కొండపై బౌద్ధ స్తూపాలు
పిఠాపురం నియోజకవర్గంలోని తురుక్కుల కొండపై కూటమి మట్టి మాఫియా కన్ను
కొండ చుట్టూ యంత్రాలతో రాత్రి పగలు తవ్వకాలు
బౌద్ధ స్తూపాలు కిందకు కుంగే ప్రమాదం
బౌద్ధ మత చారిత్రక వైభవానికీ తూట్లు స్పందించని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా కొడవలి బౌద్ధ క్షేత్రంపై చారిత్రక వైభవం కలిగిన కొండలను కూటమి నేతృత్వంలోని మట్టి మాఫియా భారీ యంత్రాలతో కొల్లగొడుతోంది. కొండ ఆనవాళ్లు కోల్పోయేలా రాత్రి, పగలు తవ్వి తరలిస్తున్నారు. వేలాది లారీల్లో మట్టి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రకృతి సంపదతో పాటు స్థానికుల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన ఈ కొండ ప్రసుత్తం యంత్రాల కింద నలిగిపోతోంది.
చారిత్రక నేపథ్యం ఇదీ..
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో సర్వే నంబర్ 133/1లో ఉన్న కొడవలి బౌద్ధ క్షేత్రం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటి అత్యంత ప్రాచీన చారిత్రక ప్రదేశాల్లో ఒకటి. దీనిని భారత పురావస్తు శాఖ రక్షిత ప్రాంతంగా పరిరక్షిస్తోంది. బౌద్ధ స్తూపం నిరి్మత కట్టడమైన ధనకొండ, దానికి ఆనుకుని ఉన్న తురుక్కుల కొండలు నేమాలదిబ్బగా పేరు గాంచాయి. వీటిని వేర్వేరు పేర్లతో పిలుస్తున్నా.. ఆ సముదాయమంతా ప్రాచీన చారిత్రక కొడవలి బౌద్ధ క్షేత్రంలో అంతర్భాగమే. సర్వే నంబర్ 133/1లో సుమారు 372 ఎకరాల్లో చారిత్రక బౌద్ధ క్షేత్ర కట్టడాలు విస్తరించి ఉన్నట్లు కొడవలి బౌద్ధ మహాస్తూప పరిరక్షణ సమితి వెల్లడిస్తోంది.
కొండ చుట్టూ తవ్వకాలు
విశేష ప్రాధాన్యత కలిగిన తురుక్కుల కొండపై కూటమి మట్టి మాఫియా కన్ను పడింది. కొండ చుట్టూ తవ్వకాలు చేపడుతోంది. రోజూ వందల లారీలు, టిప్పర్లలో మట్టి అక్రమంగా తరలించి, సొమ్ము చేసుకుంటున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారు. ఈ అక్రమ తంతు కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతుండటంతో అడ్డుకునేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఇదే అదనుగా భావించిన కూటమి నేతలు కొండ వెనుక భాగంలో సుమారు వంద అడుగుల మేర తవ్వకాలు జరిపారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. కొండ చుట్టూ తవ్వేసి మట్టి తరలిస్తే.. కొండపైన ఉన్న బౌద్ధ స్తూపాలు కిందకు కుంగిపోయే ప్రమాదం ఉంది. కూటమి నేతల చర్యలతో బౌద్ధ మత చారిత్రక వైభవం సైతం మట్టిలో కలిసిపోయే ప్రమాదం ఉంది.
ఏఎస్‌ఐ నిబంధనలకు తూట్లు
ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) నిబంధనల మేరకు బౌద్ధ క్షేత్రం పరిసర ప్రాంతాల్లో 300 మీటర్ల వరకు ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదు. ఈ నిబంధనలకు కూటమి నేతలు తూట్లు పొడుస్తున్నారు. 300 మీటర్ల పరిధిలోనే తవ్వకాలు చేపట్టినట్లు సమాచారం.
వైఎస్సార్ సీపీ నేతల ప్రమేయంతో ఆగిన వైనం
గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామ సర్వే నంబర్ 133లో సామర్లకోటకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి మైనింగ్ అనుమతుల కోసం దరఖాస్తు చేయగా.. అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ విషయమై కాకినాడ వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో అనుమతులను తాత్కాలికంగా వాయిదా వేశారు.
పవన్ ఇలాకాలో జరుగుతున్నా..
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో చారిత్రక ఆధారాలను ధ్వంసం చేసే ప్రక్రియకు నాంది పలుకుతున్నా ఎందుకు ప్రశి్నంచడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను స్థానికులు ప్రశి్నస్తున్నారు. బౌద్ధ ప్రదేశాల్లో మైనింగ్ జరుగుతుంటే, ఎందుకు మిన్నకుండిపోయారన్న ఆరోపణలు లేకపోలేదు.


