Butterfly Park: కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌కు మణిమకుటం

Butterfly Park: Kondapalli Reserve Forest Developing Butterfly Park In Nandigama - Sakshi

మిని జూ పార్క్‌ ఏర్పాటుకు సైతం ప్రతిపాదనలు 

శరవేగంగా జరుగుతున్న పనులు

వర్షాకాలం వచ్చిందంటే వాన జల్లులు, పిల్లకాలువల పరవళ్లతో పాటు పచ్చదనం వెల్లివిరుస్తుంది. అలాగే మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఎగిరే పూలు.. అదేనండీ సీతాకోక చిలుకలు వర్ణాల మేళవింపుతో కనువిందు చేస్తాయి. వీటిని చూసి ఆనందపడని హృదయం ఉండదంటే అతిశయోక్తి కాదు. ఒక సీతాకోక చిలుకను కనిపిస్తేనే తదేకంగా చూస్తూ ఉండిపోతాం.. అలాంటిది వందల సంఖ్యలో పలు రకాల సీతాకోక చిలుకలు రెక్కలు విప్పుతూ మన చుట్టూ తిరుగుతుంటే.. ఆ అనుభవం వర్ణనాతీతం. ఈ అద్భుతం కృష్ణా జిల్లాలో త్వరలోనే ఆవిష్కృతం కానుంది. ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో సీతాకోకచిలుకల పార్క్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

నందిగామ: కృష్ణా జిల్లాలో కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌ దాదాపు 24 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో పలు రకాల వన్య ప్రాణులు జీవిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం సమీపంలోని మూలపాడు వద్ద 63 రకాల సీతాకోక చిలుక జాతులున్నట్లు గుర్తించిన అటవీ శాఖాధికారులు వీటి పరిరక్షణ, పునరుత్పత్తిపై దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ఈ ప్రాంతానికే మణిహారంగా నిలిచేలా సీతాకోక చిలుకల పార్క్‌ అభివృద్ధికి సర్కారు పూనుకుంది. కేవలం సీతాకోక చిలుకల జాతిని పరిరక్షించడమే కాకుండా పెద్ద పార్క్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఈ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. 

అడుగడుగునా ఆకట్టుకునేలా...!
65వ నంబరు జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం మండలం, మూలపాడు గ్రామం వద్ద నుంచి మూడు కిలోమీటర్లు లోపలకు వెళ్తే.. ఈ పార్క్‌ను చేరుకోవచ్చు. పార్క్‌కు వెళ్లే దారి ప్రారంభం నుంచి పార్క్‌ గేట్‌ వరకు సీతాకోక చిలుకల్లోని రకాలు, వాటి ప్రాముఖ్యతలు, ప్రకృతికి అవి చేసే మేలు, వాటి జాతులు... ఇలా అన్ని వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ ద్వారాన్ని తీర్చి దిద్దిన తీరు అమోఘం అని చెప్పక తప్పదు. అదేవిధంగా చిన్నారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా సీతాకోక చిలుకల ఆకారంలోనే ఏర్పాటుచేసిన బల్లలు కూడా ఎంతో అందంగా కన్పిస్తాయి. చివరకు గార్డెనింగ్‌ కూడా సీతాకోక చిలుక ఆకారంలోనే ఏర్పాటుచేయడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. 

సీతాకోక చిలుకల పరిరక్షణే ధ్యేయం..
ఈ ప్రాంతంలో ఉన్న 63 రకాల సీతాకోక చిలుకలను పరిరక్షించడమే ధ్యేయంగా అటవీ శాఖాధికారులు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా అవి ఎక్కువగా ఇష్టపడి మకరందాన్ని గ్రోలే పుష్ప జాతులను పెంచుతున్నారు. జూలై నుంచి అక్టోబర్‌ మాసాల్లో వర్షా కాలం సీజన్‌లో వీటి పునరుత్పత్తి జరుగుతుంది. అప్పటికి పార్క్‌ను సిద్ధం చేయాలని అటవీ శాఖాధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత అతి పెద్ద సీతాకోక చిలుకల పార్క్‌గా ఇది నిలుస్తుందని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. 

అదనపు ఆకర్షణగా ట్రెకింగ్‌.. 
ప్రస్తుతం ట్రెకింగ్‌కు మంచి క్రేజ్‌ ఉంది. చిన్నారులు మొదలుకొని వృద్ధుల వరకు చాలా మంది దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. సీతాకోక చిలుక పార్క్‌కు సమీపంలోనే ట్రెకింగ్‌ కూడా ఉండటం అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. మొత్తానికి అతి త్వరలోనే జిల్లా వాసులకు ఓ మంచి ఆహ్లాదకరమైన, రమణీయమైన పార్క్‌ అందుబాటులోకి రానుంది.

జూ పార్క్‌ ఏర్పాటుకు సైతం ప్రయత్నాలు.. 
కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌ ఎంతో అందమైన ప్రాంతం. అందులో సీతాకోక చిలుకల పార్క్‌ ఏర్పాటుచేయడం ద్వారా మరింత శోభ సమకూరనుంది. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో సీతాకోక చిలుకలు ప్రధాన భూమిక పోషిస్తాయి. అటువంటి వాటిని పరిరక్షించుకోవడంతోపాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడం కోసం ఈ పార్క్‌ ఉపయోగపడుతుంది. దీనికి అదనంగా మినీ జూ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు సైతం ప్రయత్నిస్తున్నాం.
– బి.లెనిన్‌కుమార్, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్, కొండపల్లి సెక్షన్‌
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top