
రేటు కుదిరితే ఒకలా.. లేదంటే మరోలా
సెక్యూరిటీ టెండర్లలో నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్ బిడ్ వేసిన సంస్థకు అందలం
అదే మాదిరిగా శానిటేషన్ టెండర్ల బిడ్ వేసిన సంస్థపై మాత్రం వేటు
పక్క రాష్ట్రంలో టెర్మినేట్ అయిన సంస్థకు కోస్తాంధ్ర శానిటేషన్ బాధ్యతలు
వేగంగా అస్మదీయ సంస్థలకు ఎల్‌వోఏ జారీకి సన్నద్ధం
సాక్షి, అమరావతి: టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు బదులుగా కమీషన్లకే పెద్దపీట వేస్తున్నారనేందుకు ఇదో తాజా ఉదాహరణ! ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్, సెక్యూరిటీ టెండర్ల ప్రక్రియ పెద్ద ప్రహసనంలా మారింది. వైద్య శాఖ పరిధిలోని ఈ పనులన్నీ గంపగుత్తగా తమతో డీల్ కుదుర్చుకున్న సంస్థలకే కట్టబెట్టడం కోసం అక్రమాలకు తెర తీశారు. డీఎంఈ, డీఎస్‌హెచ్ ఆస్పత్రుల్లో శానిటేషన్ నిర్వహణకు ఏపీఎంఎస్‌ఐడీసీ టెండర్లు పిలిచింది.
ఈ క్రమంలో ఓ సంస్థ టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసిందని పేర్కొంటూ ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. ఇదిలా ఉండగా కొద్ది నెలల కిందట నిర్వహించిన సెక్యూరిటీ టెండర్లలో మాత్రం ఇదే తప్పిదానికి పాల్పడ్డ అస్మదీయ సంస్థ బిడ్‌ను మాత్రం ఆమోదించి కాంట్రాక్ట్ కూడా కట్టబెట్టేయడం గమనార్హం. ఒకే తరహా టెండర్లకు సంబంధించి అప్పు డొకలా ఇప్పుడొకలా ‘చంద్రముఖి’ మాదిరిగా వ్యవ హరించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కప్పిపుచ్చుకునేందుకు బుకాయింపు..
గతంలో సెక్యూరిటీ టెండర్లు పిలిచిన సమయంలో ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, ఇతర చార్జీలు కలిపి కార్మీకులకు రూ.18,600, సూపర్‌వైజర్‌కు రూ.21,506, సెక్యూరిటీ ఆఫీసర్‌కు రూ.40 వేలు.. ఇలా ఎవరెవరికి ఎంత వేతనం ఇవ్వాలో స్పష్టమైన నిబంధన పెట్టారు. ఏ ఆస్పత్రిలో ఎంత మందిని సిబ్బందిని నియమించాలో నిర్దేశించారు. ఈ మేరకు టెండర్లలో పాల్గొనే సంస్థలు లెక్కలు వేసుకుని ఫైనాన్షియల్ బిడ్‌లు దాఖలు చేయాలని, నిర్దేశించిన వేతనాల్లో తగ్గిస్తే సదరు బిడ్‌లను తిరస్కరిస్తామని నిబంధన విధించారు.

టెండర్ నిబంధనల్లో పేర్కొన్న దాని కంటే కార్మికులు, ఇతర సిబ్బంది వేతనాలు తక్కువకు కోట్ చేస్తే బిడ్ తిరస్కరణకు గురవుతుందని సెక్యూరిటీ టెండర్‌లలో పేర్కొన్న ప్రభుత్వం (రెడ్ కలర్‌లో)
అయితే ప్రభుత్వ పెద్దలతో డీల్ కుదుర్చుకున్న ఓ కాంట్రాక్టు సంస్థ సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌కు నిర్దేశించిన మేరకంటే తక్కువ వేతనాలు చెల్లించేలా ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం అయితే సదరు సంస్థ బిడ్‌ను తిరస్కరించి అనర్హత వేటు వేయాలి. కానీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సదరు సంస్థను తక్కువ రేట్ కోట్ చేసిన సంస్థగా పరిగణించి జోన్–1 కాంట్రాక్ట్ బాధ్యతలను కట్టబెట్టారు. తాజాగా శానిటేషన్ టెండర్లలో తప్పు చేసిన సంస్థపై వేటు వేసినట్లే గతంలో ఎందుకు వ్యవహరించలేదన్న విమర్శలు బలంగా వ్యక్తమవుతుండటంతో దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
ఫైనాన్షియల్ బిడ్‌లో నిబంధనలు అతిక్రమిస్తే తిరస్కరిస్తామని సెక్యూరిటీ టెండర్‌లలో పేర్కొనలేదని, శానిటేషన్ టెండర్లలో మాత్రం కొత్తగా చేర్చామని బుకాయిస్తోంది. అయితే వాస్తవాలను పరిశీలిస్తే.. కార్మికులు, సూపర్‌వైజరీ సిబ్బంది నెలవారీ వేతనాల్లో నిర్దేశించిన మొత్తం కంటే తక్కువ చెల్లించేలా బిడ్ వేస్తే తిరస్కరిస్తామని సెక్యూరిటీ టెండర్లలో స్పష్టంగా పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు దాఖలు చేసే ఫైనాన్షియల్ బిడ్‌లో ఇన్‌స్టిట్యూట్ వైజ్ ప్రైజ్ బిడ్‌లోని ప్రతి పేజీలో ఆ అంశాన్ని పొందుపరిచారు.
ఆగమేఘాలపై ఎల్‌వోఏ..!
ప్రభుత్వ పెద్దలతో డీల్ కుదుర్చుకున్న సంస్థలకు అడ్డదారుల్లో కాంట్రాక్టులు ఆగమేఘాలపై దక్కుతున్నాయి. పక్క రాష్ట్రంలో జూన్‌లో టెర్మీనేట్ అయిన సంస్థకు కోస్తాంధ్ర శానిటేషన్ కాంట్రాక్టు పనులు కట్టబెడుతున్నారు. అనర్హత వేటుకు గురైన పలు సంస్థలు కోర్టులను ఆశ్రయించడంతో వేగంగా అస్మదీయ సంస్థలకు ఎల్‌వోఏ ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో వైద్య శాఖ అధికారులతో కూడిన బిడ్ ఫైనలైజేషన్ కమిటీ (బీఎఫ్‌సీ) సోమవారం సమావేశమై ఆరు జోన్లవారీగా కాంట్రాక్టర్లను ఖరారు చేసింది.