
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో అతిసార (డయేరియా) మరణాలపై వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరికలతో చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చింది. అతిసార కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అతిసార మరణాలు సంభవించిన విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించనున్నారు.
గత వారం రోజులుగా విజయనగరం జిల్లా గుర్లలో అతిసార ప్రబులుతుందని, కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయని సాక్షి మీడియా పలు కథనాల్ని వెలుగులోకి తెచ్చింది. ఎప్పటికప్పుడు అతిసార వ్యాధి తీవ్రతను గుర్తిస్తూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.
చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం
అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. వారం రోజులుగా మరణాలు లేవంటూ జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు బుకాయించారు. అయితే ఈ ఘటనపై వైఎస్ జగన్.. చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, ఇందుకు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు.
ఈ ఘటనలో 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా ఏపీ ప్రభుత్వం నిద్ర వీడడంలేదని మండిపడ్డారు. సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నాయని, అయినా సరే స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణమని అన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
ఈ తరుణంలో వైఎస్ జగన్ హెచ్చరికలతో చంద్రబాబు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అతిసార కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
బాధితులకు వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
గుర్లలో అతిసారాతో మరణాలు సంభవించడం, భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో వైఎస్సార్‌సీపీ నేతలు బాధితులకు బాసటగా నిలిచారు. గుర్లలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావులు పర్యటించి బాధితుల్ని పరామర్శించారు. వ్యాధి గ్రస్తులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని సూచించారు.
ఆదివారం గుర్లలో పర్యటించిన అనంతరం ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అతిసారాతో విజయనగరం జిల్లాలో 16 మంది మృతి చెందారన్నారు. ఇవి సహజ మరణాలు కాదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ఇంత మంది చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.