బాబు కుతంత్రం..‘అప్రూవర్‌’ తంత్రం | Chandrababu govt Conspiracy exposed in illegal liquor case Mithun Reddy | Sakshi
Sakshi News home page

బాబు కుతంత్రం..‘అప్రూవర్‌’ తంత్రం

Jul 21 2025 5:17 AM | Updated on Jul 21 2025 8:52 AM

Chandrababu govt Conspiracy exposed in illegal liquor case Mithun Reddy

చార్జ్‌షీట్, రిమాండ్‌ నివేదికల సాక్షిగా మద్యం అక్రమ కేసులో కుట్ర బట్టబయలు  

ఏ2 వాసుదేవరెడ్డి, ఏ3 సత్యప్రసాద్‌లను అప్రూవర్లుగా మార్చేందుకు కుట్ర 

వారితో మరిన్ని అబద్ధపు వాంగ్మూలాల నమోదుకు పన్నాగం

‘సిట్‌’ కుట్ర ఫలించక అప్రూవర్‌ పిటిషన్లతో ఇద్దరూ తిరుగుముఖం 

అనంతరం ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు 

అభ్యంతరం చెప్పకుండా వారికి సహకరించేందుకు సిట్‌ సిద్ధం

అసత్యాలు, వక్రీకరణలతోనే చార్జ్‌షీట్, రిమాండ్‌ నివేదిక 

నేరుగా ఒక్క సాక్ష్యం కూడా చూపకుండా మిథున్‌రెడ్డి అరెస్ట్‌ 

సెల్‌ టవర్‌ లొకేషన్, కాల్‌ డేటాల వక్రీకరణ 

న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే యత్నం

భయపెట్టి.. ప్రలోభపెట్టి.. మద్యం అక్రమ కేసులో తిమ్మినిబమ్మి చేసేందుకు కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఇంతా చేసి.. కోర్టుకు సమరి్పంచిన చార్జ్‌షీట్, రిమాండ్‌ రిపోర్ట్‌లో ఒక్క ఆధారమూ చూపలేదు. ఒకరిద్దరిని అప్రూవర్లుగా మార్చుకోవడమే తమ ముందున్న దారి అని చెప్పకనే చెప్పింది. ఫేక్‌ ఇన్వాయిస్‌లు అంటూ తనకు తానే స్వీయ ధ్రువీకరణ ఇచ్చుకుంది. ఫలానా సమయంలో ఫలానా సెల్‌ టవర్‌ పరిధిలో ఉండటమే ఆధారమని చెప్పుకు రావడం విడ్డూరం. సిట్‌ దర్యాప్తు తీరు చూస్తుంటే సీఎం చంద్రబాబునాయుడు కక్ష సాధింపు తప్ప ఈ కేసులో మరేమీ లేదని తేటతెల్లమవుతోంది.  

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ కుట్ర మరోసారి బట్టబయలైంది. బెదిరించి, వేధించి అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సాగిస్తున్న అక్రమ కేసు కుతంత్రాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వమే మరోసారి బయట పెట్టుకుంది. చంద్రబాబు ప్రభుత్వం రచించిన ‘అప్రూవర్‌ కుట్ర’ తాజాగా వెలుగులోకి వచ్చింది. 

ఈ అక్రమ కేసులో బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌ను ఇప్పటికే తీవ్రంగా వేధించి, మరీ అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించిన కూటమి ప్రభుత్వం.. తాజాగా వారి ద్వారా అప్రూవర్‌ కుట్రకు తెగబడేందుకు యత్నించడం గమనార్హం. 

ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో సిట్‌ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా ఈ కుతంత్రాన్ని చక్కబెట్టేందుకు యత్నించిన వ్యవహారం బయటపడింది. తద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేసినట్టు చంద్రబాబు ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించింది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు తాము అబద్ధపు వాంగ్మూలాలపైనే ఆధార పడ్డామని నిస్సిగ్గుగా వెల్లడించింది. 

ఆ ఇద్దరూ సిట్‌ చీఫ్‌తో భేటీ
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతోగానీ, మద్యం విధానంతో గానీ ఏమాత్రం సంబంధం లేని వారిని కూడా ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు ఏ30 నుంచి ఏ40 వరకు నిందితులుగా పేర్కొని సిట్‌ అరెస్టు చేసింది. వారిలో ప్రపంచ స్థాయి సిమెంట్‌ దిగ్గజ సంస్థ వికాట్‌ కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పతోపాటు పలువురు ఉన్నారు. 

ఇదే కేసులో నిందితులైన వాసుదేవరెడ్డి(ఏ2), సత్య ప్రసాద్‌(ఏ3)­లను బెదిరించి, అప్రూవర్‌లుగా మారేందుకు అనుమతించాలని, వారిద్దరితో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ వేయించాలని పన్నాగం పన్నింది. ఇందులో భాగంగా శనివారం వారు విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి వచ్చారు. ముందుగా సిట్‌ కార్యాలయానికి వెళ్లారు. సిట్‌ చీఫ్‌ ఎస్వీ రాజ­శేఖర్‌బాబుతోపాటు ఇతర అధికారులతో సమావేశ­మయ్యారు. 

అనంతరం కొందరు సిట్‌ అధికారు­ల­తో కలసి న్యాయస్థానంలో అప్రూవర్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు వెళ్లారు. ఇలా వారిద్దరితో మరిన్ని అబద్ధపు వాంగ్మూలాలు న్యాయస్థానంలో నమోదు చేయించాలన్నది ప్రభుత్వ పెద్దల ఎత్తుగ­డగా స్పష్టమైంది. అయితే న్యాయ వర్గాలతో చర్చించిన వారు అప్రూవర్‌ పిటిషన్‌ దాఖలు చేయకుండా వెనక్కి తీసుకుని వెళ్లిపోయారు. 

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ నాటకం 
వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌ అప్రూవర్‌ పిటిషన్లు వేయకుండా వెనుదిరగడంపై సిట్‌ అధికారులు ఆందోళనకు గురైనట్లు సమాచారం. వీరిద్దరూ ఎదురు తిరిగితే ఈ అక్రమ కేసు పూర్తిగా నీరుగారి పోతుందని బెంబేలెత్తిన సిట్‌ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. వారి ఆదేశాలతో కొత్త ఎత్తుగడ వేశారు. వాసుదేవరెడ్డి, సత్య ప్రసాద్‌తో హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయించారు. 

ఆ ముందస్తు బెయిల్‌ పిటిషన్లను న్యాయస్థానంలో వ్యతిరేకించకుండా సహకరిస్తామని సిట్‌ అధికారులు వారికి చెప్పినట్టు సమచారం. కాగా హడావుడిగా అప్పటికప్పుడు దాఖలు చేసిన ఆ పిటిషన్లకు తగిన పత్రాలు జతపరచ లేదు. దాంతో సాంకేతిక కారణాలతో న్యాయస్థానం ఆ పిటిషన్లను వెనక్కి పంపింది.

అబద్ధపు వాంగ్మూలాలు ఇలా...
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం పూర్తి పారదర్శకంగా అమలైందని చంద్రబాబు ప్రభు­త్వమే పరోక్షంగా అంగీకరించినట్లయిందని ఈ తాజా పరి­ణా­­మా­లు మరోసారి స్పష్టం చేశాయి. రెడ్‌బుక్‌ కక్ష సాధింపు కోసం తాము నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు కోసం పూర్తిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల­పైనే ఆధార పడ్డామని ప్రభుత్వమే బయట పెట్టుకుంది.

⇒ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డితో­పాటు ఇప్పటి వరకు ఇతర అధికారులు, సాక్షులతో తాము నమోదు చేయించినవన్నీ అబద్ధపు వాంగ్మూలాలే అన్నది స్పష్టమైంది. వాసుదేవరెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్‌ అధికారులు వేధించారు. సిట్‌ వేధింపులపై ఆయన మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం ఆయన్ను వెంటాడి వేధించింది. డెప్యుటేషన్‌ ముగిసినా రిలీవ్‌ చేయకుండా అడ్డుకుంది. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది. దీంతో చివరికి సిట్‌ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్‌ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.



⇒ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించని వారిపై సిట్‌ తన ప్రతాపం చూపించింది. కొన్ని డిస్టిలరీల ప్రతినిధులు వృద్ధులని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ తీసుకువచ్చి వేధించింది. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారిని హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. 

⇒ ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్‌ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

⇒ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి, మదన్‌ రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం వేధించారు. బెంబేలెత్తిన గిరి సిట్‌ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సమ్మతించని మదన్‌ రెడ్డిపై సిట్‌ అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతి కలిగించింది. సిట్‌ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని ఆయన న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు కూడా.

⇒ అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్‌ పదవి ఇవ్వడంతోపాటు రూ.2 కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్‌ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్నేహితుడు వెంకటేశ నాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతోనే ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. ప్రభుత్వ పెద్దల అండతో ఈ అక్రమ కేసు దర్యాప్తు పేరిట సిట్‌ బరితెగించి సాగిస్తున్న అధికారిక గూండాగిరీకి ఈ పరిణామాలే నిదర్శనం.

అబద్ధాలూ.. వక్రీకరణలే 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు కుట్రలో ప్రభుత్వం తన కుతంత్రాలకు మరింతగా పదును పెడుతోంది. పూర్తిగా అవాస్తవాలు, వక్రీకరణలతో నిబంధనలను ఉల్లంఘిస్తోంది. సిట్‌ దాఖలు చేసిన చార్జ్‌షీట్, ఎంపీ మిథున్‌ రెడ్డి రిమాండ్‌ నివేదికలే ఆ విషయాన్ని మరోసారి బయటపెట్టాయి. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించేందుకు సిట్‌ యత్నిస్తోందని ఎంపీ మిథున్‌ రెడ్డి రిమాండ్‌ నివేదిక వెల్లడించింది. 

ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సృష్టించలేకపోయిన సిట్‌ అధికారులు వక్రభాష్యాలతో కనికట్టు చేసేందుకు యత్నించారు. ఈ కేసులో ఇతర నిందితులతోపాటు ఎంపీ మిథున్‌ రెడ్డి సమావేశమై అక్రమాలకు కుట్ర పన్నారని సిట్‌ రిమాండ్‌ నివేదికలో పేర్కొంది. 

అందుకు సిట్‌ చూపించిన ఆధారం ఏమిటో తెలుసా.. సెల్‌టవర్‌ లొకేషన్‌! హైదరాబాద్‌లో సమావేశం జరిగిందని చెబుతున్న రోజున ఎంపీ మిథున్‌ రెడ్డి, ఇతర నిందితుల సెల్‌ ఫోన్లు అన్ని ఒకే చోట ఉన్నట్టు సెల్‌ టవర్‌ లొకేషన్‌ ద్వారా తెలుసుకున్నామని సిట్‌ పేర్కొనడం విడ్డూరంగా ఉంది. 

ఎందుకంటే సెల్‌ టవర్‌ పరిధి 200 చ.మీటర్లు ఉంటుంది. అంత పరిధిలో హైదరాబాద్‌ వంటి కాంక్రీట్‌ జంగిల్‌ వంటి మహానగరంలో వేలాది సెల్‌ ఫోన్లు ఉంటాయి. అంత మాత్రాన ఆ వేలాది మంది కూడా ఒక గదిలో సమావేశమైనట్టు భావించాలా?  

ఎక్కడ న్యాయం? ఎక్కడ ధర్మం?
ఎంపీ మిథున్‌ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన పలువురితో సెల్‌ ఫోన్‌లో మాట్లాడినట్టు కాల్‌ డేటా వివరాలు వెల్లడిస్తున్నాయని సిట్‌ అధికారులు రిమాండ్‌ నివేదికలో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎంపీ. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ నేతగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. అటువంటి క్రియాశీల ప్రజాప్రతినిధి రోజూ ఎందరో నేతలు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలతో ఫోన్లో మాట్లాడుతునే ఉంటారు. 

అంత మాత్రాన వారిందరితో కలసి కుట్ర పన్నినట్టు ఎలా భావిస్తారు? ఎలాంటి ఆధారాలు లేనందునే సిట్‌ అధికారులు సెల్‌ టవర్‌ లొకేషన్, కాల్‌ డేటాలను వక్రీకరిస్తూ న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారన్నది స్పష్టమవుతోంది. దర్యాప్తు పేరిట సిట్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని చార్జ్‌షీట్‌ వెల్లడిస్తోంది. కేంద్ర జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరీ సిట్‌ అధికారులు తమ పరిధిని అతిక్రమించారు. 

మద్యం సరఫరా చేయకుండానే చేసినట్టు ఫేక్‌ ఇన్వాయిస్‌లు సమర్పించినట్టు తమ దర్యాప్తులో వెల్లడైనట్టు సిట్‌ అధికారులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అవి ఫేక్‌ ఇన్వాయిస్‌లని ఎలా గుర్తించారో మాత్రం వెల్లడించనే లేదు. కేంద్ర జీఎస్టీ అధికారులు నిర్ధారించకుండా అవి ఫేక్‌ ఇన్వాయిస్‌లనీ సిట్‌ అధికారులు ఏకపక్షంగా ఎలా తుది నిర్ణయానికి వచ్చారో అర్థం కావడం లేదు. 

అంటే లేని ఆధారాలు ఉన్నట్టుగా సిట్‌ అధికారులు న్యాయస్థానాన్నే తప్పుదారి పట్టించేందుకు తెగిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. కుట్రపూరితంగానే కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఈ కేసులో సిట్‌ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ ఆధారంగానే నిగ్గు తేలింది. ఈ లెక్కన ఈ కేసులో ఎక్కడ న్యాయం ఉన్నట్లు? ఎక్కడ ధర్మం ఉన్నట్లు? ప్రభుత్వం కుట్రతోనే వ్యవహరిస్తున్నదని అడుగడుగునా స్పష్టమవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement