విద్యుత్ రంగం ధారాదత్తానికి చంద్రబాబు సర్కారు పన్నాగం
రాజధానిలో విద్యుత్ సరఫరా, పంపిణీ, బిల్లింగ్ వ్యవస్థ ప్రైవేటీకరణకు సీఆర్‌డీఏ టెండర్ నోటిఫికేషన్
బిడ్‌ల దాఖలుకు తుది గడువు అక్టోబర్ 12
ముందే ఎంపిక చేసిన సంస్థకు బాధ్యతలు అప్పగించేందుకు ముఖ్యనేత రంగం సిద్ధం
రాజధానిని ప్రయోగశాలగా మార్చి చంద్రబాబు ప్రభుత్వం ఆటలు
దశలవారీగా విద్యుత్ పంపిణీ వ్యవస్థల ప్రైవేటీకరణకు అడుగులు
సర్కారు నిర్ణయంపై జెన్‌కో, ట్రాన్స్‌కో,పంపిణీ సంస్థల ఉద్యోగులు, కార్మికుల ఆగ్రహం
విద్యుత్ చార్జీలు, కనెక్షన్ ఫీజులు భారీగా పెరుగుతాయని సర్వత్రా ఆందోళన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్ రంగం ప్రైవేటుపరానికి చంద్రబాబు సర్కారు పన్నాగం పన్నుతోంది. దీనిలో భాగంగా రాజధాని అమరావతిలో విద్యుత్ సరఫరా, పంపిణీ, బిల్లింగ్ వ్యవస్థను ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు సీఆర్‌డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రీన్‌ఫీల్డ్ నగరాల్లో భూగర్భ విద్యుత్ వ్యవస్థ(అండర్ గ్రౌండ్ కేబుల్) ఏర్పాటు, స్మార్ట్ గ్రిడ్ నిర్వహణ నుంచి వినియోగదారులకు బిల్లులు జారీ చేయడం వరకూ అనుభవం ఉన్న అంతర్జాతీయ, దేశీయ సంస్థలు, జాయింట్ వెంచర్లుగా ఏర్పడిన సంస్థలు బిడ్‌లు దాఖలు చేసుకోవచ్చునని పేర్కొంది.
2022–23 నుంచి 2024–25 వరకు మూడేళ్లలో సగటున రూ.వెయ్యి కోట్ల చొప్పున లావాదేవీలు నిర్వహించి ఉండి.. రూ.200 కోట్ల మేర నగదు నిల్వలు కలిగిన ఉన్న సంస్థలకు మాత్రమే బిడ్‌లు దాఖలుకు అర్హత ఉంటుందని షరతు విధించింది. బిడ్ దాఖలుచేసే సంస్థలను గత రెండేళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వంగానీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టి ఉండకూడదని స్పష్టం చేసింది. ముందే ఎంపిక చేసిన సంస్థకే రాజధానిలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను కట్టబెట్టడానికి ముఖ్యనేత రంగం సిద్ధం చేశారన్న వాదన విద్యుత్‌రంగ నిపుణుల నుంచి వినిపిస్తోంది.
రాజధానిని ప్రయోగశాలగా మార్చి..
ఉమ్మడి రాష్ట్రంలో 1995 నుంచి 2004 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు.. అప్పట్లో నిజాం షుగర్స్, ఆల్విన్ వంటి 54 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం ముసుగులో అస్మదీయులకు ధారాదత్తం చేశారు. అప్పట్లోనే విద్యుత్ రంగాన్ని పైవేటీకరించేందుకు అడుగులు వేశారని.. తీవ్రమైన ప్రజావ్యతిరేకత వ్యక్తమవడంతో వెనక్కి తగ్గారని విద్యుత్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు జెన్‌కో, ట్రాన్స్‌కో, పంపిణీ సంస్థలు(ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్)లతో కూడిన విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడానికి సీఎం చంద్రబాబు రాజధానిని ప్రయోగశాలగా మార్చి ఆటలాడుతున్నారని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సుస్థిర, నిరంతర విద్యుత్ సరఫరా ముసుగులో..
స్వర్ణాంధ్ర–2047 విజన్‌లో భాగంగా రాజధాని అమరావతి నగరాన్ని నాలెడ్జ్, ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని చంద్రబాబు సర్కార్ చెబుతోంది. రాజధాని ప్రాంతంలో 2047 నాటికి జనాభా 1.40 కోట్లకు చేరుతుందని.. రాజధాని నగరం అమరావతిలోనే 20 లక్షల మంది నివసిస్తారని.. 12.80 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది. అమరావతి 2047 నాటికి ఏకంగా 22 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.8 లక్షల కోట్లు) ఆరి్థక వ్యవస్థగా ఎదుగుతుందని చెబుతోంది.
నివాస, వాణిజ్య, ఐటీ, ఆస్పత్రులు, విద్యా సంస్థలు భారీ ఎత్తున వస్తాయని.. వాటికి అనుగుణంగా సుస్థిరమైన, అంతరాయం లేని స్మార్ట్ విద్యుత్ సేవలను అందించడం అత్యంత ఆవశ్యకమని పేర్కొంటోంది. ఈ ముసుగులోనే విద్యుత్ వ్యవస్థ ప్రైవేటీకరణకు అడుగులు వేసింది. ఈ మేరకు సీఆర్డీఏతో నోటిఫికేషన్ జారీచేయించింది. అక్టోబర్ 12 వరకూ ఆసక్తిగల సంస్థలు బిడ్‌లు దాఖలు చేసుకోవచ్చని సీఆర్డీఏ పేర్కొంది. అక్టోబర్ 13న బిడ్‌ను తెరిచి.. ఎల్–1గా నిలిచిన సంస్థకు రాజధాని విద్యుత్ రంగం పనులను కట్టబెట్టేందుకు సీఆర్డీఏ షెడ్యూలు విడుదల చేసింది.
రూ.వేల కోట్లతో బలోపేతం చేసిన వ్యవస్థ నామమాత్రపు ధరకే..
వేలాది కోట్ల రూపాయలను అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చి రాజధానిలో అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను సీఆర్‌డీఏ ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు వాటిని పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో ప్రైవేటు సంస్థకు నామమాత్రపు ధరకే కట్టబెట్టనుంది. రాజధాని ప్రాంతం ప్రస్తుతం ఏపీసీపీడీసీఎల్(ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డి్రస్టిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్) పరిధిలో ఉంది.
ఇప్పుడు రాజధాని ప్రాంతంలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థ నిర్వహణ దగ్గర నుంచి వినియోగదారులకు బిల్లులు జారీ చేయడం, వసూలు చేసే బాధ్యత వరకూ ప్రైవేటు సంస్థకు అప్పగించనుంది. ఆ తర్వాత వేలాది కోట్ల రూపాయల వ్యయంతో బలోపేతం చేసిన ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్), ఏపీఎస్పీడీసీఎల్(ఆంధ్రప్రదేశ్ సౌత్ పవర్ డి్రస్టిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్) పరిధిలో నిర్మించిన విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థలను దశలవారీగా నామమాత్రపు ధరకే ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు సర్కార్ అడుగులు వేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలపై బాదుడే బాదుడు..
కారి్మకులకు ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకం విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థలను ప్రైవేటుపరం చేస్తే.. వాటిలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు.. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమవుతుందని విద్యుత్ ఉద్యోగ, కారి్మక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక వినియోగదారులకు సరఫరా చేసే విద్యుత్ చార్జీలను ప్రైవేటు సంస్థలు ఇష్టారాజ్యంగా పెంచేయడానికి ఆస్కారం ఉంటుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. కొత్తగా కనెక్షన్ మంజూరు చేయడానికి.. రీకనెక్షన్ ఇవ్వాలన్నా భారీ ఎత్తున ఫీజులు వసూలు చేస్తాయనే వాదన వినిపిస్తోంది.
రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలన్నీంటినీ ఒకేసారి ప్రైవేటుపరం చేస్తే అటు ఉద్యోగులు.. ఇటు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావించే తొలుత రాజధానిలో విద్యుత్ వ్యవస్థ ప్రైవేటీకరణకు చంద్రబాబు సర్కార్ తొలి అడుగు వేసిందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. రాజధానిలో విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను విజయవంతంగా ఎంపిక చేసిన సంస్థకు కట్టబెట్టాక.. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన విద్యుత్ వ్యవస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి చర్యలు తీసుకునే దిశగా ఇప్పటికే సర్కార్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిందని అధికారవర్గాలు చెబుతున్నాయి.


