
అప్పట్లో కల్తీ మద్యం జాడే లేదు
అక్రమ, కల్తీ మద్యం సేవించిన కేసు ఒక్కటీ నమోదు కాలేదు
ఏ ఒక్కరూ అస్వస్థతకు గురికాలేదు, ఎవరూ మరణించలేదు
కల్తీ మద్యం తాగి వేల మంది మృతి చెందారని చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలే
తేల్చిచెప్పిన కేంద్ర హోంశాఖ ఎన్‌సీఆర్‌బీ నివేదిక
సాక్షి, అమరావతి: మద్యంపై ఎన్నికల ముందు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బ్యాచ్ చేసిన ప్రచారం అంతా పచ్చి బోగస్ అని తేలింది. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అక్రమ, కల్తీ మద్యం జాడే లేదని సాక్షాత్తూ కేంద్రహోంశాఖ వెలువరించిన నివేదిక స్పష్టం చేస్తున్నాయి. 2022–23లో రాష్ట్రంలో కల్తీ మద్యం కేసు ఒక్కటీ నమోదు కాలేదు. ఏ ఒక్కరూ అస్వస్థతకు గురికాలేదు. ఏ ఒక్కరూ మరణించలేదు. ఈ విషయాలన్నింటినీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన 2023 ఎన్‌సీఆర్‌బీ(నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో) నివేదిక స్పష్టంగా తేల్చిచెప్పింది.
నాణ్యత లేని కల్తీ మద్యం తాగి వేల మంది ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది అనారోగ్యానికి గురయ్యారంటూ ఎన్నికల ముందు చంద్రబాబుతోపాటు ఆయన భజన బృందం, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేశాయి. ఆ ప్రచారాలన్నీ పచ్చి అబద్ధాలేనని తాజా ఎన్‌సీఆర్‌బీ నివేదికలు కుండబద్దలు కొట్టాయి. అంటే ఎన్నికల ముందు ఆఖరికి మద్యం విషయంలో కూడా చంద్రబాబు దిగజారిపోయి విషప్రచారం చేశారనేది సుస్పష్టమైంది.
ఇవిగో గణాంకాలు
ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం... దేశంలో 2022లో అక్రమ, కల్తీ మద్యం కేసులు 507 కేసులు నమోదయ్యాయి. అక్రమ, కల్తీ మద్యం సేవించిన ఘటనల్లో 617 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 2022లో అక్రమ, కల్తీ మద్యం సేవించిన కేసు ఒక్కటీ నమోదు కాలేదు. ఎవరూ అస్వస్థతకు గురికాలేదు. ఒక్క మరణమూ నమోదు కాలేదు. 2022లో అక్రమ, కల్తీ మద్యం సేవించి బిహార్‌లో 134 మంది, కర్ణాటకలో 96 మంది, పంజాబ్‌లో 90 మంది, ఛత్తీస్‌గఢ్‌లో 60 మంది, జార్ఖండ్‌లో 55 మంది, ఉత్తరప్రదేశ్‌లో 50 మంది మరణించారు.
అలాగే 2023లో దేశంలో అక్రమ, కల్తీ మద్యం సేవించిన కేసులు 456 నమోదు కాగా ఈ ఘటనల్లో 522 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అక్రమ, కల్తీ మద్యం సేవించిన ఒక్క కేసూ నమోదు కాలేదు. ఎవరూ అస్వస్థతకు గురికాలేదు. మరణాలు సంభవించలేదు. 2023లో అక్రమ, కల్తీ మద్యం సేవించిన ఘటనల్లో అత్యధికంగా జార్ఖండ్‌లో 194 మంది మరణించగా, కర్ణాటకలో 79 మంది, బిహార్‌లో 57 మంది, ఛత్తీస్‌గఢ్‌లో 37 మంది, పంజాబ్‌లో33 మరణాలు, హిమాచల్ ప్రదేశ్‌లో 25 మంది మృతి చెందినట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది.