రాజధాని ముసుగులో చంద్రబాబు సర్కార్ అవినీతి, అక్రమాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్తుకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే మిగతా ప్రాంతాల అభివృద్ధి మాటేమిటి?
ఏడేళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండి భూములిచ్చిన రైతులకు కనీసం ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు బాబూ?
సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయితే అమరావతి కోసం ఇప్పటికే రూ.47,387 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నట్లు?
బటన్లు నొక్కడం పెద్ద విషయం కాదన్న బాబు.. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలూ ఎందుకివ్వలేకపోతున్నారు?
వైఎస్ జగన్ ప్రశ్నలకు జవాబు చెప్పలేక సీఎం చంద్రబాబు నుంచి మంత్రుల వరకూ ఎదురుదాడి
ప్లాన్–ఏ నచ్చకపోతే.. ప్లాన్–బీ మావిగన్ అమలు చేయాలంటూ వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదనకు అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన
అమరావతి పేరుతో భ్రమలు కల్పిస్తూ బాబు సర్కారు యథేచ్ఛగా సాగిస్తున్న దోపిడీపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ
దాంతో వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఎల్లో మీడియాతో కలిసి టీడీపీ కూటమి నేతల డైవర్షన్ పాలిటిక్స్
వైఎస్ జగన్ ప్రతిపాదించిన రాజధాని కారిడార్ ‘మావిగన్’ ఆచరణాత్మకం.. మేలు చేస్తుందని అంతటా చర్చ
హైవే.. అంతర్జాతీయ విమానాశ్రయం.. పోర్టు లాంటివి ఉన్నందున రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా మారుతుందంటున్న పరిశీలకులు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు సర్కార్ సాగిస్తున్న అవినీతి, అక్రమాలు, నిర్వాకాలను నిలదీస్తూ... ఏ రాజధాని లేని రాష్ట్రంగా అంధ్రప్రదేశ్‌ను దెబ్బతీస్తున్న వైనాన్ని నిగ్గదీస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంధించిన ప్రశ్నాస్త్రాలు అందరిలో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు ప్రాంతాలను అనుసంధానించి రాజధాని కారిడార్ ‘మావిగన్’గా ప్రకటించాలంటూ చేసిన ఆచరణాత్మక ప్రతిపాదనను రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఆ మూడు జిల్లాల్లో పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. జాతీయ రహదారులతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు లాంటి సదుపాయాలు ఉన్నందున ప్రత్యేకంగా మౌలిక వసతుల కోసం పెద్దగా వ్యయం చేయాల్సిన అవసరం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసీ... అమరావతి పేరుతో చంద్రబాబు భ్రమలు కల్పిస్తూ.. రాజధాని ముసుగులో కమీషన్ల పర్వానికి తెర తీశారని పేర్కొంటున్నారు.
రాష్ట్రానికి రాజధాని గుదిబండగా మారకూడదనే ఉద్దేశంతో, తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్‌గా మారే అవకాశం ఉన్న విశాఖను పరిపాలన (ఎగ్జిక్యూటివ్) రాజధానిగా.. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా... అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలనుకున్నామని వైఎస్ జగన్ తెలిపారు. అయితే సీఎం చంద్రబాబుకు అది నచ్చ లేదని.. అందుకే వాటిని రద్దు చేశారన్నారు. ఇక రాష్ట్రాన్ని తక్కువ ఖర్చుతో గ్రోత్ ఇంజన్‌గా మార్చాలనే ఉద్దేశంతో ఆర్నెల్ల క్రితం తాము ప్రతిపాదించిన ప్లాన్–బీ ప్రకారం అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ లాంటి కనీస సదుపాయాల కల్పనకు అయ్యే వ్యయం రూ.2 లక్షల కోట్లలో కేవలం 10 శాతం ఖర్చు చేస్తే మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల కారిడార్ ‘మావిగన్’ మహానగరంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్పుడూ.. ఇప్పుడూ వైఎస్ జగన్ ఆచరణాత్మకమైన ప్రణాళికను ప్రతిపాదించారని మేధావుల నుంచి సామాన్యుల వరకూ అన్ని వర్గాల ప్రజలు ప్రశంసిస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో అమరావతిలో భవనాల చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు చేస్తుండటం.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులను కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున నిర్మిస్తుంటే, అదే తరహా రోడ్లకు రాజధానిలో కి.మీ.కు ఏకంగా రూ.53 కోట్లను ఖర్చు చేస్తుండటాన్ని బట్టి చూస్తే భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందనే చర్చ ప్రజల్లో బలంగా జరుగుతోంది. ‘సిండికేటు’ కాంట్రాక్టర్లతో కలిసి భారీ ఎత్తున దోచుకుంటుండటం వల్లే వైఎస్ జగన్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పలేకపోతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది చంద్రబాబు సర్కార్‌ను మరింత ఇరకాటంలోకి నెట్టింది. దాంతో రాజధానిలో అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ సీఎం చంద్రబాబు, మంత్రులు, కూటమి నేతలు మాటలతో దాడి చేస్తూ తమకు అలవాటైన రీతిలో డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ ప్రశ్నలకు బదులేది బాబూ..?
