
డీఎస్సీలో అంతుబట్టని నిబంధనలపై అభ్యర్థుల మండిపాటు
డిగ్రీలో 50 శాతం మార్కులపై స్పందించని కూటమి సర్కారు
ఈ నిబంధన 2011 జూలై ముందు వారికి వర్తించదని ఎన్‌సీటీఈ గెజిట్
తెలంగాణలో ఈ నిబంధనల మేరకే డీఎస్సీ పూర్తి.. ఏపీలో ఈ నిబంధనలు తుంగలో తొక్కిన వైనం
ఫస్ట్ లాంగ్వేజ్ ‘తెలుగు’ తప్పనిసరిపై సీబీఎస్‌ఈ వారికి అన్యాయం
9 రోజుల్లో ముగియనున్న దరఖాస్తు గడువు.. కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం అవుతున్న అభ్యర్థులు
సాక్షి, అమరావతి: డీఎస్సీ అభ్యర్థులను కూటమి ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోంది. అర్హత మార్కుల నిబంధన పేరుతో దరఖాస్తు దశలోనే ఎంతో మందిని అనర్హులను చేసింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనలను సైతం పరిగణనలోకి తీసుకోకుండా సగం మంది అభ్యర్థులపై ప్రాథమిక దశలోనే వేటు వేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు రిజర్వుడు కేటగిరీలో ఉన్న అభ్యర్థుల అర్హత మార్కులు తగ్గించినా, జనరల్ అభ్యర్థుల మార్కుల నిబంధనను సడలించలేదు.
డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తుకు ఇంకా తొమ్మిది రోజులే మిగిలి ఉండడంతో లక్షల మంది జనరల్ అభ్యర్థులు తమనూ పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవానికి టెట్ అర్హత సాధించిన అందరికీ డీఎస్సీ రాసేందుకు అర్హత కల్పించాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఆలోచించక పోవడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీ–2025 పేరుతో గత నెల 20న 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
దాదాపు 10 నెలల పాటు ఊరించి ఇచ్చిన ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు అభ్యర్థులకు తీరని నష్టం కలిగించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్జీటీ పోస్టులకు ఇంటర్మీడియట్‌లో, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. వాస్తవానికి 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ చేసిన వారికి ఈ నిబంధన వర్తించదని 2019 నవంబర్‌లో భారత ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినా.. ఇవేమీ పట్టించుకోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటోంది.
కనీస మార్కుల అంశంలో భిన్న వైఖరి
అభ్యర్థుల అర్హత మార్కుల అంశంలో అటు ప్రభుత్వం, ఇటు పాఠశాల విద్యాశాఖలు భిన్నంగా వ్యవహరించడం విస్తుగొలుపుతోంది. తొలుత ఇంటర్, గ్రాడ్యుయేషన్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, రిజర్వుడు అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులు తప్పనిసరి చేసింది. అనంతరం టీచర్ అర్హత పరీక్ష (టెట్)లో రిజర్వుడు అభ్యర్థులకు 40 శాతం మార్కులే పేర్కొన్నందున డీఎస్సీ అర్హత మార్కులను 40 శాతానికి తగ్గిస్తూ అనుబంధ జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. కానీ జనరల్ అభ్యర్థులకు మాత్రం 50 శాతం అలాగే ఉంచింది.
