
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు సకాలంలో నిధులు విడుదల చేసి సహకరించాలని కేంద్ర జలశక్తి శాఖ నూతన కార్యదర్శి పంకజ్ కుమార్‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనాతో కలిసి పంకజ్‌కుమార్‌తో బుగ్గన భేటీ అయ్యారు. అనంతరం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడారు. ‘నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో జలశక్తి కార్యదర్శి పంకజ్ కుమార్‌కు పోలవరం పురోగతి, ఇతరత్రా కార్యక్రమాలు వివరించాం. సీఎం జగన్ ఆదేశాల మేరకు గత టీడీపీ ప్రభుత్వం చేసిన పొరపాట్లపై..కొన్ని నెలలుగా ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన దిద్దుబాటు చర్యలు వివరించాం.
వీటిని పరిశీలించి 2014లో కేంద్ర మంత్రివర్గం తీర్మానం ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరాం. అలాగే పౌరవిమాన యాన కార్యదర్శి కరోలాతోనూ భేటీ అయ్యాం. కర్నూలు విమానాశ్రయం నుంచి వాణిజ్య కార్యకలాపాలు మొదలుపెట్టి త్వరలోనే ప్రారంభించాలని కోరాం. అదే విధంగా విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను శుక్రవారం కలిసి రివర్స్ పంపింగ్‌తో తక్కువ ఖర్చుతో విద్యుత్ ద్వారా నీరు నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు హైడల్ పవర్స్ ప్రొడ్యూస్ చేసే అప్పర్‌సీలేరు ప్రాజెక్టుకు సహకరించాలని కోరాం. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రాజెక్టును మోడల్ ప్రాజెక్టుగా చేపట్టాలని కోరాం.
గత ప్రభుత్వాలు తీసుకున్న రుణాలపై వడ్డీలు తగ్గించాలని విజ్ఞప్తి చేశాం. పాత అప్పులు, ఖర్చులు తగ్గించే యత్నంలో భాగంగా ఆర్కేసింగ్‌తో చర్చలు జరిపాం. కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు చేశాం. రాష్ట్రానికి జరపాల్సిన కేటాయింపులు ఆలస్యం చేయొద్దని కోరాం. ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి ఆ అంశాన్ని ప్రస్తావించాం. పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వాలని, విభజన చట్టంలో అమలుకు నోచుకోని అంశాలపై దృష్టి సారించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి అన్నింటా సహకరించాలని కోరాం’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరించారు.