ఖాకీ క్రౌర్యం.. టీడీపీ గూండాల అరాచకం | Chandrababu Govt cases against YSRCP Social Media Activists Illegal Arrest: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఖాకీ క్రౌర్యం.. టీడీపీ గూండాల అరాచకం

Published Tue, Nov 5 2024 4:11 AM | Last Updated on Tue, Nov 5 2024 5:33 AM

Chandrababu Govt cases against YSRCP Social Media Activists Illegal Arrest: Andhra pradesh

రాష్ట్రంలో 4 నెలలుగా టీడీపీ గూండాల అరాచకం

దాడులు, హత్యాచారాలు, అంతులేని విధ్వంసం

వాటిని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులతో కక్ష సాధింపు

టీడీపీ రౌడీ మూకల పాత్రలోకి పోలీసులను ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు

వెరసి ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు.. విచారణ పేరుతో భౌతిక దాడులు

సోషల్‌ మీడియా పోస్టులపై నేరుగా కేసులు 

నమోదు చేయకూడదన్న సుప్రీంకోర్టు తీర్పుకు విఘాతం

 41ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోకుండానే ఎత్తుకెళ్తున్న పోలీసులు

ఆది, సోమవారాల్లోనే ఏకంగా 86 కేసులు నమోదు

ఇదీ చంద్రబాబు మార్కు పోలీసు రాజ్యమని చాటుకుంటున్న సర్కారు

సాక్షి, అమరావతి / సాక్షి, నెట్‌వర్క్‌:  చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసుల ద్వారా గూండాగిరీకి బరి తెగించింది. ఫలితంగా ఖాకీ క్రౌర్యం కట్టలు తెంచుకుంటోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్య పరుస్తున్న వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తోంది. విచారణ పేరుతో వేధిస్తోంది. పౌర హక్కులను కాలరాస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. సుప్రీంకోర్టు తీర్పును నిర్భీ­తిగా ఉల్లంఘిస్తూ పోలీసు రాజ్యంతో బెంబేలెత్తిస్తోంది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి­నప్పటి నుంచి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసు వ్యవస్థ స్వచ్ఛందంగా సుప్తచేతనావస్థలోకి వెళ్లిపో­యింది. వెరసి టీడీపీ గూండాలు హత్యలు, హత్యా­య­త్నాలు, అత్యాచా­రాలు, దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోతున్నారు. టీడీపీ రౌడీ మూకలు కత్తులు, కర్రలు, బాంబులతో విచ్చలవిడిగా దాడులకు తెగబ­డుతున్నారు. 80కి పైగా హత్యలు.. 300కు పైగా హత్యా­యత్నాలు.. దాదాపు రెండు వేలకు పైగా దాడులు, విధ్వంసాలతో అల్లకల్లోలం సృష్టించారు. 

ప్రతిపక్ష వైఎస్సార్‌­సీపీ నేతలు, కార్యకర్తలపై యథే­చ్చగా దాడులకు పాల్పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఈ దారుణాలను ప్రశ్నిస్తున్న సోషల్‌ మీడియా కార్యకర్తలపై చంద్రబాబు సరికొత్త కుట్రకు తెరతీశారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తూ, దాడులకు తెగబడే బాధ్యతను పోలీసులకు అప్పగించినట్టున్నారు. అంటే టీడీపీ గూండాగిరీకి పోలీసు ముసుగుతో రాజముద్ర వేయాలన్న పన్నా­గం పన్నారు. వెరసి తప్పుడు కేసులతో సోషల్‌ మీడి­యా కార్యకర్తలను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు.

అక్రమ కేసులు, విచారణ పేరుతో దాడులు
చంద్రబాబు మనసెరిగి మసలుకునే పోలీసులు ఖాకీ చొక్కాలు విప్పేసి పచ్చ చొక్కాలు తొడుక్కుంటున్నట్టుంది రాష్ట్రంలో ప్రస్తుత భీతావాహ పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులకు తెరతీశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు ఆది, సోమవారాల్లోనే ఏకంగా 86 కేసులు నమోదు చేయడం గమనార్హం. అంటే ఈ అక్రమ అరెస్టుల వెనుక ఎంతటి పక్కా కుట్ర ఉందన్నది స్పష్టమవుతోంది. కేవలం వైఎస్సార్‌సీపీ శ్రేణులను బెంబేలెత్తించడం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసు అస్త్రాన్ని చంద్రబాబు ప్రయోగించారు.

సోషల్‌ మీడియా పోస్టులపై నేరుగా కేసులు నమోదు చేయకూడదని, 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. కానీ ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. ఆ తీర్పు స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ అక్రమ కేసులతో పోలీసులు చెలరేగిపోతున్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే వారిని బలవంతంగా తీసుకుపోతున్నారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న వారిని తీసుకుపోతున్నారు. వ్యాపార కార్యకలాపాల్లో ఉన్న వారిని, పొలం పనులు చేసుకుంటున్న వారిని, ప్రయాణంలో ఉన్న వారిపై విరుచుకుపడి బలవంతంగా వాహనాల్లో పడేసి పట్టుకుపోతున్నారు.

కుటుంబ సభ్యులకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. కార్యకర్తల కళ్లకు గంతలు కట్టి వివిధ పోలీస్‌ స్టేషన్లు తిప్పుతున్నారు. విచారణ పేరుతో భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ న్యాయవాదులు వచ్చి గట్టిగా ప్రశ్నిస్తే తప్ప విడిచి పెట్టడం లేదు. మళ్లీ పోలీస్‌ స్టేషన్‌కు రావాలని చెబుతున్నారు. తాము కొట్టిన విషయాన్ని ఎవరికైనా చెబితే మరోసారి తమ లాఠీలకు పని చెబుతామని బెదిరిస్తున్నారు. ఖాకీలు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తూ పాశవికంగా దాడులకు పాల్పడుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. 

‘ఫేక్‌ అకౌంట్ల’తో ప్రభుత్వ కుట్ర 
వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే ప్రశ్నిస్తున్నారు. అదీ వారి అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల ద్వారానే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అది వారి భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకు వస్తుంది. ఆ పోస్టులపై కేసులు నమోదు చేయడం సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వం కొత్త కుట్రకు తెరతీసింది. కొన్ని సోషల్‌ మీడియా ఖాతాల నుంచి కించపరిచే పోస్టులు పెట్టారంటూ అక్రమ కేసులు నమోదు చేస్తోంది.

ప్రధానంగా ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాల్లో పెట్టిన పోస్టులను తమ కేసులకు ప్రాతిపదికగా పోలీసులు చెబుతున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే.. ఆ ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలు ఎవరివో కూడా తెలీదు. అవి ఫేక్‌ ఖాతాలు. వాటిని వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు ఆపాదిస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తుండటం ప్రభుత్వ కుట్రకు నిదర్శనం. ఆ ఫేక్‌ ఖాతాల వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందని తెలుస్తోంది. టీడీపీ సోషల్‌ మీడియా వర్గాలే ఆ ఫేక్‌ ఖాతాలతో కించపరిచే పోస్టులు పెట్టి.. వాటి ఆధారంగా వైఎస్సార్‌సీసీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టేందుకు యత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అందుకే ఆ కించపరిచే పోస్టులు పెట్టిన ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలు ఎవరివో పోలీసులు చెప్పడం లేదు. అవి వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తల ఖాతాలు అని ఆధారాలు కూడా చూపించలేకపోతున్నారు. 

పోలీసు క్రౌర్యంలో ఎన్టీఆర్‌ జిల్లా టాప్‌
రాజ్యాంగ హక్కులను కాల రాయడంలో ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులు మరింతగా బరి తెగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై 86 అక్రమ కేసులు నమోదైతే.. వాటిలో ఏకంగా 61 కేసులు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషరేట్‌ పరిధిలోనే నమోదు చేయడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పు తమకు వర్తించదనో.. లేక తాము దానిని ఖాతరు చేయమన్నట్టుగా విజయవాడ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు వ్యవహరిస్తున్నారనిపి­స్తోంది.

ఎంత ఎక్కువుగా అక్రమ కేసులు పెడితే.. అంతగా గుర్తింపు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పా­రేమో అన్నట్టుగా పోలీసుల తీరు ఉందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ సైబర్‌ పోలీసుల సహకారంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు తమ మార్కు గూండాగిరీ ప్రదర్శిస్తున్నారు. కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే సోషల్‌ మీడియా కార్యకర్తలను ఎత్తుకువచ్చేసి తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు.

మాజీ మంత్రి కాకాణిపై రెండు అక్రమ కేసులు 
పోలీసు వేధింపులు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డినీ తాకాయి. ఏదో వాట్సాప్‌ పోస్టును ఆయన ఫార్వర్డ్‌ చేశారనే నెపంతో టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే.. ఆయనపై నెల్లూరు పోలీసులు రెండు అక్రమ కేసులు నమోదు చేయడం గమనార్హం. ఆయన ఎలాంటి పోస్టు పెట్టలేదు. ఎవర్నీ కించపరుస్తూ ఎలాంటి పోస్ట్‌నూ ఫార్వర్డ్‌ చేయలేదు. కానీ టీడీపీ నేతలు చెప్పారనే ఒకే ఒక్క కారణంతో తప్పుడు కేసు నమోదు చేయడం విభ్రాంతికరం.

అన్ని ప్రాంతాల్లోనూ అవే అక్రమ కేసులు
గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా అధ్యక్షుడు మేకా వెంకటరామిరెడ్డిని తాడేపల్లి పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. ఆయన మార్చిలో ఏదో పోస్టు పెట్టారంటూ టీడీపీ కార్యకర్తలు ఏడు నెలల తర్వాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు సీఐ కళ్యాణ్‌ రాజు చెప్పడం గమనార్హం. 

తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండల గ్రామం వల్లభాపురానికి చెందిన రైతు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త ఆళ్ల జగదీష్‌రెడ్డిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు గ్రామంలోని జగదీష్‌రెడ్డి ఇంటికి వచ్చిన ముగ్గురు అగంతకులు, అతడిని తీసుకెళ్లటం, ఏ సమాచారం లేకపోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేయటం తెలిసిందే. విజయవాడకు చెందిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జగదీష్‌రెడ్డిని వెంటబెట్టుకు వెళ్లి, సైబర్‌ క్రైమ్‌ విజయవాడ సిటీ పోలీసులకు అప్పగించారు.

2018లో ఆయన పెట్టిన పోస్టుపై ఫిర్యాదు వచ్చిందని చెప్పడం గమనార్హం. ఆయన్ని విచారించిన తర్వాత రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పంపించివేశారు. విచారణకు మరోసారి రావాలన్న పోలీసుల ఆదేశాల ప్రకారం సోమవారం ఉదయాన్నే మళ్లీ జగదీష్‌రెడ్డి విజయవాడ వెళ్లారు. అక్కడే విచారణ చేస్తుండగా, న్యాయవాదులు, విలేకరులు రావటంతో  మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో విడుదల చేశారు. సోషల్‌ మీడియాలో జగదీష్‌రెడ్డి పెట్టిన పోస్టు, దానిని షేర్‌ చేయటంపై మొత్తం 16 మందిపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. వీరిలో కొందరిని అరెస్ట్‌ చేయగా, ఇంకొందరిని అరెస్టు చేయాల్సి ఉందని చెబుతున్నారు.

 వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కల్లం హరికృష్ణారెడ్డిపై తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా కేసు నమోదు

 ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా వింజమూరు మండల కన్వీనర్‌ పెసల శివారెడ్డిని అరెస్ట్‌ చేశారు.

నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌ తిరుమల కృష్ణ ఆలియాస్‌ జగన్‌ కృష్ణను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారు. ఆదివారం రాత్రి కర్నూలు సీసీఎస్‌ పోలీసులు మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డితో కలసి గ్రామానికి చేరుకుని తిరుమల కృష్ణ ఇంటికి వెళ్లారు. కుటుంబీకులు ఇంట్లో ఉన్నా ఏమి చెప్పకుండా ఇల్లంతా తనిఖీ చేశారు. పశువుల పాక వద్ద బర్రెలకు మేపు వేస్తున్న తిరుమల కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

షార్ట్, టీషర్ట్‌పై ఉన్న అతను చొక్కా, ప్యాంట్‌ వేసుకుని వస్తానని బతిమలాడితే చివరికి ఒప్పుకున్నారు. మహానంది స్టేషన్‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి కర్నూలు సీసీఎస్‌ పోలీసులకు అప్పగించారు. తమ కుమారుడు ఎక్కడున్నాడో చెప్పండయ్యా అయ్యా అని కృష్ణ కుటుంబీకులు రాత్రి మహానంది స్టేషన్‌కు వచ్చి పోలీసులను బతిమాలినా చెప్పలేదు. కర్నూలుకు చెందిన ఇంతియాజ్‌ బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు కర్నూలు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. క్రైమ్‌ నెంబర్‌ 148/2024, 352, 353(1),(సీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పల్నాడు జిల్లా కంభంపాడు గ్రామానికి చెందిన సోషల్‌ మీడియా కార్యకర్త నెమలిదిన్నె రంగారెడ్డిపై మాచర్ల రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని అతనిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు.

గురజాల మండల సోషల్‌ మీడియా కన్వీనర్‌ వెంకటరామిరెడ్డిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మండల పరిధిలోని తేలుకుట్ల గ్రామానికి చెందిన పప్పుల వెంకటరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న వెంకటరామిరెడ్డిని సోమవారం అరెస్టు చేసి గురజాల పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని కుమారుడు మంత్రి లోకేశ్‌పై సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టాడని బత్తల శ్రీనివాసులు, మరొకరిపై చిన్నచౌక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ప్రతిపక్షంలో వున్నపుడు కూడా ఇలాగే పోస్టింగ్‌లు పెట్టా­రని కడపకు చెందిన టీడీపీ నేత బొజ్జా తిరుమలేష్‌ ఫిర్యాదు మేర­కు ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరుకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్త వీరాబత్తుల చంద్రశేఖర్‌ను అనపర్తి పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. సోమవారం విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి సీఐ సుమంత్‌ను కలిసి ప్రశ్నించారు. అనంతరం పోలీసులు సెక్షన్‌–41 నోటీసు జారీ చేసి చంద్రశేఖర్‌ను వదిలి పెట్టారు. రంగంపేట మండలం కోటపాడు గ్రామానికి చెందిన శిరిగిన వెంకటేష్‌ను పోలీసులు నిర్బంధించగా, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు అతడిని బయటకు తీసుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement