డ్రగ్స్ గుప్పిట్లోకి నెట్టేశారు.
రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం 260 శాతం పెరిగిందని డీజీపీ చెప్పడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. సాక్షాత్తు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడే డ్రగ్స్ కేసులో పట్టుబడటం చూస్తే కూటమి పాలన ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. గంజాయి నిర్మూలన కోసం నాటి వైఎస్ జగన్ సర్కార్ పెద్ద యుద్ధమే చేసింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం డ్రగ్స్ మత్తులో కూరుకుపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరం.
బాబు పాలనలో హాస్టళ్లు నిర్వీర్యం
చంద్రబాబు పాలనలో సంక్షేమ హాస్టళ్లు నిర్వీర్యం అయ్యాయని విడదల రజిని మండిపడ్డారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో 46 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆహారం, తాగునీరు కలుషితం కావడం, పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే విద్యార్థుల వరుస మరణాలు సంభవిస్తున్నాయన్నారు. హాస్టళ్లలో మరణ మృదంగం మోగటానికి కారణం పాలనా వైఫల్యం కాదా.. దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


