పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్ 1, 2 ప్రాంతాల్లో నాణ్యతా ప్రమాణాలు, పనుల వేగాన్ని పరిశీలిస్తున్న పీపీఏ సీఈవో సంజీవ్ వోహ్రా, సీఎస్‌ఎంఆర్‌ఎస్ బృందం, అధికారులు
పోలవరం రూరల్: పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణ పనులను ‘పోలవరం ప్రాజెక్టు అథారిటీ’ (పీపీఏ) బృందం బుధవారం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించింది. పీపీఏ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సంజీవ్ వోహ్రా నేతృత్వంలో విచ్చేసిన ఉన్నతాధికారుల బృందం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతమైన ఈసీఆర్‌ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2లలో జరుగుతున్న పలు పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేసింది.
నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పనులను పూర్తి చేసేందుకు మరింత వేగం పెంచాలని సూచించింది. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురామ్, జలవనరుల శాఖ ఇంజినీర్–ఇన్–చీఫ్ (ఈఎన్‌సీ) కె. నరసింహమూర్తి, ఎస్‌ఈ పి.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జలవనరుల శాఖ ఈఈలు కె.బాలకృష్ణ, బి.దామోదర్, డి.శ్రీనివాస్, ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ఎ.గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి తదితరులు ప్రాజెక్టులో జరుగుతున్న పనులు, వివిధ నిర్మాణ దశలు, భవిష్యత్ కార్యాచరణను బృందానికి వివరించారు.
సీఎస్‌ఎంఆర్‌ఎస్ బృందం తనిఖీలు
పీపీఏ బృందంతో పాటు సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్‌ఎంఆర్‌ఎస్) నిపుణుల బృందం కూడా ప్రాజెక్టు ప్రాంతంలో ప్రత్యేకంగా పర్యటించింది. నిపుణులు హరేంద్ర ప్రకాశ్, దీపముద్ర నాయక్, శాస్త్రవేత్త గౌరవ్ పాండే తదితరులు గ్యాప్ 1, 2 లలో ఉపయోగిస్తున్న మట్టి, రాయి నాణ్యతా ప్రమాణాలు, తేమ శాతాన్ని ఆయా క్షేత్రాలలో స్వయంగా పరీక్షించారు. ఈ తనిఖీల్లో జలవనరుల శాఖ నాణ్యత నియంత్రణ విభాగం డీఈలు శివప్రసాద్, మల్లికార్జున, ఎంఈఐఎల్ క్వాలిటీ కంట్రోల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.


