బాబు సర్కారు భూ పందేరం.. ఏడాదికి రూ.వెయ్యే! | Cabinet decision to lease govt lands to TDP offices: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బాబు సర్కారు భూ పందేరం.. ఏడాదికి రూ.వెయ్యే!

Nov 11 2025 4:05 AM | Updated on Nov 11 2025 4:05 AM

Cabinet decision to lease govt lands to TDP offices: Andhra Pradesh

టీడీపీ ఆఫీసులకు కారుచౌకగా ప్రభుత్వ భూములు లీజుకు

అసైన్డ్‌ చట్టంలో సవరణలపై ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదం

క్లీన్‌ ఎనర్జీ అవసరాలకు 99 ఏళ్లు అసైన్డ్‌ భూముల దీర్ఘకాలిక లీజు

లీజుకు ఇచ్చే హక్కు అసైన్డ్‌దారులకు కల్పిస్తూ చట్టంలో సవరణలు

భవానీ ద్వీపంలో ప్రైవేట్‌ సంస్థకు భూములు, రాయితీలు

ఇటీవల ఎస్‌పీబీఐలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం

అమరావతికి బడ్జెట్‌ బయట మరో రూ.9 వేల కోట్ల అప్పు

ఉండవల్లి వద్ద రూ.595 కోట్లతో రెండో ఫ్లడ్‌ పంపింగ్‌ స్టేషన్‌

పౌర సరఫరాల సంస్థ రుణాల గరిష్ట పరిమితి రూ.44 వేల కోట్లకు...

కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారథి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కార్యాల­యా­లకు ప్రభుత్వ భూములను కారుచౌకగా లీజు­కు కట్టబెడుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏడాదికి కేవలం రూ.వెయ్యి చొప్పున 33ఏళ్ల పాటు వీటిని ధారాదత్తం చేయనుంది. ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాలకు ప్రభుత్వ భూముల లీజు కాలం 33ఏళ్లుగా ఉంది. ఈ వ్యవధిని 66 సంవత్సరా­లకు, పార్టీలు మనుగడలో ఉంటే 99 ఏళ్లకు పెంచే అవకాశం కల్పించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకు­న్నారు. సమాచార మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించిన కేబినెట్‌ భేటీ వివరాల ప్రకారం...

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రవాణా శాఖకు ఇచ్చిన 1.60 ఎకరాల ప్రభుత్వ భూమిని రద్దు చేసి టీడీపీ జిల్లా ఆఫీసుకు కేటాయింపు. తిరు­పతి రూరల్‌ మండలం అవిలాలలో 2 ఎకరాల ప్రభుత్వ భూమి టీడీపీ కార్యాలయానికి కేటా­యింపు. వార్షిక రుసుము రూ.వెయ్యి చొప్పున 33 ఏళ్లపాటు లీజు కింద మచిలీపట్నం టీడీపీ జిల్లా అధ్యక్షుడు, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడికి భూమి బదిలీ.

⇒  గుంటూరు జిల్లా ఉండ­వల్లి పరిధిలోని భవానీ ద్వీపంలో ‘అడ్వెంచర్‌ థ్రిల్‌ సిటీ’ అభివృద్ధికి విశ్వనాథ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కన్వెన్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కన్సార్షియంకు భూమి కేటాయింపు, ప్రోత్సాహకాలు అందించేందుకు ఆమోదం. 
⇒ మచిలీపట్నం తల్లపాలెం వద్ద అమ్యూ­జ్‌­మెంట్‌ పార్క్, రిసార్ట్‌ల అభివృద్ధికి మైరా బే వ్యూ రి­సా­ర్ట్స్‌కు భూమి కేటాయింపు, ప్రోత్సాహకాలు.

⇒  క్లీన్‌ ఎనర్జీకి అవసరమైన అసైన్డ్‌ భూములను ప్రైవేట్‌ సంస్థలకు 99 ఏళ్ల దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు  1977 నాటి ఏపీ అసైన్డ్‌ భూముల (బదిలీ నిషేధం) చట్టంలో సవరణలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూముల (బదిలీల నిషేధం)–2025 ముసాయిదా బిల్లుకు ఆమో­దం. ఆర్డినెన్స్‌ జారీకి అంగీకారం.  

⇒ అమరావతిలో ప్రాజెక్టుల కోసం కొత్తగా బడ్జెట్‌ బయట రూ.9వేల కోట్లు అప్పు తెచ్చేందుకు సీఆర్‌డీఏకు అనుమతి. 
⇒ అమరావతి రాజధాని సిటీలోని ఎల్‌పీఎస్‌ జోన్ల అభివృద్ధికి రూ.7,500 కోట్లు రుణం పొందేందుకు ఏపీసీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతి. 
⇒  రాజధానిలో ముఖ్యమైన మౌలిక సదుపాయాల పనులు వేగవంతానికి ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీపీఎఫ్‌­సీఎల్‌) నుంచి రూ.1,500 కోట్ల రుణం తీసుకునేందుకు అంగీకారం. 

⇒  రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ యుటిలిటీల నిర్వహ­ణకు, బొగ్గు, విద్యుత్‌ కొనుగోలు నిమిత్తం సర్కారుకు అప్పు ఇవ్వడానికి ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు నుంచి లోన్‌ పొందేందుకు ఏపీపీఎఫ్‌సీఎల్‌ రూ.1,000 కోట్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు అంగీకారం. 
⇒  విద్యుత్‌ సంస్థలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలు రూ.5 వేల కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం హామీ ఇస్తూ జారీచేసిన జీవోకు, ఎస్‌బీఐ, యూబీఐ నుంచి ఏపీ డిస్కమ్స్‌ తీసుకునే రూ.1,150 కోట్ల రుణంపై ప్రభు­త్వ గ్యారెంటీకి, ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ కోసం మార్క్‌ఫెడ్‌ ద్వారా పౌర సరఫరాల సంస్థ రూ.5,000 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ జారీచేసిన జీవోకు ఆమోదం. 

⇒  ధాన్యం సేకరణ కోసం పౌర సరఫరాల సంస్థ తీసుకునే గరిష్ట రుణ పరిమితి రూ.39 వేల కోట్ల నుంచి రూ.44 వేల కోట్లకు పెంపు. 
⇒ కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం విమానాశ్రయాల భూ సేకరణకు హడ్కోరుణం చెల్లించేందుకు హామీతో ప్రభుత్వ ‘లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌’ జారీకి, ఏపీ ఫైర్‌ సర్వీసెస్‌ చట్టం–1999లో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ విడుదలకు ఆమోదం.
⇒ ముగ్గురు జీవిత ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు.

⇒  సీఆర్‌డీఏలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా చర్యల నిమిత్తం కమిషనర్‌ అనుమతికి అంగీకారం.
⇒ ఉండవల్లి వద్ద ఫ్లడ్‌ పంపింగ్‌ స్టేషన్‌–2కు రూ.595.01 కోట్లకు పరిపాలన అనుమతి
⇒ అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్‌ గ్రామాల లే అవుట్‌లో అనుసంధానం పనులను రూ.1,863 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చేందుకు అనుమతి.

⇒  ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్టం–1939కు సవరణ చేసే ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదం. 
⇒  వివిధ కేటగిరీల కాంట్రాక్టర్ల ద్రవ్య పరిమితులు, వారి రిజిస్ట్రేషన్‌ ఫీజును, సాల్వెన్సీ సర్టిఫికెట్‌ మొత్తాన్ని, గత అనుభవం, పనుల విలువను పెంచడానికి ఆమోదం.

⇒ ఏలూరు జిల్లా పోలవరంలోని 15.25 ఎకరాల ప్రభుత్వ భూమి ఏపీ టూరిజం అథారిటీకి ఉచితంగా బదిలీ.
⇒  రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ డేటా లేక్‌ ప్రాజె­క్టు డిజైన్‌.. అభివృద్ధి, అమలు, ఆపరేషన్లు, నిర్వహణ కోసం సిస్టమ్‌ ఇంటిగ్రేటర్‌గా నియా­మకానికి మెస్సర్స్‌ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ మూడేళ్ల కాలానికి షెడ్యూల్‌ విలువ రూ.181 కోట్లతో కోట్‌ చేసిన సింగిల్‌ బిడ్‌కు ఆమోదం. 

 క్వాంటమ్‌ మిషన్‌ నిపుణుల కమిటీ ముందు బిడ్ల సాంకేతిక మదింపును ఉంచి, సమీక్ష, సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని, టెండర్ల విధానాల ప్రకారం ఆర్‌ఎఫ్‌పీ పద్ధతిలో ఏక్యూసీసీ ప్రాజెక్టుకు టెండరింగ్‌ ప్రక్రియను ప్రారంభించడానికి సాంకేతిక చార్జీలు మినహాయించి రూ.99.62 కోట్లకు అంగీకారం. 
⇒ ఇటీవల ఎస్‌ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పలు సంస్థలకు భూముల కేటాయింపులు, రాయితీలకు ఆమోదం
⇒  పలు ఎనర్జీ, టిడ్కో ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు గ్రీన్‌సిగ్నల్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement