రాజకీయ లబ్ధి కోసం బాబు కుట్ర

Chandrababu conspiracy for political gain - Sakshi

ఎన్‌ఆర్‌ఐ ఫండ్‌తో ఏసీల ఉద్యమం 

బహుజన పరిరక్షణ సమితి మండిపాటు

తాడికొండ: రాజధాని ముసుగులో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందేందుకు  చంద్రబాబు అండ్‌కో, టీడీపీ నాయకులు యత్నిస్తున్నారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. బహుజనులు కనీసం ఫ్యాను కూడా లేకుండా నిరసనలు తెలుపుతుంటే.. మరోవైపు అమరావతి రైతుల పేరిట బినామీల కనుసన్నల్లో ఎన్‌ఆర్‌ఐల ఫండ్‌తో ఏసీలతో ఉద్యమం సాగుతోందన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 154వ రోజు బుధవారం కొనసాగిన రిలే నిరాహార దీక్షల్లో పలువురు నాయకులు ప్రసంగించారు.

పంచాయతీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిన తరువాత ప్రజలు తమను తిప్పికొట్టారని గ్రహించిన చంద్రబాబు ఇప్పుడు ఎత్తుగడలు మార్చి అమరావతిలో ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో అభివృద్ధి చేస్తే అడ్డుకుంటామని దుర్మార్గపు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే రాష్ట్రంలో ఉన్న 3.50 కోట్ల మంది బహుజనులు బాబు అంతు చూస్తారని హెచ్చరించారు.

అమరావతి బినామీ ఉద్యమం పేరిట ఇప్పటి వరకు  చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, సీపీఐ రామకృష్ణ, సినిమాల్లేని శివాజీ  తదితర కృష్ణులొచ్చి పారిపోయారని, ఇప్పుడు 11వ కృష్ణుడుగా వడ్డే శోభనాద్రీశ్వరరావు వచ్చారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులు, ఇంగ్లిష్‌ మీడియం విద్య, రాజధానిలో 54 వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ సాధించి తీరతామన్నారు. నాయకులు నత్తా యోనారాజు, మాదిగాని గురునాథం, బేతపూడి సాంబయ్య, ఈపూరి ఆదాం, మల్లవరపు సుధారాణి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top