అనిశ్చితిలో అభ్యర్థులు
నోటిఫికేషన్ జారీలో తాత్సారం
చివరిసారిగా గతేడాది ఏప్రిల్‌లో నిర్వహణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు, పీహెచ్‌డీ ప్రవేశాలకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (ఏపీసెట్) నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. చివరిసారిగా గత ప్రభుత్వం 2024 ఏప్రిల్‌లో ఏపీసెట్‌ను నిర్వహించింది. మళ్లీ తిరిగి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏపీ సెట్‌ను నిర్వహించాల్సి ఉంది. అయితే కొత్త నోటిఫికేషన్‌పై కూటమి సర్కార్ ఇప్పటివరకు నోరుమెదపట్లేదు.
ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాలకు సంబంధించి 2025–26 విద్యా సంవత్సరంలో మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర జాప్యం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన కూటమి ప్రభుత్వం ఏపీసెట్ నిర్వహణ విషయంలోనూ ఇదేతీరును అవలంబిస్తుండటంపై విద్యార్థులు, విద్యావేత్తల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్‌ను తాత్సారం చేయడంతో అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు.
ఎవరు అర్హులు..
ఏపీ సెట్‌కు పీజీ, తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు, పీజీ చివరి ఏడాది చదువుతున్నవారు అర్హులు. ఏటా వేలాది మంది రాసే ఈ పరీక్షల్లో అప్పుడే ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుంచి వివిధ వృత్తుల్లో ఉద్యోగాలు చేస్తూ ఏపీ సెట్‌కు పోటీపడే అభ్యర్థులు కూడా ఉంటున్నారు.
పరీక్ష కఠినం.. అర్హుల సంఖ్యా తక్కువే..
ఏపీ సెట్‌ను ప్రభుత్వం ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు దాదాపు 30 వేల మంది దరఖాస్తు చేసుకుంటారు. యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్ నెట్ తరహాలో అత్యంత కఠినంగా పరీక్ష ఉంటుండటంతో ఏపీసెట్‌లో అర్హత పొందేవారి శాతం తక్కువగానే ఉంటోంది. గతేడాది ఏప్రిల్‌లో ఏపీ సెట్‌కు 30,448 మంది హాజరుకాగా కేవలం 8.03 శాతం అంటే 2,444 మంది మాత్రమే అర్హత సాధించారు.
గత కొన్నేళ్లుగా ఏపీసెట్‌లో అర్హత సాధించేవారిని పరిశీలిస్తే అర్హత శాతం సగటున 6–7 శాతం మధ్య ఉంటోంది. అయితే ఏపీసెట్‌లో అర్హత సాధిస్తేనే యూనివర్సిటీల్లో, కళాశాలల్లో అధ్యాపక పోస్టుల నియామక పరీక్షలకు అర్హత లభిస్తుంది. అలాగే పీహెచ్‌డీ ప్రవేశాలకు సైతం ఏపీసెట్‌లో క్వాలిఫై కావాల్సిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఏపీసెట్‌లో విజయం సాధించడానికి తమ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
డిసెంబర్‌లో యూజీసీ నెట్!
కాగా, రాష్ట్రంలో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు తరహాలోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు (యూజీసీ నెట్)ను నిర్వహిస్తుంది. యూజీసీ ఏడాదిలో రెండు సార్లు.. జూన్, డిసెంబర్‌లలో క్రమం తప్పకుండా పరీక్షలు చేపడుతుంది. ఈ ఏడాది డిసెంబర్‌కు రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. యూజీసీ నెట్‌ను దేశవ్యాప్తంగా ఏటా 5 నుంచి 7 లక్షల మంది అభ్యర్థులు రాస్తున్నారు.
గత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, అర్హత పొందేవారి శాతం కేవలం 7 నుంచి 14 శాతం మధ్యలోనే ఉంటుంది. మొత్తం 85 సబ్జెక్టుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో యూజీసీ నెట్‌ను నిర్వహిస్తారు. దీని ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్)తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు జరుగుతాయి. పీహెచ్‌డీ ప్రవేశానికి కూడా యూజీసీ నెట్ ఫలితం దోహదపడుతుంది.
యూజీసీ నెట్ డిసెంబర్ నోటిఫికేషన్ ఇలా..
దరఖాస్తులో సవరణలు: నవంబర్ 10 నుంచి 12 వరకు
పరీక్ష కేంద్రాలు, అడ్మిట్‌కార్డు, పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నారు