1. ఆచరణ సాధ్యం కాదని తెలిసీ... అమరావతి పేరుతో చంద్రబాబు భ్రమలు కల్పిస్తూ.. రాజధాని ముసుగులో కమీషన్ల పర్వానికి తెర తీశారు. రాజధానికి తొలి విడత తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, మురుగునీటి వ్యవస్థ, తాగునీటి సరఫరా, వరద నీటి మళ్లింపు లాంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చు కేంద్రానికి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన డీపీఆర్ ప్రకారమే ఎకరాకు రూ.2 కోట్లు అవుతుంది. ఆ 50 వేల ఎకరాలకు అయ్యే రూ.లక్ష కోట్లకే దిక్కు లేదనుకుంటే.. ఇప్పుడు మళ్లీ మరో 50 వేల ఎకరాలకు అదనంగా అయ్యే వ్యయం మరో రూ.లక్ష కోట్లు. అలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తోంది? ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఆ పనులన్నీ పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఆ సమయంలో.. ఆ 2 లక్షల కోట్ల వ్యయం ఇంకా ఎంతకు చేరుతుంది? రోడ్లు వేయటానికే దశాబ్దాలు తీసుకుంటే ఇక రాజధాని ఎక్కడుంది? మిగతా ప్రాంతాల అభివృద్ధి మాటేమిటి?
2. ఏడేళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండి (మొదటి విడత ఐదేళ్లు, ఇప్పుడు రెండేళ్లు) కూడా భూములిచ్చిన రైతులకు కనీసం ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? రాజధానికి భూములిచ్చి 50–60 సార్లు సీఆర్‌డీఏ కార్యాలయం చుట్టూ తిరిగామని రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
3. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయితే అమరావతి కోసం ఇప్పటికే రూ.47,387 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నట్లు? అప్పు కాకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు ఎందుకు చేస్తున్నారు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే రాజధాని కోసం తెస్తున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారెంటీలు ఎందుకు ఇస్తున్నారు? భూములు అమ్మి డబ్బు తెస్తానని నమ్మబలికి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ప్రభుత్వ ఖజానాపై ఎందుకు భారం మోపుతున్నారు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే.. ఇప్పటి వరకు అమ్మిన భూములు ఎన్ని? మీ విజనరీ ఆలోచనల ద్వారా అమరావతి ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంత డబ్బులు వచ్చాయి? లక్ష ఎకరాల అమరావతిలో ఇంత వరకు కట్టింది ఎంత? అమరావతి మానస పుత్రిక (పెట్ ప్రాజెక్టు) అంటూ ఇంతవరకు మీరు చేసిన పనులేమిటి?
4. అమరావతి పనుల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగు(ఎస్‌ఎఫ్‌టీ)కి రూ.11 వేల నుంచి రూ.14 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఆరు వరుసలతో జాతీయ రహదారులను కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తుంటే.. అమరావతిలో కి.మీ.కు రూ.53 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నారు. అంత వ్యయం ఎందుకవుతోంది? ఏ స్కాముల వల్ల అది ఎగబాకుతోంది?
5. రాజధాని అమరావతిలో టెండర్లు ఒక్కసారి గమనిస్తే.. 2018లో ఏ పనులు, ఎవరు చేశారో 2024 టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా ఇప్పుడు వారికి అవే పనులకు సంబంధించిన టెండర్లు దక్కాయి. ఇది గూడుపుఠాణి కాదా? మాఫియా వ్యవహారం కాదా? ఒకవైపు అనూహ్యంగా టెండర్లు రద్దు చేసి అంచనా వ్యయాన్ని పెంచేస్తూ.. కాంట్రాక్టర్లను సిండికేటు చేస్తున్నారు. 2018లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కే మళ్లీ అధిక ధరలకు కట్టబెడుతున్నారు. ఇది భయంకరమైన దోపిడీ కాదా?
6. రాజధానిలో కేవలం గవర్నమెంటు కాంప్లెక్స్‌లో సచివాలయ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు డిజైన్లకే రూ.401 కోట్లు ఖర్చు చేశారు? దేశంలో ఎక్కడైనా డిజైన్లకు ఇంతలా ఖర్చు చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇందులోనూ దోపిడీకి పాల్పడతారా?