వాస్తవానికి జనరల్ అభ్యర్థులకు టెట్‌లో అర్హత మార్కులు 45 శాతం ఉన్నా, ఆ మేరకు అయినా తగ్గించక పోవడం గమనార్హం. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో గతేడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన డీఎస్సీ–2024లో తొలుత 50 శాతం మార్కుల నిబంధన విధించగా అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దాంతో ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు ఇంటర్మీడియట్, డిగ్రీలలో కనీస మార్కులు జనరల్ అభ్యర్థులకు 45 శాతం, రిజర్వేషన్ అభ్యర్థులకు 40 శాతానికి తగ్గించారు. ఈ మేరకు నియమకాలు కూడా జరిగిపోయాయి. కానీ ఏపీలో మాత్రం ఎన్‌సీటీఈ నిబంధనల అమలు చేయలేదు.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
ఉపాధ్యాయ నియామకాలపై రాజస్థాన్, ఉత్తరఖండ్ రాష్ట్రాల్లో ఇదే సమస్య ఉత్పన్నమైనప్పుటు అక్కడి అభ్యర్థులు ఆయా రాష్ట్రాల హైకోర్టులను ఆశ్రయించారు. దాంతో డిగ్రీలో కనీస అర్హత మార్కులపై ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఎన్‌సీటీఈకి మార్గదర్శకాలు విడుదల చేసింది. కనీస మార్కులపై తగిన నిర్ణయాన్ని ప్రకటించాలని, హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఉండేలా సూచనలు చేసింది. ఎన్‌సీటీఈ 2019 నవంబర్ 21న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీని ప్రకారం ‘ఉపాధ్యాయ నియామకాల్లో 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ లేదా సమానమైన కోర్సులో ప్రవేశం పొందిన వారికి గ్రాడ్యుయేషన్‌లో కనీస మార్కుల శాతం వర్తించదు’ అని ప్రకటించింది. 2011 ఆగస్టు 2నాటి ఎన్‌సీటీఈ గెజిట్ నోటిఫికేషన్‌లోనూ కనీసం 45 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, ఏడాది కాల పరిమితి గల బీఈడీ చేసినవారు డీఎస్సీకి అర్హులుగా పేర్కొంది. ఈ లెక్కన ఎలా చూసినా జనరల్ అభ్యర్థులకు డీఎస్సీ రాసేందుకు అర్హత మార్కులు 45 శాతం మించరాదు.
నిబంధనల్లో వివక్షపై తీవ్ర విమర్శలు
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల కోసం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ నిబంధనలు పూర్తి వివక్షతో ఉన్నాయని అటు అభ్యర్థులు, ఇటు ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 15లో 2007 వరకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశం పొందిన వారు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉంటే ఎస్జీటీకి అర్హులుగా పేర్కొంది. కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 29 జూలై 2011కు ముందు బీఈడీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా తత్సమాన కోర్సులో ప్రవేశం పొందిన వారికి గ్రాడ్యుయేషన్‌లో కనీస మార్కుల శాతం వర్తించదన్న ఎన్‌సీటీఈ గెజిట్ నోటిఫికేషన్ నిబంధనలను మెగా డీఎస్సీ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.
ఈ నిబంధనను తెలంగాణ డీఎస్సీ–2024 కోసం ఇచ్చిన సవరణ జీవో నంబర్ 14లో పేర్కొన్నారు. దీని ప్రకారం రిజర్వుడు అభ్యర్థులకు 40 శాతం, జనరల్ అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు. దీంతోపాటు ఎన్‌సీటీఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 2011 జూలై 29 నాటికి బీఈడీ, డీఈడీ చేసిన వారికి అర్హత మార్కుల నిబంధన తొలగించారు. కానీ ఏపీ ప్రభుత్వం ఎన్‌సీటీఈ నిబంధనలను పట్టించుకోకపోవడంతో అర్హులైన జనరల్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగినట్లయింది. దీనిపై జనరల్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
సీబీఎస్‌ఈ అభ్యర్థులకు అన్యాయం
పదో తరగతి వరకు సీబీఎస్‌ఈలో చదివి, డీఈడీ ఇంగ్లిష్ మీడియంలో పూర్తి చేసిన వారికీ ప్రభుత్వం డీఎస్సీలో అన్యాయం చేసింది. సీబీఎస్‌ఈ విద్యార్థులకు మొదటి భాష ఇంగ్లిష్ మాత్రమే ఉంటుంది. రెండో భాషగా తెలుగు/హిందీ/ ఉర్దూ తదితర భాషలు ఎంచుకుంటారు. అయితే, మొదటి భాష తెలుగు ఉంటేనే ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో సీబీఎస్‌ఈ అభ్యర్థులు నష్టపోతున్నారు. ఫిబ్రవరి–2024 డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఈ సమస్య లేదని అభ్యర్థులు చెబుతున్నారు. జూలై–2024 టెట్‌లోనూ కూటమి ప్రభుత్వం ఈ నిబంధన పేర్కొనలేదంటున్నారు. ఉన్న ఫళంగా నిబంధలు మార్చేసి అన్యాయం చేస్తే సహించమని, తాజా టెట్ అర్హత సాధించిన అందరికీ డీఎస్సీకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.