మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకున్నందుకు వీఆర్వోపై హత్యాయత్నం
తిరుపతి జిల్లాలో బరితెగించిన టీడీపీ నాయకులు
రేణిగుంట: మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారనే కారణంతో అధికార టీడీపీ నాయకులు వీఆర్వోను మభ్యపెట్టి తమతో తీసుకెళ్లి హత్యాయత్నానికి యత్నించిన ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. రేణిగుంట మండలంలోని కృష్ణాపురం వీఆర్వో సాయికుమార్ శనివారం రాత్రి రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం వెంకటాపురం పంచాయతీలోని అంకమ్మ నాయుడు మిట్ట లో శుక్రవారం సాయంత్రం జేసీబీ, ట్రాక్టర్లతో మట్టి అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారని స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో వెంకటాపురం వీఆర్వో రామ్ చరణ్ తేజ్, కృష్ణాపురం వీఆర్వో సాయికుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. అయితే ఆర్. అగ్రహారం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, సింగల్ విండో డైరెక్టర్ గజేంద్ర రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, సురేంద్ర వీఆర్వోల విధులకు ఆటంకం కలిగిస్తూ జేసీబీ, ట్రాక్టర్లను సీజ్ చేయకుండా అడ్డగించారు. ఎన్ని గుండెలు.. మమ్మల్నే ఎదిరిస్తారా..?అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి సమయం కావడంతో ఈ విషయాన్ని తహసీల్దార్‌కు తెలియజేసి వీఆర్వోలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రెండు గంటలు నిర్బంధం, బెదిరింపులు
అయితే అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో, సోమశేఖర్ రెడ్డి వీఆర్వో సాయికుమార్‌కు ఫోన్ చేశాడు. ‘నీతో మాట్లాడాలి’ అని చెప్పి రేణిగుంట బ్రిడ్జి వద్ద గల ఒక హోటల్ దగ్గరకు పిలిపించాడు. అక్కడి నుంచి తన కారులో వీఆర్వోను తీసుకెళ్లి డాలర్స్ కాలనీ, పాత రేణిగుంట ప్రాంతంలో సుమారు రెండు గంటలు నిర్బంధించి, బెదిరింపులకు పాల్పడ్డాడు. తరువాత గజేంద్ర రెడ్డి, సురేంద్ర కూడా సాయికుమార్‌ను నిర్భందించిన చోటుకు వచ్చారు. ఆయనను తీవ్రంగా కొట్టారు. చంపుతామని బెదిరించారు. మరో వీఆర్వో రామ్ చరణ్ తేజ్ నివాసం చూపించాలని బలవంతం చేశారు. అనంతరం తిరుపతి వరకు తిప్పి ఉదయం సుమారు 5 గంటలకు రేణిగుంట పట్టణంలో వదిలి వెళ్లారు. ఈ ఘటనను రెవెన్యూ ఉన్నత అధికారులకు తెలియజేసి, వారి సూచనల మేరకు రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో సాయికుమార్ ఫిర్యాదు చేశారు.