7. బటన్‌లు నొక్కడం పెద్ద విషయం కాదు.. ఎవరైనా నొక్కుతారని, తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారు. రెండేళ్లు పూర్తి కాకముందే చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులు రూ.3.37 లక్షల కోట్లు. అప్పు చేస్తే గానీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని ఎలా నిర్మిస్తారు? రైతులు, అక్కచెల్లెమ్మలు, విద్యార్థుల సంక్షేమం మాటేంటి? శిథిలమవుతున్న స్కూళ్లు, ఆస్పత్రుల పరిస్థితి ఏమిటి? ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటి? ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన రూ.36 వేల కోట్ల బకాయిల పరిస్థితి ఏమిటి? ఇక తప్పనిసరిగా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతల పరిస్థితి ఏమిటి? రాజధానికే ఖర్చు చేస్తూ పోతే రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు ఏం కావాలి?
8. రాజధానికి 2015లో సమీకరించిన 50 వేల ఎకరాల్లో ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అత్యద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు పదే పదే గొప్పగా ప్రకటించారు. బాహుబలి సినిమాను తలదన్నే రీతిలో డిజైన్లతో మాయ చేశారు. ఇప్పుడేమో 50 వేల ఎకరాలకే పరిమితమైతే అమరావతి మున్సిపాల్టిగా మిగిలిపోతుందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అప్పుడొక మాట.. ఇప్పుడొక మాటా? కాంట్రాక్టు పనులనూ అధిక ధరలకు సిండికేటు కాంట్రాక్టర్లకు అప్పగించి.. భూములను అస్మదీయులకు కట్టబెట్టి దోచుకోవడానికే కదా మళ్లీ 50 వేల ఎకరాలు కావాలంటున్నారు!
9. తెలంగాణలో 10 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయాన్ని నిర్మించారు. అందులో ఇంకా స్థలం ఖాళీగా ఉంది. కానీ.. రాజధాని అమరావతిలో 52.20 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం కట్టే పనులను కాంట్రాక్టర్లకు చంద్రబాబు సర్కార్ అప్పగించింది. ఇంత భారీ ఎత్తున నిర్మిస్తూ.. పెద్ద ఎత్తున ఖర్చు చేయడం కమీషన్ల కోసమే కదా?
10. రాజ్యాంగంలో దేశ రాజధాని అని ఉంటుందే గానీ ఎక్కడా రాష్ట్రాల రాజధాని ప్రస్తావన లేదు.. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అంటూ అధికారికంగా, రాష్ట్ర హైకోర్టులో 2020 ఆగస్టు 19న కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం 2000లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్రాలకు రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. ఆ రాష్ట్రాలే రాజధానిపై నిర్ణయం తీసుకున్నాయి. మరి ఎవరికీ వర్తించనిది.. కేవలం మన రాష్ట్రానికి మాత్రమే ఎందుకు వర్తిస్తోంది? ఎలా వర్తిస్తోంది?
11. అమరావతిని రాష్ట్ర రాజధానిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 సవరించాలని కోరుతూ తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. మరి అదే చట్టసభలో భాగమైన శాసనమండలి సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదు? రాజధాని ముసుగులో సీఎం చంద్రబాబు సాగిస్తున్న అవినీతి, అక్రమాలను కడిగిపారేస్తారనే భయంతోనే కదా!
12. రాజధానికి తొలి విడత భూసమీకరణ చేసి 11 ఏళ్లు పూర్తయింది. చంద్రబాబు ఏ దేశం వెళితే ఆ దేశం బొమ్మలు చూపించి.. అమరావతిని అలా అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టారు. ఆ దేశాలు ఇక్కడేమైనా కనపడుతున్నాయా? కనీసం భూములిచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా అమలు చేశారా?
13. ప్రపంచంలో ఎక్కడైనా రాజధాని నగరాన్ని నిర్మించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? రాజధానిలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం లాంటి ప్రభుత్వ భవనాలు, ఉద్యోగులు క్వార్టర్స్ నిర్మిస్తున్నారు. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతో నగరం తనను తాను నిర్మించుకుంటుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై.. ఇలానే కదా మహానగరాలుగా అభివృద్ధి చెందాయి? లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మించడం సాధ్యం కాదని తెలిసి కూడా భ్రమలు కల్పించడం ప్రజలను మోసం చేయడం కాదా? ఇది రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడానికి చేస్తున్న కుట్ర కాదా?
14. ఒక్క రాజధానికే రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాలనుకున్నప్పుడు కేవలం రూ.5 వేల కోట్లు వ్యయం చేస్తే పూర్తయ్యే కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఎందుకు ఆపేశారు? వాటిని ఎందుకు ప్రైవేటుపరం చేయాలనుకున్నారు? కమీషన్ల కోసమే కదా?
15. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సారవంతమైన పంట పొలాల్లో గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించింది. కమిటీ నివేదికను వక్రీకరించి లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టడం స్కామ్‌ల కోసమే కాదా?


