పీ–4 అంటే పేదల పేరుతో పార్టీ పీపుల్ జేబు నింపుడు
ప్రైవేట్ దాతల సాయంతో పేదరిక నిర్మూలనట
ఇందుకు ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయదట
సమన్వయకర్తలకు మాత్రం ఖజానా నుంచి నిధులు వెచ్చిస్తారట
నియోజకవర్గానికొక పీ–4 సమన్వయకర్త నియామకం
ఆ పేరుతో 175 మంది కూటమి పార్టీల వారికి ఉపాధి
వేతనాల రూపంలో ఏటా రూ.12.60 కోట్ల వ్యయం
ఇది ముమ్మూటికీ ప్రజాధనం దుర్వినియోగమేనంటున్న అధికార వర్గాలు
మరోవైపు కన్సల్టెంట్ల పేరుతోనూ భారీగా ప్రజాధనం దుబారా
సాక్షి, అమరావతి: పేదరికాన్ని నిర్మూలిస్తానంటూ పీ–4 కార్యక్రమంతో ముందుకొచ్చిన కూటమి ప్రభుత్వం.. ఆ పేరుతో తమ వారికి మంచి జీతాలతో ఉపాధి కల్పించేందుకు మాత్రం మార్గం వెతుక్కుంది. ప్రజలు, పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది రోజున శ్రీకారం చుట్టారు. ధనికులు, ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చి పేద కుటుంబాలను ఆరి్థకంగా పైకి తీసుకురావడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కేవలం సహాయకారిగా వ్యవహరిస్తుంది తప్ప రూపాయి నిధులు ఇవ్వదు.
అయితే ఈ ముసుగులో కూటమి పార్టీకు చెందిన వారికి భారీ ఎత్తున ఉపాధి కల్పించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి నెలకు రూ.60 వేల వేతనంతో ఒక పీ–4 సమన్వయకర్త నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ లెక్కన 175 నియోజకవర్గాలకు ఏటా రూ.12.60 కోట్లు వారికి వేతనాల రూపంలో చెల్లించడం అంటే పార్టీ వారికి ఉపాధి కల్పించడమేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు ఆ పని చేయలేరా?
ఇంతకూ పీ–4 సమన్వయ కర్తలు చేయాల్సిన పని ఏమిటంటే నియోజకవర్గ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి.. దాతృత్వ వ్యక్తులు, ప్రైవేటు రంగ సంస్థలను ఒప్పించి సమన్వయం చేస్తూ పౌర సమాజానికి మేలు చేయడం. వాస్తవానికి ఈ పని చేసేందుకు గ్రామ, వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉండనే ఉన్నారు. అయినప్పటికీ పీ–4 సమన్వయకర్తల నియామకం అంటే ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి.. సొంత వారికి ఉపాధి కల్పించడమే అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టు విధానంలో కాకుండా రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన పని లేదంటున్నారు. తద్వారా ఇది ముమ్మాటికీ ప్రజాధనం దుర్వినియోగమేననే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
పేదరిక నిర్మూలన అంటే పేద పిల్లలను చదివించేలా ప్రోత్సహించాలని, ఇందుకు తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం అమలు చేయాలని చెబుతున్నారు. అలా కాకుండా ఊరికొకరిని ఎన్నుకుని వారికి సాయపడితే పేదరికం ఎలా పోతుందని ప్రశి్నస్తున్నారు. పేదరిక నిర్మూలన బాధ్యతలను ప్రైవేట్‌కు అప్పగించిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జన్మభూమి పేరుతో, ఇప్పుడు పీ–4 పేరుతో ప్రభుత్వ సొమ్మును కార్యకర్తలకు దోచిపెట్టడమే బాబు విధానమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కన్సల్టెంట్ల పేరుతో దుర్వినియోగం
⇒ ఎన్నికల్లో సామాన్య నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేదంటే నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీని విస్మరించి ఇప్పుడు భారీగా కూటమి పార్టీలకు చెందిన వారికి లేదా కన్సల్టెన్సీ పేరుతో కార్పొరేట్ సంస్థలకు భారీగా ఉపాధి కల్పిస్తున్నారనే అభిప్రాయాన్ని ఉద్యోగ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, కన్సల్టెన్సీల రాజ్యం మళ్లీ అమల్లోకి వచ్చిందంటున్నారు.
⇒ వికసిత్ ఆంధ్రా విజన్ పేరుతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీలో 71 పోస్టులను కన్సల్టెంట్ల రూపంలో నియమించేందుకు పరిపాలన అనుమతి మంజూరు చేసింది. మరో పక్క రాష్ట్ర ఆదాయం పెంచేందుకు 11 మంది కన్సల్టెంట్లను 8 నెలల కోసం రూ.3.28 కోట్ల చెల్లింపుతో నియమించింది.
⇒ సీఆర్‌డీఏలో ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లు, అమరావతి ఆరి్థకాభివృద్ధిలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి కన్సల్టెంట్లను నియమిస్తోంది. ఇందుకోసం ఏకంగా ఒక్కో కన్సల్టెంట్‌కు నెలకు రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు చెల్లిస్తోంది. 68 మంది కన్సల్టెంట్లకు రెండేళ్లలో రూ.70.64 కోట్లు చెల్లించనుంది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం మరో కన్సల్టెన్సీ ఏజెన్సీని నియమిస్తోంది. ఇందుకోసం రెండేళ్లలో రూ.22.58 కోట్లు చెల్లించనుంది.


